Thursday, April 25, 2024
- Advertisement -

మ‌హాభార‌త్ ఫేమ్ ప్ర‌వీణ్ కుమార్ సోబ్తీ అస్త‌మ‌యం

- Advertisement -

భీముడంటే అత‌డేనేమో అనిపిస్తుంది. కోట్లాది భార‌తీయుల‌ను అల‌రించిన మ‌హాభార‌త్ సిరియ‌ల్ లో భీముడిగా న‌టించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన ప్ర‌ముఖ న‌టుడు ప్ర‌వీణ్ కుమార్ సోబ్తీ ఇక లేరు. ఢిల్లీ అశోక్ విహార్ లోని త‌న నివాసంలో గుండెపోటుతో క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 74 సంవ‌త్స‌రాలు. సోమ‌వారం ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు డాక్టర్‌ను పిలిపించారు. ఆయన వచ్చి ఆసుపత్రికి తరలించేలోపే ప్రవీణ్‌ తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది.

న‌టుడు మాత్ర‌మే కాదు.. ప్ర‌వీణ్ కుమార్ సోబ్తీ మంచి అథ్లెట్ కూడా. 20 ఏళ్ల వయసులో ఆయ‌న బీఎస్ఎఫ్ లో చేరారు. అక్కడే ఆయన అథ్లెటిక్‌ నైపుణ్యాలను గుర్తించి అధికారులు ప్రోత్సహించారు. డిస్కస్‌ త్రో, హ్యామర్‌ వంటి ఆటల్లో ఎన్నో అథ్లెటిక్‌ పోటీల్లో పాల్గొన్నారు. ఏషియన్‌ గేమ్స్‌లో 1966, 1970ల్లో రెండు స్వర్ణాలు సహా నాలుగు పతకాలు సాధించారు. 1966లో జరిగిన కామన్వెల్త్‌ క్రీడల్లో హ్యామర్‌ త్రోలో రజత పతకం గెలిచారు. అథ్లెట్ లో మంచి పాపులారిటీ సాధించిన ప్ర‌వీణ్ ఆ త‌ర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టారు. 1988లో ప్రసారమైన ప్రముఖ టీవీ సీరియల్‌ ‘మహాభారత్‌’లో ఆయ‌న భీముడిగా న‌టించిన పాత్ర ఇప్ప‌టికీ ప్రేక్ష‌కుల మ‌దిలో చెర‌గ‌ని ముద్ర వేసింది.

దాదాపు 50కి పైగా చిత్రాల్లో సహాయనటుడిగా మెప్పించారు. 1990ల్లో వచ్చిన ‘కిష్కిందకాండ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యారు. ఆ సినిమాలో ట్రక్కు డ్రైవర్‌గా న‌టించి మెప్పించారు. సినిమాలను వదిలి 2013లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ తరఫున పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత ఏడాదే బీజేపీలో చేరారు. ప్రవీణ్‌కు భార్య, కుమార్తె ఉన్నారు. ఆయన మృతి పట్ల ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -