Tuesday, May 7, 2024
- Advertisement -

అసలు విషయం అదే(నా?)!

- Advertisement -

ఒకరు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఇంకొకరు రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్న జనసేన పార్టీ అధ్యక్షుడు.. పవన్ కళ్యాణ్. ఈ ఇద్దరి భేటీ 2 తెలుగు రాష్ట్రాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అసలు ఉన్నట్టుండి ఇద్దరూ ఎందుకు సమావేశమయ్యారు.. ఏం మాట్లాడుకున్నారు.. రాజకీయాలకు సంబంధించి ఏం డిసైడయ్యారు.. వీటికి సమాధానాలు ఆ ఇద్దరి నుంచి రాకపోయినా.. పవన్ కళ్యాణ్ విలేకరులకు చెప్పిన విషయాలను బట్టి కొన్ని సంగతలు అర్థమవుతున్నాయి.

పవన్ మాట్లాడిన విషయాల్లో ముఖ్యంగా.. ఆంధ్రప్రదేశ్ లో బాక్సైట్ తవ్వకాలతో గిరిజనుల సమస్యలు, రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు, రాజధానిపైనే పాలన అంతా కేంద్రీకృతం కావడం.. ఇలా చాలా ముచ్చట్లే ఉన్నాయి. చివర్లో.. జనసేన రాజకీయాలపైనా పవన్ చిన్నపాటి క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీపై ఇప్పుడే ఏం చర్చించలేదని చెప్పిన పవన్.. అంతలోనే తన స్టయిల్ లో.. గాల్లో చెయ్యి ఊపుతూ మరీ.. సమయం వచ్చినపుడు మాట్లాడతానని కాస్త ఫోర్స్ గా చెప్పడం.. రాజకీయ వర్గాలను ఆలోచనలో పడేసింది. వరంగల్ ఉప ఎన్నికపై ఏమీ మాట్లాడని పవన్ కళ్యాణ్.. గ్రేటర్ ఎన్నికలపై మాత్రం సరైన టైమ్ లో మాట్లాడతాననడం వెనక అసలు ఉద్దేశం ఏంటన్న చర్చ మొదలైంది.

పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా జనసేనను తీర్చిదిద్దేందుకు తన దగ్గర ఆర్థిక స్థోమత లేదంటూనే… చాలా మంది తనతో టచ్ లో ఉన్నట్టు పవన్ స్పష్టం చేశారు. అందరితో మాట్లాడి త్వరలో నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. అంటే.. రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలోకి వచ్చేందుకు కర్చీఫ్ వేసుకునే ప్రయత్నాల్లో కూడా ఉన్న విషయాన్ని జనసేన అధినేత క్లియర్ చేసేశారు. మరో విషయం.. రాజకీయాలపై మాట్లాడేందుకు తను మాట్లాడుతున్న సందర్భం సరైన వేదిక కాదని పవన్ చెప్పారు. అంటే.. అన్నీ నిర్ణయించుకుని త్వరలోనే ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో నోరు విప్పుతారని అర్థం చేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు చూస్తుంటే.. విషయం చిన్నదే అయినా.. గోల్ మాత్రం పెద్దదే అన్నట్టు కనిపిస్తోందని కొందరు చెబుతున్నారు. అందరూ అంచనా వేస్తున్నది నిజమే అయితే.. త్వరలోనే పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి రాజకీయాల్లో రావడం ఖాయమన్న మాట వినిపిస్తోంది. అది కూడా తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో జరిగే గ్రేటర్ ఎన్నికలతోనే జనసేన రాజకీయ ప్రస్థానం ప్రారంభం కానుందని పొలిటికల్ రూమర్లు మొదలయ్యాయి. ఇందులో వాస్తవం తేలాలంటే.. పవన్ మళ్లీ పొలిటికల్ స్క్రీన్ పై కనిపించాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -