విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో తరుచూ వివాదాలు చోటుచేసుకోవడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. అమ్మవారి ఆలయంలో నిర్వహణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. నాలుగు రోజుల కిందట అమ్మవారికి ఒక భక్తురాలు సమర్పించిన ఖరీదైన చీర కనపడకపోవడం, స్వయంగా పాలకమండలి సభ్యురాలిపైనే ఆరోపణలు రావడంతో తీవ్ర వివాదం చెలరేగింది.
ఈ వివాదంపై ఈవో పద్మ, పాలక మండలి ఛైర్మన్ గౌరంగబాబుకు భక్తురాలు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు.ఈ నేపథ్యంలో చీర అదృశ్యం కావడం వెనక ఉన్న పాత్రపై ఈవో పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. వైదిక కమిటీ సభ్యుల సమక్షంలో చీరల విభాగానికి చెందిన నాగమణి నుంచి సూర్యలత చీరెను తీసుకువెళ్లినట్లు తేలింది.
దాంతో ఆమెను పదవి నుంచి 1987 ఎండోమెంట్స్ యాక్టు సెక్షన్ 28 ప్రకారం తొలిగించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉత్తర్వు కాపీలను దేవాదాయ శాఖ కమిషనర్, దుర్గగుడి ఈవో, ఛైర్మన్‌లకు పంపినట్లు జీవోలో పేర్కొన్నారు. తమ శాఖాపరమైన విచారణలో సూర్యలతపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలాయని, అందువల్ల తాము ఆమెను తొలగించామని దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి మన్మోహన్ సింగ్ వెల్లడించారు.
గత ఆదివారం నాడు రూ. 18 వేల విలువైన ఆషాఢ మాస సారెను కొందరు భక్తులు అమ్మవారికి బహూకరించగా, దాని విలువను తెలుసుకున్న సూర్యలత, ఆ చీరను తీసుకుని వెళ్లినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. తానేమీ భక్తులు పెట్టిన చీరను తీసుకెళ్లలేదని, తనకు భక్తులు ఇచ్చిన కాటన్ చీరను మాత్రమే తీసుకెళ్లానని ఆమె వాదించినప్పటికీ, సీసీటీవీ కెమెరాలు అమ్మవారి ముందున్న చీర ఎలా మాయం అయిందో కళ్లకు కట్టినట్టు చూపాయి.
