మున్సిపాలిటీల, స్థానిక సంస్థల ఎన్నికలు చాలా వరకూ ప్రభుత్వ నిర్ణయాను సారమే జరుగుతాయి. అధికారంలో ఎవరుఉంటే..
వారి ఇష్టానుసారమే ఈ ఎన్నికలు జరుగుతాయి. వెనుకటికి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏం బాగోలేకపోవడంతో.. స్థానిక, మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేసుకొంటూ వచ్చారు. ఎక్కడ ఎన్నికలు జరిగితే తాము చిత్తుగా ఓడిపోతామో.. అనే భయంలో కిరణ్ అండ్ కంపెనీ అలాగే బండి లాగించింది. ఎన్ని విమర్శలు వచ్చినా లెక్క చేయక దాదాపు మూడున్నర సంవత్సరాలకు మున్సిపాలిటీ, స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారు.
అలా తమకు అనుకూలంగా ఎన్నికలను వాయిదా వేయించుకొనే ప్రభుత్వాల్లో కేసీఆర్ ప్రభుత్వం కూడా ఒకటను కోవాల్సివస్తోంది.వాస్తవంగా చెప్పాలంటే ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు జరగాల్సింది. పాలకమండలి పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో ఎన్నికలు జరపాల్సింది. అయితే కేసీఆర్ ప్రభుత్వం అందుకు అంత సానుకూలంగా ఉన్నట్టులేదు. ఈ నేపథ్యంలో కొంతమంది దీనిపై కోర్టుకు వెళ్లారు. ఎన్నికలు ఎందుకు వాయిదా పడుతున్నాయో చెప్పాలని కోర్టు ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నింపజేశారు.
అలా కోర్టు నిలదీసే సరికి తెలంగాణ పురపాలక శాఖ, జీహెచ్ ఎంసీ అధికారులు స్పందించారు. ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తారు? అన్న ప్రశ్నకు బదులుగా.. డిసెంబర్ అనే సమాధానాన్ని ఇచ్చారు. ఈ ఏడాది డిసెంబర్ లో ఎన్నికలు నిర్వహిస్తామని వారు కోర్టుకు సమాచారం ఇచ్చారు. ఎన్నికలకు ముందే డివిజన్ల పునర్వ్యస్థీకరణ జరగాల్సి ఉందని.. చాలా పనులు ఉన్నాయని.. వాటన్నింటినీ పూర్తి చేయడానికి కొంత సమయం పడుతుందని.. డిసెంబర్ రెండో వారానికి అన్ని పనులూ పూర్తవుతాయని.. అప్పుడు ఎన్నికలు నిర్వహిస్తామని అధికారులు కోర్టుకు నివేదించారు. దీన్ని బట్టి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం డిసెంబర్ లో గ్రేటర్ ఎన్నికలను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉందనుకోవాల్సి వస్తోంది.
మరి ఈ అంశంపై ఇంకా కోర్టు విచారణ జరపాల్సి ఉంది. డిసెంబర్ లో ఎన్నికలన్న ప్రభుత్వ వాదనను విన్న కోర్టు తన తదుపరి వాయిదాలో ఈ అంశంపై విచారణ జరుపుతుందని తెలుస్తోంది. అప్పుడు జీహెచ్ ఎంసీ ఎన్నికలు ఎప్పుడనే అంశం గురించి క్లారిటీ వస్తుంది!
