Wednesday, April 24, 2024
- Advertisement -

గుప్పెడన్ని సీన్లు.. చిరకాలం గురుతులు.

- Advertisement -

‘శ్రీరామరాజ్యం’ సినిమా షూటింగ్ సమయంలో బాపు గారిని నటుడు మంచు విష్ణు కలిశారు. మీతో పనిచేసే అవకాశం కావాలి, ఈ చిత్రంలో ఏదైనా చిన్నపాత్రైనా ఫర్వాలేదు అన్నారట. దానికి బాపు గారు “అలా ఎందుకు? మనం తప్పకుండా చేద్దాం! నువ్వు​ హీరోగానే సినిమా చేద్దాం” అని సమాధానమిచ్చారు. ఆ తర్వాత ఆయన కన్నుమూశారు. మంచు విష్ణు కోరిక తీరలేదు. ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ “ఆ సినిమాలో బాపు గారు నాకు శ్రీరాముడి వేగు పాత్ర ఇచ్చినా చేసేవాడిని. ఉన్నది రెండు సీన్లే అయినా సినిమాను మలుపు తిప్పే పాత్ర అది” అని ఓ సందర్భంలో అన్నారు.

కొందరు నటులు చిత్రంలో ఒకటి, రెండు సీన్లే కనిపిస్తారు. అయితేనేం పోషించిన పాత్ర బలానికి వాళ్ల నటన తోడై ఆ పాత్రలో మనకు చిరకాలం గుర్తుంటారు. అలాంటి ‌ఓ ఐదు పాత్రలు మీకోసం..

*సుహాసిని (నువ్వు నాకు నచ్చావ్)
ప్రకాష్ రాజ్ చెల్లెలిగా, ఆర్తి అగర్వాల్ మేనత్తగా ఈ చిత్రంలో సూహాసిని కనిపించేవి నాలుగు సన్నివేశాలు. అయితే ఆ పాత్రకు అద్దిన షేడ్స్, ఆమె నటన కలగలిసి ఆ పాత్రను చిరకాలం గుర్తుండేలా చేశాయి. సినిమా నిడివి ఎక్కువయ్యిందని, సుహాసిని ఉన్న సీన్లు తీసేయాలని చిత్రం విడుదలకు ముందు అనుకున్నారట. అయితే అవే సినిమాకు బలం అని భావించి అలాగే ఉంచారు. ఈ చిత్రానికి గానూ సుహాసిని ఉత్తమ సహాయనటిగా నంది అవార్డు అందుకున్నారు.

*ఎం.ఎస్. నారాయణ (శివమణి)
“హలో.. షేక్ఇమామ్” అంటూ ఫోన్ మాట్లాడే పాత్రలో శివమణి చిత్రం ద్వారా కడుపుబ్బా నవ్వించిన ఎం.ఎస్.నారాయణ తన డేట్లు ఖాళీ లేక ముందుగా ఈ చిత్రాన్ని కాదనుకున్నారని సమాచారం. ఆ తర్వాత లంచ్ బ్రేక్‌ టైంలో రెండు, మూడు రోజులు షూటింగ్ చేసేసి మొత్తానికి పూర్తి చేశారు. చిత్రంలో​ ఈ ఎపిసోడ్ బ్రహ్మాండమైన హిట్ కావడమే కాక ఎం.ఎస్‌కు ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డు అందించింది.

*ఏవీఎస్(అన్నమయ్య)
“మద్భక్తా యత్ర గాయన్తి.. తత్ర తిష్ఠామి నారదా” అంటూ అన్నమయ్యకు గానమార్గాన్ని చూపించి, తంబూరను బహూకరించిన నారదుడి పాత్రలో ఏవీఎస్ చక్కగా ఒదిగిపోయారు. ఆ ఒక్క పాత్రతోనే తెలుగు తెరపై నారదుడిగా మెప్పించారు.

*తనికెళ్ల భరణి (మిస్టర్ పెళ్లాం)
రాజేంద్ర ప్రసాద్ పనిచేసే బ్యాంకుకు మేనేజర్‌గా భరణి నటన భలే గమ్మత్తుగా ఉంటుంది ఈ సినిమాలో. చిన్న నవ్వుతో విలనీ టచ్ చూపించడం మెచ్చదగిన వర్క్. ఉండేది రెండు, మూడు సీన్లే! తన కెరీర్లో తాను బాగా ఎంజాయి చేసిన పాత్రలో ఇదీ ఒకటి అంటారు భరణి.

*ఎం.ఎస్.నారాయణ(ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు)
అతను హఠాత్తుగా వస్తాడు. అతనితోపాటు హోరుగాలి వస్తుంది. అతనే ‘గాలి గన్నారావు’. ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు సినిమాలో అందరూ చాలా ఎంజాయి చేసిన పాత్ర ఇది. హడావిడిగా రావడం, గుక్క తిప్పుకోకుండా మాట్లాడటం, ఏదేదో వాగడం.. ఇవీ అతని లక్షణాలు. ఎం.ఎస్ కెరీర్లో మరపురాని పాత్ర.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -