పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ) బిల్లు–2025ను లోక్సభలో ప్రవేశపెట్టడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. ఈ విమర్శలకు నేతృత్వం వహించిన కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ .. పథకాలకు పేర్లు మార్చడంపై ప్రభుత్వానికి ఉన్న ఆసక్తి ఏంటో తనకు అర్థం కావడం లేదని అన్నారు.
కేరళ వైయనాడ్ నుంచి ఎంపీగా ఉన్న ప్రియాంక గాంధీ, ఈ బిల్లును విస్తృత పరిశీలన కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీ (JPC) కి పంపాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లు రాజ్యాంగ సారానికి విరుద్ధంగా ఉందని కూడా ఆమె వ్యాఖ్యానించారు. ఏళ్ల తరబడి ప్రభుత్వం MGNREGA నిధులను తగ్గిస్తూ వస్తోంది. ఎక్కడికి వెళ్లినా కార్మికులు డబ్బులు రాలేదని చెబుతున్నారు. గ్రామ పంచాయతీలకు ఎక్కడ పనులు చేయాలన్న నిర్ణయాధికారాన్ని తీసేసే ప్రయత్నం జరుగుతోంది. అన్ని కోణాల్లో ఈ బిల్లు తప్పుదారి పడుతోంది అని ఆమె అన్నారు.
ఈ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రియాంక గాంధీ వ్యాఖ్యలను ఖండించారు. ప్రభుత్వం మహాత్మా గాంధీని నమ్మడమే కాకుండా ఆయన సిద్ధాంతాలను అనుసరిస్తోందని చెప్పారు. మహాత్మా గాంధీ కలను నెరవేర్చుతూ, ఆయన ఆశించిన రామరాజ్యాన్ని స్థాపిస్తాం అని, ప్రతిపక్ష నినాదాల మధ్య ఆయన పేర్కొన్నారు.
ఈ బిల్లు ప్రకారం, ప్రతి ఆర్థిక సంవత్సరంలో ప్రతి గ్రామీణ కుటుంబానికి 125 రోజుల వేతన ఉపాధికి చట్టబద్ధ హామీ ఉంటుంది. బిల్లు అమల్లోకి వచ్చిన ఆరు నెలల్లో రాష్ట్రాలు కొత్త చట్టానికి అనుగుణంగా పథకాలు రూపొందించాలి. నిధుల భారం కేంద్ర–రాష్ట్రాల మధ్య పంచుకోబడుతుంది: ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలకు 90:10, ఇతర రాష్ట్రాలు మరియు శాసనసభ ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలకు 60:40 నిష్పత్తి. శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఖర్చు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది.
