Monday, April 29, 2024
- Advertisement -

2019లో ఏ పార్టీ గెల‌వ‌బోతోంది..!

- Advertisement -

ఆంధ్రప్ర‌దేశ్‌లో 2019 ఎన్నిక‌ల్లో ఏ పార్టీ గెల‌వ‌బోతోంది. ఎవ‌రికి విజ‌యావ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఎవ‌రు గ‌ద్దెనెక్క‌నున్నారు.. ఇప్పుడు రాష్ర్టంలో ఎక్క‌డ చూసినా ఇదే చ‌ర్చ‌. ఏ ఇద్ద‌రు ఒక‌చోట చేరినా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రికి గెలుపు అవ‌కాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎవ‌రు వ‌స్తార‌నే దానిపైనే చ‌ర్చించుకుంటున్నారు. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌లు ఎవ‌రూ ఊహించ‌లేనంత ర‌స‌వ‌త్త‌రంగా ఉండ‌బోతున్నాయ‌న్న‌ది మాత్రం వాస్త‌వం. రాష్ర్టంలో ప్ర‌స్తుతం ఉన్న‌వి.. 175 అసెంబ్లీ సీట్లు. వీటిలో ప్ర‌తి ఒక్క‌టీ కీల‌కంగానే ఈసారి ఎన్నిక‌ల్లో మార‌బోతోంది. 2014 ఎన్నిక‌ల‌లో రెండు పార్టీలు హోరా హోరీగా పోటీ ప‌డ‌డంతో ఒక‌రికి ఆధిక్యం వ‌చ్చింది. కానీ.. ఈసారి రాష్ర్టంలో జ‌న‌సేన రాక‌తో త్రిముఖ పోరు ఉండ‌బోతోంది. ఏ ఒక్క‌రికీ స్ప‌ష్ట‌మైన మెజార్టీ వ‌స్తుంద‌నే న‌మ్మ‌క‌మైతే ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో లేదు. తెలుగుదేశం, వైసీపీతో పాటూ జ‌న‌సేన కూడా ఈసారి రాష్ర్టంలోని 175 స్థానాల్లో పోటీ చేయ‌నున్న‌ట్టు ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. ఆ పార్టీకి అభ్య‌ర్థుల కొర‌త ఉన్న‌ప్ప‌టికీ.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్రేజ్ వ‌ల్ల ఖ‌చ్చితంగా కొన్ని ఓట్లు చీలిపోయి జ‌న‌సేన‌కు ప‌డ‌తాయి. అభ్య‌ర్థి ఎవ‌ర‌న్న‌ది చూడ‌కుండా.. ప‌వ‌న్ అభిమానులు జ‌న‌సేన‌కు ఓట్లేసేస్తారు. దీనివ‌ల్ల గ‌త ఎన్నిక‌ల్లో మాదిరిగా.. తెలుగుదేశం, వైసీపీల్లో ఎవ‌రికో ఒక‌రికి దెబ్బ‌ప‌డ‌డం ఖాయం. నిజానికి ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాక‌తో రెండు రకాల వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఈ రెండు వాద‌న‌ల్లో ఒక‌టి అధికార తెలుగుదేశం పార్టీకి లాభిస్తుంద‌ని అంచ‌నా ఉండ‌గా.. రెండోది ప్ర‌తిప‌క్ష వైసీపీ పార్టీకి క‌లిసి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఏదేమైనా కింగ్‌పిన్ ఈసారి జ‌న‌సేన కాబోతోంది.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ రాక‌తో గ‌త ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీకి కొమ్ముకాసిన కాపులు.. ఈసారి జ‌న‌సేన వైపు వెళ్లిపోతార‌నేది ఇప్ప‌టికే స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది. దీనివ‌ల్ల గ‌త ఎన్నిక‌ల్లో తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రిలో గ‌ట్టి దెబ్బ‌త‌గిలిన జ‌గ‌న్ పార్టీకి ల‌బ్ధి చేకూర‌నుంది. జ‌గ‌న్‌కు కాపుల ప్రాభవం అధికంగా ఉన్న ఈ రెండు జిల్లాల్లోని 34లో ఐదు కూడా రాలేదు. తెలుగుదేశం పార్టీకి ఏకంగా 27 సీట్లు ఈ రెండు జిల్లాల్లోనే వ‌చ్చాయి. అంత‌కుముందు 2009 ఎన్నిక‌ల్లో ఈ రెండు జిల్లాల్లో చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీ అత్య‌ధిక సీట్లు గెలుచుకుంది. అంటే.. ఈసారి జ‌న‌సేన‌కు ఈ రెండు జిల్లాలు ఆయువు ప‌ట్టుకాబోతున్నాయి. జ‌న‌సేన ఇక్క‌డ సీట్ల‌ను చీల్చేస్తే.. అంతిమంగా జ‌గ‌న్‌కు లాభం చేకూర‌నుంది. కోస్తాంధ్రాలోని ప్ర‌తి జిల్లాల్లోనూ స్ప‌ష్ట‌మైన కాపుల ఓటు బ్యాంకు ఉంది. ఈ ఓట్ల‌న్నీ చీలిపోతే.. గ‌త ఎన్నిక‌ల్లో కొద్ది మెజార్టీతో గెలుపొందిన సీట్ల‌ను ఈసారి తెలుగుదేం పార్టీ చేజార్చుకోబోతోంద‌నే వాద‌న ఉంది.

జ‌న‌సేన పార్టీ రాక‌తో.. జ‌గ‌న్ పార్టీకి ప్ర‌త్య‌క్షంగానే దెబ్బ‌ప‌డ‌బోతోంద‌ని, ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు బ్యాంకును జ‌న‌సేన చీల్చేస్తే.. తెలుగుదేశం పార్టీకి లాభం చేకూర‌నుంది. 2009 ఎన్నిక‌ల్లో నాటి ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న చంద్ర‌బాబు.. కీల‌క‌మైన పార్టీల‌న్నింటితో క‌లిపి మ‌హాకూట‌మిగా ఏర్ప‌డినా గెల‌వ‌లేక‌పోయారు. వైఎస్ ప్ర‌భుత్వంపై తీవ్ర వ్య‌తిరేక‌త ఉన్నా.. మ‌హాకూట‌మి ప్ర‌భావం చూపించ‌లేక‌పోవ‌డానికి కార‌ణం.. ప్ర‌జారాజ్యం పార్టీ. ఆ ఎన్నిక‌ల్లోనే చిరంజీవి త‌న కొత్త పార్టీ ప్ర‌జారాజ్యంతో ఎన్నిక‌ల బ‌రిలో దిగారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటును చీల్చ‌డంతో.. మ‌ళ్లీ అధికార కాంగ్రెస్ పార్టీకే ల‌బ్ధి చేకూరింది. ఈసారీ ప‌వ‌న్ జ‌న‌సేన పార్టీ రాక‌తో అదే జ‌ర‌గబోతోంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఒక‌వేళ జ‌న‌సేన‌, వైసీపీ పార్టీలు కేంద్రంలోని బీజేపీ చొర‌వ‌తో ఒక్క‌టిగా క‌లిసి బ‌రిలోనికి దిగితే మాత్రం రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మార‌బోతున్నాయి. అయితే.. పూర్తిగా మొత్తం స్వీప్ చేయ‌డం.. లేదంటే.. అధికారానికి అవ‌స‌ర‌మైన మెజార్టీని తెచ్చుకోవ‌డం ఖ‌చ్చితంగా జ‌రుగుతుంది. అయితే.. ఎన్నిక‌ల‌కు మ‌రో ఆరు నెల‌లుండ‌డంతో ఈలోగా ఇప్పుడున్న ప‌రిస్థితులు ఇలాగే ఉంటాయ‌ని చెప్ప‌లేం. ఎలాగైనా ఈసారి అధికారంలోనికి రావాల‌ని చంద్ర‌బాబు ఒక‌వైపు అన్ని ప్ర‌య‌త్నాలూ చేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో బాబొస్తే.. జాబు నినాదం ప్ర‌చారంతో గ‌ట్టెక్కిన చంద్ర‌బాబు.. ఈసారి అలాంటి ఏదో ఒక ప‌థ‌కం తేకుండా ఉంటార‌ని అనుకోలేం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -