ఎన్నికలొస్తే చాలు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు

- Advertisement -

ఎన్నికలు వస్తే చాలు కేసీఆర్ కు ఏపీ గుర్తొచ్చెస్తుంది. ఏపీ ప్రజలు, అక్కడి నాయకులు దొంగలు ద్రోహులుగా కనపడతారు. చంద్రబాబునాయుడుని తిట్టడం, అతడిని రెచ్చగొట్టడం, నీ అంతు చూస్తా ..మూడో కన్ను తెరిచేస్తా.. భస్మం చేసేస్తా..అంటూ విమర్శలతో విరుచుకుపడతాడు. చంద్రబాబు దుర్మార్గుడు అంటూ అంతెత్తున లేస్తాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డినీ వదలడు. కోట్లమంది గుండెల్లో మహానేతగా కొలువైన వైఎస్ చనిపోయారన్న స్పృహ కూడా ఉండకుండా ఆయనపై తిట్లపురాణం అందుకుంటాడు. దుర్గార్గుడు, దుష్టుడు, తెలంగాణ ద్రోహి అంటూ నోటికొచ్చినట్లు కేసీఆర్ మాటలదాడి చేస్తాడు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకున్నాడు వైఎస్ఆర్ అంటూ రంకెలేస్తాడు. అసలు వైఎస్ఆర్ చేపట్టినన్ని ప్రాజెక్టులు ఏ ముఖ్యమంత్రి అయినా చేపట్టారా ? రైతులు వ్యవసాయం మీద ఆయనకున్నంత ప్రేమ ఏ సీఎంకు అయినా ఉందా ? కానీ కేసీఆర్ కు ఎన్నికల వేళ మాత్రం వైఎస్ఆర్ గుర్తుకొస్తారు. అసెంబ్లీలో గతంలో పొగిడిన నోటితోనే వైఎస్ఆర్ ను ఎన్నికల సభల్లో తిట్టిపోస్తుంటారు.

మహాకూటమి విజయం సాధిస్తే తెలంగాణ ఆత్మగౌరవం అమరావతిలో పెట్టేస్తారంట. చంద్రబాబు కాంగ్రెస్ దోస్తీ కడితే తెలంగాణ పాలన ఢిల్లీలో ఉంటుందట. ఎన్నికలు వస్తే చాలు ఓటుకు నోటు కేసు గుర్తొస్తుంది కేసీఆర్ కు. తెలుగు తల్లి, తెలుగు భాష అంటూ కేసీఆర్ ను దోచుకున్నారంట. ఎప్పుడూ గుర్తు రాని కేసీఆర్ కు కరెక్టుగా ఎన్నికల వేళ ఆ ద్రోహాలు, దోపిడీలు గుర్తుకొస్తాయి. తెలుగు తల్లి, తెలుగు భాష అంటే చులకనా ? మరి కేసీఆర్ వాడేది ఏ భాష ? తెలంగాణ ప్రజలు తెలుగువాళ్లు కాదా ? తాను ఎవరికీ భయపడను అంటూనే చంద్రబాబుని, కాంగ్రెస్ నేతలను భయపెట్టాలని చూడటం ఏంటో కేసీఆర్ కే తెలియాలి. నాలుగేళ్లు మోడీ చంకలో ఉన్న చంద్రబాబుకు అప్పుడు తెలియలేదా ? మోడీ దొంగని…అంటూ కేసీఆర్ నిలదీస్తున్నారు. మరి టీడీపీ, చంద్రబాబు చంకలో దాదాపు 20 ఏళ్లు ఉన్న కేసీఆర్ కి ఆనాడు తెలియలేదా చంద్రబాబు దొంగ అని. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడే తెలిసిందా ? ఎవరు అంగీకరించినా లేకున్నా హైదరాబాద్ ను ఐటీ నగరంగా తీర్చిదిద్దిన ఘనత చంద్రబాబుదే. ఐటీ విప్లవాన్ని రాజధానికి తెచ్చి తెలంగాణ దశ దిశ మార్చిన ఘనుడు చంద్రబాబే. ఆ విషయాన్ని టీఆర్ఎస్ నేతలు కేసీఆర్ సహా అనేక సందర్భాల్లో అంగీకరించినవాళ్లే. కానీ ఎలక్షన్లు వచ్చే సమయానికి మాత్రం తన రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్ చంద్రబాబుని టార్గెట్ చేస్తారు. ఏపీ మది పడి ఏడుస్తారు. వాళ్లను తెలంగాణ ద్రోహులుగా, నేరస్తులుగా చిత్రీకరించి, ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చురాజేసి ఆ మంటతో చలి కాచుకోవాలని చూస్తుంటారు.

తెరవెనుక మాత్రం ఏపీ నాయకులు, వ్యాపారులకే తెలంగాణలోని అనేక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల కాంట్రాక్టులు కట్ట బెట్టారు. తన కుమారుడు, అల్లుడు వ్యాపారాలు ఏపీలో పాతుకుపోయాయి. కొత్తగా వ్యాపార సంస్థల్లో పెట్టుబడులు పెడుతున్నారు. మరి ఏపీ నేతలు అంత ద్రోహులు అయితే ఏపీలో పెట్టుబడులు ఎందుకు పెడుతున్నట్టో..? వైఎస్ఆర్, చంద్రబాబు తెలుగు రాష్ట్రాలకు ఎంతో సేవ చేశారు. కానీ కేసీఆర్ కు తన రాజకీయ ప్రయోజనాల కోసం దొంగలుగా, ద్రోహులుగా వారిని చిత్రీకరించి, ఇరు రాష్ట్రాల మధ్య అగ్గి రాజేసి ఓట్లు దండుకోవాలని చూడటం అలవాటైపోయింది. అసలు ఆనాడే చంద్రబాబు కేసీఆర్ కు మంత్రి పదవి పడేసి ఉంటే…ఉద్యమం రాష్ట్రం అంటూ ఇంత వరకూ వచ్చేవాడా ? అవన్నీ ప్రజలు మరిచిపోయారనుకుంటున్నాడా కేసీఆర్ ? ఎలక్షన్ల వేళ పదే పదే ఇలా విద్వేషాలు రెచ్చగొట్టి, తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెడదామనుకుంటే తగలబడిపోయేది అతడి పార్టీ, అతడి కొంపే.

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -