ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కోర్బా జిల్లా కుసుముందా ప్రాంతంలో ఉపరితల బొగ్గు గని తవ్వకాల కోసం సుశీ హైటెక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఇచ్చిన టెండర్ అనుమతిని సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (SECL) రద్దు చేసింది. ఈ పరిణామం కోమటిరెడ్డి కుటుంబానికి గణనీయమైన ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.
కుసుముందా ప్రాంతంలో 1,460 రోజుల పాటు ఓపెన్‌కాస్ట్ బొగ్గు గని తవ్వకాలు చేపట్టేందుకు గత ఏడాది సెప్టెంబర్ 22న SECL సుశీ ప్రాజెక్ట్స్‌కు టెండర్ అనుమతి ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన ఫిక్స్డ్ డిపాజిట్ రూ.18.99 కోట్లు, అదనపు పీఎస్ఓ కింద మరో రూ.108.83 కోట్లను సుశీ ప్రాజెక్ట్స్ నిర్ణీత గడువులో చెల్లించలేదు. అంతేకాకుండా, అనుమతి పొందినప్పటికీ గని తవ్వకాల పనులను కూడా ప్రారంభించకపోవడం SECL తీవ్రంగా పరిగణించింది.
ఈ కారణాలతో టెండర్ అనుమతి లేఖను రద్దు చేస్తున్నట్లు SECL అధికారికంగా ప్రకటించింది. అలాగే ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (EMD) కింద సుశీ ప్రాజెక్ట్స్ చెల్లించిన రూ.50 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. నిబంధనల ప్రకారం, సుశీ కంపెనీపై ఏడాది పాటు ఎలాంటి పనులు అప్పగించకుండా నిషేధించే హక్కు తమకు ఉందని, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారమూ తమకే ఉందని SECL స్పష్టం చేసింది. ఈ నిర్ణయం బొగ్గు రంగంలోనూ, రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
