పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌కు (ఏప్రిల్ 29) సమయం దగ్గరపడుతున్న వేళ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం కోల్‌కతాలోని హుగ్లీ నదిలో పడవ ప్రయాణం చేస్తూ కనిపించారు.తొలి విడత ఎన్నికల్లో రికార్డు స్థాయి పోలింగ్ (92.88%) నమోదైన కొద్ది గంటలకే ప్రధాని ఈ పర్యటన చేపట్టారు. చేతిలో కెమెరాతో పడవలో కూర్చున్న చిత్రాలను ఆయన ‘X’ వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ సేతు నేపథ్యంగా ఆయన పడవలో ప్రయాణిస్తున్న దృశ్యాలు ఆకట్టుకున్నాయి.
ప్రతి బెంగాలీకి గంగా నది హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. గంగ నది… బెంగాల్ ఆత్మలో ప్రవహిస్తోందని చెప్పవచ్చు. గంగానది పవిత్ర జలాలు ఒక నాగరికత స్ఫూర్తిని మోసుకెళ్తున్నాయి అని మోదీ పేర్కొన్నారు. గంగా మాతకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఈ పర్యటన ఒక అవకాశమని, బెంగాల్ అభివృద్ధికి, ప్రజల శ్రేయస్సుకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన పునరుద్ఘాటించారు.
నదీ తీరంలో మార్నింగ్ వాక్ చేస్తున్న వారు మరియు పడవ నడిపే వ్యక్తులను కలుసుకుని వారితో ముచ్చటించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా తొలి విడతలో 92.88 శాతం పోలింగ్ నమోదైంది. ఇది పెను మార్పుకు సంకేతమని ఎన్నికల సంఘం పేర్కొంది.
మే 4వ తేదీన (ఫలితాల రోజు) టీఎంసీ 15 ఏళ్ల ‘సిండికేట్ వ్యవస్థ’ మరియు ‘మహా జంగిల్ రాజ్’కు కాలం చెల్లుతుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు.మరోవైపు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ, తొలి విడతలో జరిగిన 152 స్థానాల్లో 125 నుండి 134 స్థానాలను టీఎంసీ గెలుచుకోబోతోందని, తామే మళ్ళీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
నేడు ప్రధాని మోదీ దమ్ దమ్ మరియు జాదవ్‌పూర్ నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. రాష్ట్రంలో టీఎంసీని గద్దె దించి అధికారాన్ని దక్కించుకోవాలని బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది.
