వైజాగ్ పర్యటన నేపథ్యంలో పవన్ జగన్‌పై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ. పవన్‌కు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే హక్కులేదంటూ దుమ్ముదులిపారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన ప్రతీ అరాచకానికి, అన్యాయానికి, రాజ్యాంగ ఉల్లంఘనకు, నేరాల్లో పవన్ కూడా భాగస్వామే అంటూ ధ్వజమెత్తారు. కొత్తగా పెట్టుకున్న పార్టీలు అధికారపార్టీ వైఫల్యాన్ని ప్రశ్నించటం చూసాం గానీ పవన్ విచిత్రంగా ప్రతిపక్షంపై విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
పోయిన ఎన్నికల్లో మిత్రపక్షాలుగా పోటిచేసినందున పవన్ కూడా ప్రభుత్వం చేసిన పాపాల్లో భాగస్వామ్యం ఉందన్నారు.విభజన హామీలు అమలు కాకపోవటానికి, రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం కాకపోవటానికి పవన్ కూడా బాధ్యుడేనంటూ దులిపేసారు. ఓటుకునోటు కేసులో చంద్రబాబుపై పవన్ ఎందుకు నోరెత్తటం లేదని ప్రశ్నించారు.
నడిరోడ్డుపై పార్టీని అమ్మిన చరిత్రను చూసి నేర్చుకోవాలా అని ప్రశ్నించారు. ఎనిమిదేళ్ల క్రితం తన అన్నకు అన్యాయం జరిగిందని.. అలా అన్యాయం చూసి కడుపు మండిందంటున్న పవన్ కల్యాణ్… మరి నాలుగేళ్లుగా చంద్రబాబు అరాచకపాలనతో జనం పడుతున్న కష్టాలను చూసినప్పుడు కడుపు మండలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు నుంచి ఏ తాయిలాలు తీసుకుని కడుపు మంట చల్లార్చుకున్నారో చెప్పాలని నిలదీశారు. క్యారెక్టర్లు మార్చడానికి సినిమాకాదని ఇది రాజకీయం అని ఎద్దేవ చేశారు.
