టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8 రౌండ్ శనివారం (ఫిబ్రవరి 21) నుంచి ప్రారంభం కానుంది. సెమీఫైనల్స్‌కు ఎవరెవరు చేరతారనే అంశంపై క్రికెట్ నిపుణులు అంచనాలు వేస్తున్నారు. ఇదే సమయంలో మాజీ పాకిస్తాన్ పేసర్ మహ్మద్ అమీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆతిథ్య దేశమైన భారత్ సెమీఫైనల్స్‌కు అర్హత సాధించదని ఆయన అభిప్రాయపడ్డారు.
స్లో అవుతున్న పిచ్‌లపై భారత్ ఇబ్బంది పడుతుందని, అందుకే టోర్నీ నుంచి నిష్క్రమించే అవకాశం ఉందని ఆమిర్ తెలిపారు. సూపర్ 8లో భారత్ దక్షిణాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్ జట్లను ఎదుర్కోనుంది. గ్రూప్ 1 నుంచి దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ సెమీస్‌కు వెళ్తాయని ఆయన అంచనా వేశారు.
పాకిస్తాన్ మ్యాచ్ మినహా భారత్ బ్యాటింగ్ అన్ని మ్యాచ్‌ల్లో కుప్పకూలింది. సూపర్ 8లో ఒత్తిడి పెరుగుతుంది. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ ప్రదర్శన చూస్తే ఏ జట్టునైనా ఓడించగలవు అని ఆమిర్ వ్యాఖ్యానించారు.
సూపర్ 8లో భారత్ మ్యాచ్‌లు:
ఫిబ్రవరి 22 – దక్షిణాఫ్రికా (అహ్మదాబాద్)
ఫిబ్రవరి 26 – జింబాబ్వే (చెన్నై)
మార్చి 1 – వెస్టిండీస్ (కొలకతా)
పాకిస్తాన్ షెడ్యూల్:
పాకిస్తాన్ న్యూజిలాండ్‌తో కొలంబోలో మొదటి మ్యాచ్ ఆడనుంది. తర్వాత ఫిబ్రవరి 24న ఇంగ్లాండ్, ఫిబ్రవరి 28న శ్రీలంకతో పల్లెకెలేలో తలపడుతుంది.సూపర్ 8 మార్చి 1తో ముగియగా, సెమీఫైనల్స్ మార్చి 4, 5న, ఫైనల్ మార్చి 8న జరుగుతుంది.
