కేంద్ర ప్రభుత్వం.. ఇప్పటికే నల్ల డబ్బు దాచుకున్న కుబేరుల గుండేల్లో గుబులు పుట్టించింది. ఇప్పుడు తన తర్వాతి లక్ష్యాన్ని మొదలు పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మన దేశంలో నల్ల డబ్బు ఎక్కువ ఉండేది… బంగారం, భూముల రూపంలోనే. దీంతో నోట్ల రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం బంగారంపై దృష్టి పెట్టే చాన్స్ ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఇళ్ళలో బంగారు నిల్వలు నియంత్రించే దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఆర్ధిక శాఖ దీనిపై స్పందించడానికి నిరాకరించినా బంగారం వ్యాపారస్తులు మాత్రం ముందు జాగ్రత్త పడుతున్నారు. గతవారం దేశంలో గోల్డ్ ప్రీమియమ్స్ రెండేళ్ళ గరిష్టానికి చేరింది. బంగారం దిగుమతులపై పరిమితులు విధించే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో బంగారం వ్యాపారస్తులు ఇప్పుడే పెద్ద ఎత్తున కొనుగోళ్ళు చేస్తున్నారు.
ప్రపంచంలో బంగారం కొనుగోళ్ళలో భారత్ రెండో స్థానంలో ఉంది. ఏడాదికి సుమారు వెయ్యి టన్నుల బంగారాన్ని భారత్ కొనుగోలు చేస్తోంది. ఇందులో సుమారు మూడోవంతు వ్యాపారం నల్లధనం తోనే జరుగుతున్నట్లు అంచనా. లెక్కల్లోకి రాని సొమ్ముతోనే బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే పెద్ద నోట్ల రద్దుతో నగదు ఆధారిత గోల్డ్ స్మగ్లింగ్ తగ్గినట్లు అధికారులు వెల్లడించారు.
Related
