Friday, May 10, 2024
- Advertisement -

నేడే బంగ్లాతో భార‌త్ పోరు …. బోనీ కొడ‌తారా..?

- Advertisement -

కొలంబో వేదికగా జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్‌‌ని ఓటమితో ఆరంభించిన భారత్ జట్టు గురువారం రాత్రి 7 గంటలకి బంగ్లాదేశ్‌ను రెండో మ్యాచ్‌లో ఢీకొట్టనుంది. ఆతిథ్య శ్రీలంకతో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో బౌలర్లు విఫలమవడంతో భారత్ పేలవరీతిలో పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే.

తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ కోల్పోవడం, తొలి మ్యాచ్‌లో 175 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేకపోవడం వంటివి ఇప్పుడు భారత్‌ని ఆత్మరక్షణలోకి నెట్టేస్తున్నాయి. సీనియర్ క్రికెటర్లకి విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో మరోసారి కుర్రాళ్లు.. తమకి దక్కిన అవకాశం ఎలా వినియోగించుకుంటారో ఈరోజు తేలనుంది.

ముందుగా బ్యాటింగ్‌కు దిగితే కనీసం 200 పరుగులు చేయాలి. ప్రస్తుత మన బౌలింగ్‌ పరిమితులరీత్యా ఈ స్థాయి స్కోరుంటేనే గెలుపుపై నిశ్చింతగా ఉండగలం. దీనికి పునాది వేయాల్సింది కెప్టెన్‌ రోహిత్‌ శర్మనే. పేలవ ఫామ్‌ నుంచి అతడు త్వరగా బయటపడి… అద్భుతంగా ఆడుతున్న మరో ఓపెనర్‌ ధావన్‌కు తోడైతే ఇదేమంత కష్టం కాదు. బౌలింగ్‌లో తొలి మ్యాచ్‌లో సుందర్‌ మినహా అందరూ తేలిపోయారు. పేసర్లు శార్దుల్, ఉనాద్కట్‌ ప్రభావం చూపకపోవడంతో పార్ట్‌ టైమర్లను ఆశ్రయించాల్సి వచ్చింది. వీరితో పాటు చహల్‌ కూడా గాడిన పడాల్సిన అవసరం ఉంది.

ప్రత్యర్థి బంగ్లాదేశ్ కూడా కెప్టెన్, ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్ లేకుండానే బరిలోకి దిగుతోంది. గాయపడ్డ షకిబ్ స్థానంలో మహ్మదుల్లా తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. అయితే.. గత కొంతకాలంగా టెస్టులు, వన్డేలతో పోలిస్తే.. టీ20ల్లో బంగ్లాదేశ్ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. 2016 టీ20 ప్రపంచకప్‌లో ఈ పసికూన జట్టు దాదాపు భారత్‌ని ఓడించినంత పనిచేసింది. అప్పట్లో ధోనీ చివరి బంతికి తెలివిగా రనౌట్ చేయడంతో.. ఊపిరిపీల్చుకున్న సంగతి టీమిండియా మరిచిపోకూడదు.

ఎడమచేతి వాటం స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. దీంతో విజయ్‌ శంకర్‌ బెంచ్‌కు పరిమితం కావాల్సి ఉంటుంది. ఈ ఒక్కటి తప్ప మార్పులు ఉండకపోవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -