దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఊరట కల్పించింది. డెలివరీ బాయ్స్‌పై తీవ్ర ఒత్తిడి పెంచుతున్న 10 నిమిషాల ఆన్‌లైన్ డెలివరీ విధానాన్ని ఎత్తివేయాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి మాండవీయ అధికారిక ఆదేశాలు జారీ చేశారు.
గత కొంతకాలంగా ఈ “10 నిమిషాల డెలివరీ” విధానం కారణంగా డెలివరీ పార్ట్‌నర్లు ప్రాణాపాయ పరిస్థితుల్లో పని చేయాల్సి వస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. వేగంగా డెలివరీ చేయాలనే ఒత్తిడితో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు, రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని కార్మిక సంఘాలు, సామాజిక కార్యకర్తలు కేంద్రం దృష్టికి తీసుకువచ్చారు.
ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం, గిగ్ వర్కర్ల భద్రతే ప్రధానమని స్పష్టం చేసింది. డెలివరీ సమయంలో అనవసరమైన టైమ్ ప్రెషర్ ఉండకూడదని, వారి ప్రాణాలు, ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని మంత్రి మాండవీయ పేర్కొన్నారు.
కొత్త నిర్ణయంతో ఇకపై డెలివరీ యాప్ కంపెనీలు వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని సరైన సమయ పరిమితులు నిర్ణయించాల్సి ఉంటుంది. అలాగే డెలివరీ బాయ్స్‌కు ఇన్సూరెన్స్, భద్రతా చర్యలు, పని గంటల నియంత్రణపై కూడా మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా లక్షలాది గిగ్ వర్కర్లకు ఊరట లభించనుంది. ఉద్యోగ భద్రత, గౌరవప్రదమైన పని పరిస్థితుల దిశగా ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు.
