‘గేమ్ ఓవర్’ రివ్యూ

365
Taapsee Pannu's Game Over Movie Review
Taapsee Pannu's Game Over Movie Review

తెలుగులో మంచి నటిగా పేరు తెచ్చుకున్న తాప్సి గత కొంత కాలంగా బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న సంగతి తెలిసిందే. కంటెంట్ ఉన్న సినిమాలను ఏరికోరి ఎంచుకుంటూ వరుస హిట్లతో దూసుకుపోతోంది తాప్సీ. ఈ మధ్యనే బాలీవుడ్ సినిమాతో మరో హిట్ ను నమోదు చేసుకున్న ఈమె తాజాగా ‘గేమ్ ఓవర్’ అనే సినిమాతో చాలా కాలం తర్వాత తెలుగు తమిళ భాషల్లో మళ్లీ అడుగు పెట్టబోతోంది. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ని వై నాట్ స్టూడియోస్ మరియు రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లు సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రం ఇవాళ అనగా జూన్ 14న విడుదలైంది. మరి ఈ సినిమాతో తాప్సీ ఎంతవరకు ప్రేక్షకులను మెప్పించిందో చూద్దామా..

కథ: సినిమా మొదట్లోనే ఒక యువతి దారుణంగా హత్యకు గురవుతుంది. మరోవైపు స్వప్న (తాప్సి పన్ను) ఒక గేమర్. నిక్టోఫోబియా అనే వ్యాధితో బాధపడుతూ ఉంటుంది. ఆమెకు చీకటంటే చాలా భయం. ఒక ఏడాది కింద జరిగిన ఒక సంఘటన వలన ఆమె నిక్టోఫోబియా బారిన పడింది. అప్పటి నుంచి తన కేర్ టేకర్ కాలమ్మ (వినోదిని వైద్యనాథన్) తో కలిసి ఉంటుంది. ప్యాక్ మాన్ గేమ్ లో తన స్కోర్ ని తానే బీట్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్న స్వప్న ని ఒక సీరియల్ కిల్లర్ చంపాలని ప్లాన్ చేస్తుంటాడు. ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? స్వప్న నిక్టోఫోబియా కి ఎందుకు గురవుతుంది? స్వప్న ని సీరియల్ కిల్లర్ చంపేస్తాడా? చివరికి ఏమవుతుంది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు: గత కొంతకాలంగా పర్ఫామెన్స్ కు మంచి స్కోప్ ఉన్న పాత్రలు ఎంచుకుంటూ వస్తున్న తాప్సి ఈ సినిమాలో కూడా అద్భుతమైన పాత్రలో కనిపించింది. తన పాత్రకు తాప్సి పూర్తిస్థాయిలో న్యాయం చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలలో తాప్సీ నటన చాలా అద్భుతంగా ఉంది. తాప్సి తర్వాత వినోదిని వైద్యనాథన్ కి కూడా ఈ సినిమాలో మంచి పాత్ర దక్కింది. ఆమె పాత్రలో ఒదిగిపోయి నటించింది వినోదిని. అనీష్ కురువిల్లా కూడా తన పాత్ర పరిధి మేరకు చాలా బాగా నటించారు. సైకియాట్రిస్ట్ పాత్రలో కనిపించిన అనీష్ కురువిల్లా తన పాత్రకు ప్రాణం పోశారు అని చెప్పవచ్చు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం: దర్శకుడు అశ్విన్ శరవణన్ ఈ సినిమా కోసం ఒక అద్భుతమైన కథను రాసుకున్నాడని చెప్పవచ్చు. ఈ సినిమాలో బలమైన కథ ఉండటం పెద్ద ప్లస్ పాయింట్ గా మారింది. ఎటువంటి బోరింగ్ ఎలిమెంట్లు లేకుండా ఆద్యంతం ఆసక్తికరంగా కథను నెరేట్ చేశాడు దర్శకుడు. సినిమాలోని ప్రతి ట్విస్టు ప్రేక్షకులను అబ్బురపరిచే విధంగా ఉంటుంది. వై నాట్ స్టూడియోస్ మరియు రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ అందించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా నిర్మాతలు ఈ సినిమాకి తగిన బడ్జెట్ను అందించారని తెలుస్తోంది. రాన్ ఈథాన్ యోహాన్ అందించిన అద్భుతమైన సంగీతం సినిమాకి మరో ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలలో నేపధ్య సంగీతం సినిమాకి హైలైట్ గా మారింది. ఏ వసంత్ అందించిన విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి. రిచర్డ్ కెవిన్ ఎడిటింగ్ పర్వాలేదనిపించింది.

తీర్పు: సినిమా మొదటి సీన్ నే అందరి దృష్టిని ఆకర్షించే విధంగా ఉంటుంది ఒక వైపు హారర్ ఎలిమెంట్ లతో భయపెడుతూనే మరొకవైపు సస్పెన్స్ ని దర్శకుడు చాలా బాగా చూపించాడు. మొదటి హాఫ్ మొత్తం కథ ఎస్టాబ్లిష్ చేయడానికి సరిపోతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ హైలైట్ అని చెప్పచ్చు. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ మరింత ఫాస్ట్ గా మరియు ఆసక్తికరంగా ఉంటుంది. ఒకవైపు సైకలాజికల్ ఎలిమెంట్లు మరోవైపు హారర్ ఎలిమెంట్లను చాలా బాగా హ్యాండిల్ చేశారు. సినిమా మొత్తం ఎక్కడా బోర్ కొట్టించకుండా కట్టిపడేసే విధంగా ఉంటుంది. చివరిగా ‘గేమ్ ఓవర్’ సినిమా ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులు చూడవలసిన చిత్రం.

Loading...