రాజమండ్రి సెంట్రల్ జైలులో ములాఖత్‌లో భేటీ అయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్,బాలకృష్ణ. భేటీ అనంతరం మాట్లాడిన పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుతో తనకు విబేధాలు ఉండొచ్చు… అభిప్రాయ బేధాలు ఉండొచ్చు, పాలసీ పరంగా విబేధించి ఉండొచ్చు మా ఇద్దరి టార్గెట్ జగనేనని చెప్పారు. ఇక బాబుతో విభేదాలున్నా ఎప్పుడు చంద్రబాబు అనుభవాన్ని, ఆయనకు ఉన్న సమర్థతను ఎప్పుడూ తక్కువ అంచనా వేయలేదున్నారు. ఎప్పుడు హైటెక్ సిటీ నుండి వెళ్లినా చంద్రబాబు విజన్‌ని గుర్తు చేసుకుంటానని, అలాంటి వ్యక్తికి ఇలాంటి పరిస్థితి రావడం బాధకరమన్నారు.
చంద్రబాబును అన్యాయంగా రిమాండ్‌కు పంపించారు.. సంఘీభావం తెలిపేందుకు వచ్చానని చెప్పుకొచ్చారు పవన్. 2014లో నరేంద్ర మోడీకి మద్దతు తెలిపినప్పుడు నన్ను అందరూ తిట్టారు…దేశానికి బలమైన నాయకుడు కావాలనే ఆనాడు మోడీకి మద్దతు ఇచ్చాను అని చెప్పారు.తాను ఒక నిర్ణయం తీసుకుంటే వెనక్కు వెళ్లను… దానికి అనేక కారణాలు ఉంటాయన్నారు.
2014లో బీజేపీ, తెలుగుదేశంకు మద్దతు ఇవ్వడానికి కూడా ముఖ్యకారణం ఉందన్నారు. విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌కు అనుభవం కలిగిన నాయకుడు ఉండాలని నేను భావించా. అందుకే అప్పుడు చంద్రబాబుకు మద్దతు ఇచ్చానని తెలిపారు. 2020 విజన్ అని అప్పట్లో చంద్రబాబు చెప్పినప్పుడు. చాలా మందికి అర్థంకాలా.. ఇవాళ మాదాపూర్‌కు వెళ్తె తెలుస్తుందన్నారు. 2019 ఎన్నికల సమయంలో కేవలం రాజకీయ పార్టీల పరంగా భిన్నమైన ఆలోచనలతో మాత్రమే విడిగా పోటీ చేశాం అని అయినా తానేనెప్పుడూ చంద్రబాబును వ్యక్తిగతంగా వ్యతిరేకించలేదని తెలిపారు. మొత్తంగా ఈ భేటీ అనంతరం పవన్ మాటలను పరిశీలిస్తే టీడీపీ – జనసేన కలిసి పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది.
