Thursday, May 9, 2024
- Advertisement -

మరో వివాదంలో నిమ్మగడ్డ రమేష్‌.. పోలీసులకు ఫిర్యాదు

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ప్రభుత్వాన్ని మోసం చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంటూ నిమ్మగడ్డపై ఏపీ ప్రజా న్యాయవేదిక అధ్యక్షుడు బి.శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లో ఉంటూ విజయవాడలో ఉన్నట్లుగా ఇంటి అద్దె తీసుకున్నందుకు నిమ్మగడ్డపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో శ్రీనివాసరావు‌ పేర్కొన్నారు.ఇదే అంశంపై సమాచార హక్కు ఉద్యమ ఐక్య వేదిక(యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ క్యాంపెయిన్) కూడా గవర్నర్ విశ్వభూషణ్‌కు ఫిర్యాదు చేసింది.నిమ్మగడ్డపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కోరింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ ప్రభుత్వం నుంచి పొందుతున్న వేతన వివరాలను సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం ద్వారా తీసుకున్న వేదిక ప్రతినిధులు.. ఆ వివరాల కాపీలను ఫిర్యాదుకు జత చేశారు.

హైదరాబాద్‌లో నివాసం ఉండడం ఎంతవరకు సమంజసం?
‘రాజ్యాంగబద్ధమైన ఉన్నత స్థాయి పదవులలో ఉన్న వ్యక్తులు అధికారులకు, ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. మేము ఆర్టీఐ చట్టం ద్వారా పొందిన వివరాల ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి నెలా రూ. 3,19,250 జీతం పొందుతున్న నిమ్మగడ్డ రమేష్‌ అసలు రాష్ట్రంలోనే నివాసం ఉండడం లేదు. రాజధాని హైదరాబాద్‌ నుంచి అమరావతికి తరలివచ్చినప్పటి నుంచి, ఇక్కడ సరైన సౌకర్యాలు లేనప్పటికీ రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హైకోర్టు న్యాయమూర్తులు, ఇతర ఉన్నత స్థాయి అధికారులు విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లోనే నివాసం ఉంటున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ కార్యాలయం కూడా హైదరాబాద్‌ నుంచి విజయవాడకు మారినా ఎన్నికల కమిషనర్‌ మాత్రం హైదరాబాద్‌ నుంచి విజయవాడకు ఇప్పటివరకు మారలేదు. స్థానిక ఎన్నికల నిర్వహణను పర్యవేక్షించాల్సిన కమిషనర్‌ రాష్ట్ర ప్రజలకు ఏ మాత్రం అందుబాటులో లేకుండా హైదరాబాద్‌లో నివాసం ఉండడం ఎంతవరకు సమంజసం?’ అని సమాచార హక్కు ఉద్యమ ఐక్య వేదిక ప్రతినిధులు ప్రశ్నించారు.

జగన్‌ ప్రభుత్వం వర్సెస్‌ నిమ్మగడ్డ
కొన్నాళ్లుగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మధ్య యుద్ధం నడుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో అటు ప్రభుత్వం-ఇటు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్టుల్లో పోరాడుతున్నారు. ఈ ఏడాది మార్చిలో తమను సంప్రదించకుండానే ఎన్నికలు వాయిదా వేయడంపై ప్రభుత్వం మండిపడింది. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నిమ్మగడ్డ రమేష్ ఆయనకు మేలు చేసేందుకే కరోనా పేరుతో స్ధానిక పోరును వాయిదా వేశారంటూ స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగనే ఆరోపించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఎస్ఈసీ పదవీకాలాన్ని తగ్గిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడం., దీనిపై కోర్టులో నిమ్మగడ్డ గెలవడం.., మళ్లీ బాధ్యతు తీసుకోవడం జరిగిపోయాయి. నిమ్మగడ్డ రీఎంట్రీ తర్వాత స్థానిక ఎన్నికలే కేంద్రంగా మళ్లీ యుద్ధం మొదలైంది

హైకోర్టు ఆదేశాలతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు నిమ్మగడ్డ రెడీ అవుతున్నారు. కానీ ఆయన పదవీకాలం మార్చితో ముగియబోతోంది. అప్పటి వరకు ఎన్నికలను వాయిదా వేయాలని జగన్‌ సర్కార్‌ భావిస్తోంది. ఎన్నికల ప్రొసీడింగ్స్ పై స్టే ఇవ్వాలని హై కోర్టులో పిటిషన్ వేసింది. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతుండగానే ఎన్నికలు నిర్వహించకూడదంటూ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది. వెంటనే ప్రభుత్వ ఆర్డినెన్స్ వస్తే ఆమోదించవద్దంటూ ఎస్ఈసీ..గవర్నర్ కు లేఖ రాశారు. ఇక కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కారణంగా ఎన్నికలకు సిబ్బందిని కేటాయించలేమంటూ ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -