- Advertisement -

ఏకంగా SBI భూమినే వేలం వేసిన సర్కార్?

- Advertisement -

హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన రాయదుర్గం (నాలెడ్జ్ సిటీ)లో తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన భూముల వేలం వ్యవహారం ఇప్పుడు న్యాయ వివాదంలో చిక్కుకుంది. రికార్డు స్థాయిలో నిధులు సమకూర్చిన ఈ వేలంపై దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (SBI) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది.

గత నెల 28వ తేదీన రాయదుర్గం పాన్మక్త పరిధిలోని సర్వే నంబర్ 83/1లో ఉన్న అత్యంత విలువైన ప్రభుత్వ భూములను తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) బహిరంగ వేలం ద్వారా విక్రయించింది. ఈ వేలంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఎకరానికి కనీస ధరను రూ.170 కోట్లుగా నిర్ధారించింది. అయితే ఈ భూమి అనూహ్యంగా రికార్డు స్థాయి ధర పలికింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ‘గౌరా వెంచర్స్’ ఏకంగా ఎకరం రూ.237 కోట్ల చొప్పున దక్కించుకుని సంచలనం సృష్టించింది.

రూ. వందల కోట్ల ఆదాయం తెచ్చిపెట్టిన ఈ భూముల వేలంపై ఎస్‌బీఐ అనూహ్యమైన ట్విస్ట్ ఇచ్చింది. సర్వే నంబర్ 83/1 పరిధిలోని ఈ భూమిలో 5 ఎకరాల స్థలం తమ బ్యాంక్‌కే చెందుతుందని ఎస్‌బీఐ పేర్కొంది. ఆ భూమికి సంబంధించిన యాజమాన్య హక్కులు తమ వద్దే ఉన్నాయని తెలుపుతూ హైకోర్టులో రిట్ పిటిషన్‌ దాఖలు చేసింది.

తమకు కేటాయించిన భూమిలో ప్రతిపాదిత కార్యాలయ నిర్మాణానికి అదనపు సమయం ఇవ్వడానికి నిరాకరించిన రాష్ట్ర ప్రభుత్వ చర్యలను బ్యాంకు సవాలు చేసింది. తమ యాజమాన్య హక్కులున్న ఐదెకరాల భూమిని ప్రభుత్వం ఏకపక్షంగా ఎలా వేలం వేస్తుందని పిటిషన్‌లో ప్రశ్నించింది. ఈ వేలం ప్రక్రియను నిలిపివేయాలని, వివాదాస్పదంగా ఉన్న ఆ 5 ఎకరాలను తమకే అప్పగించేలా అధికారులకు ఆదేశాలు (రిట్ ఆర్డర్) ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరింది.

ఈ పరిణామంతో నగరంలో జరిగిన అత్యంత ఖరీదైన భూముల వేలంపై ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివాదంలో ఉన్న భూములను ప్రభుత్వ సంస్థలు ఎలా వేలం వేస్తాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వందల కోట్ల రూపాయల ఈ ప్రాపర్టీకి సంబంధించిన పిటిషన్‌ను విచారించనున్న హైకోర్టు తీర్పుపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -