Saturday, April 27, 2024
- Advertisement -

పాక్‌తో క్రికెట్ మ్యాచ్‌.. జ‌నాలేమంటున్నారు? నేత‌ల మాటేంటి?

- Advertisement -

ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే అది మాములు విష‌యం కాదు. అది ఇండియా, పాక్ మ‌ధ్య‌ యుద్ధంతో స‌మానం. తీసే ప్ర‌తి ర‌న్‌లో ఎంతో ఉద్విగ్న‌త ఉంటుంది. తీసే ప్ర‌తి వికెట్‌లో ఎంతో ఎమోష‌న్ ఉంటుంది. టీవీల ముందు కుర్చున్న రెండు దేశాల ప్ర‌జ‌లు ఊపిరి బిగ‌ప‌ట్టుకొని ఎవ‌రు గెలుస్తారా? అని ఎదురు చూస్తారు. ఒడిన వారి ప‌రిస్థితి ఎలా ఉంటుందో తెలీదు కానీ.. ఆ ప్రాంతంలో మాత్రం టీవీలు ప‌గిలిపోతాయి.. దిష్టిబొమ్మ‌లు ద‌హ‌న‌మ‌వుతాయి. అదే గ‌నుక ఏ వ‌రల్డ్‌క‌ప్ మ్యాచ్ అయింద‌నుకోండి మ్యాచ్‌లో రాణించ‌ని ప్లేయ‌ర్ ఇంటి ముందు ఇక ర‌చ్చ రచ్చే.

కానీ ఇప్పుడు ఇండియాలో ప‌రిస్థితి వేరు. పుల్వామా ఉగ్ర‌దాడి మిగిల్చిన నెత్తుటి మ‌ర‌కలు ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో నుంచి ఇప్పుడ‌ప్పుడే చెరిగే ప‌రిస్థితి లేదు. ప్ర‌జ‌ల హృద‌యాలు ప్ర‌తికారాన్ని కోరుకుంటున్నాయి. నేరుగా యుద్ధం చేసే స‌త్తా లేక పాక్ దొంగ దెబ్బ తీస్తుందంటూ ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఊగిపోతున్నారు. పాక్‌తో అంతంత మాత్రంగా ఉన్న సంబంధాల‌కు పుల్‌స్టాప్ పెట్టి గ‌ట్టి బుద్ధి చెప్పాలంటున్నారు.

భార‌త ప్ర‌భుత్వం కూడా దానికి అనుగుణంగా ప్ర‌త్యేక హోదా స్థానం నుంచి పాక్‌ను త‌ప్పించింది. పాక్ నుంచి దిగుమ‌తి చేసుకునే వ‌స్తువుల‌పై 200 శాతం ప‌న్ను విధించింది. ఇలాంటి స‌మ‌యంలో ఉద‌యించిందో ప్ర‌శ్న‌. వ‌ర‌ల్డ్ క‌ప్‌లో జ‌రిగే మ్యాచ్‌ల‌లో పాక్‌తో ఆడాలా? వ‌ద్దా?. ఇప్పుడు దేశ‌మంతా ఇదే చ‌ర్చ న‌డుస్తోంది. మే 30 నుంచి జూలై 14 వరకూ ప్రపంచ కప్‌ ఇంగ్లండ్‌లో జరగనుంది. భారత్‌-పాకిస్థాన్‌ జూన్‌ 16న మాంచెస్టర్‌లో తలపడాల్సి ఉంది.

దేశం కంటే ఏదీ ఎక్కువ కాదు. అమ‌రుల త్యాగాల ముందు ఈ మ్యాచ్ ఓ లెక్క‌నా? దానిని చూసి మేం ఆనందించాలా? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు కొంద‌రు. అభిమానులేకాదు మాజీ క్రికెటర్లు సైతం ప్రపంచ కప్‌లో పాక్‌తో మ్యాచ్‌ను టీమిండియా బహిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. టీమిండియా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మ్యాచ్‌లో ఆడకూడదని హర్భజన్‌సింగ్‌ అంటున్నాడు. దాదాపు చాలా మంది ఆట‌గాళ్ల‌ది కూడా ఇదే మాట‌.

ఓ వైపు అమ‌రుల కుటుంబాలు శోకాలు పెడుతుంటే.. మ‌రోవైపు వారితో క‌లిసి ఆటలు ఆడుతూ ఉల్లాసంగా గ‌డ‌పాలా అంటూ ప్ర‌శ్నిస్తున్నారు కేంద్ర మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్‌. ఈ విష‌యంపై కేంద్రం త్వ‌ర‌లో నిర్ణ‌యం తీసుకుంటుంద‌న్నారు. కేంద్ర నిర్ణ‌యంపైనే త‌మ నిర్ణ‌యం ఆధార‌ప‌డి ఉంటుంద‌ని ఇప్ప‌టికే బీసీసీఐ తెల్చి చెప్పింది.

భార‌త్, పాక్ మ‌ధ్య మ్యాచ్ జ‌రిగిందంటే రేటింగ్ ఆకాశాన్ని తాకుతుంది. ఈ అవ‌కాశాన్ని వ‌దులుకోవ‌డానికి స్పాన్స‌ర్ సంస్థ‌లు సిద్ధంగా లేవు. అందుకే త్వ‌ర‌లో ఐసీసీ కూడా ఈ అంశంలో జోక్యం చేసుకోనుంది. అందుకే రెండు దేశాల క్రికెట్‌ సంబంధాలపై దుబాయ్‌లో 27న జరిగే సమావేశంలో చర్చించనుందని టాక్ వినిపిస్తోంది. అయితే మ్యాచ్‌కు ఇంకా ఎంతో సమయం ఉన్నందున తుది నిర్ణయం తీసుకొనేందుకు మరికొన్ని రోజులు పట్టే అవకాశాలున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -