కాపులను బిసిల్లోకి చేరుస్తూ ప్రవేశపెట్టిన బిల్లును అసెంబ్లీ శనివారం ఏకగ్రీవంగా ఆమోదించింది. రాజకీయాలకు సంబంధం లేకుండా ఈ రిజర్వేషన్లు ఉంటాయని బిల్లులో పేర్కొన్నారు. చంద్రబాబు నిర్ణయంపై తాజాగా బిసి కమిషన్ ఛైర్మన్ జస్టిస్ మంజునాథ మరో బాంబు పేల్చారు. బీసీ కమిషన్ సభ్యులు తనను సంప్రదించకుండా, తనకు తెలియజేయకుండా బిసి కమిషన్ రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించారని వెల్లడించారు.
బీసీ కమిషన్ రిపోర్టు ఆధారంగా కాపు రిజర్వేషన్లను ఆమోదిస్తున్నట్లు ఎపి ప్రభుత్వం ప్రకటించి శనివారం ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ జరుపుతున్న నేపథ్యంలో బిసి కమిషన్ ఛైర్మన్ జస్టిస్ మంజునాథ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. జస్టిస్ మంజునాథ తాజా వ్యాఖ్యలతో టిడిపి ప్రభుత్వాన్ని మరో వివాదం చుట్టుముట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిసి కమిషన్ సభ్యులు ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తున్నట్లు తనకు తెలపలేదని జస్టిస్ మంజునాథ తెలిపారు.
నివేదిక ఇచ్చేముందు సభ్యులు చైర్మన్‌ను సంప్రదించాల్సి ఉంటుందన్నారు. కానీ అలా జరగలేదన్నారు. తనకు సభ్యుల రిపోర్టులో ఏముందో తనకు అనవసరమని, తాను రూపొందించిన రిపోర్ట్ తన వద్ద సిద్ధంగా ఉన్నందున త్వరలోనే ప్రభుత్వానికి సమర్పిస్తానని జస్టిస్ మంజునాథ తెలిపారు. కాపులను బీసీల్లో చేర్చే విషయమై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు గానూ ఎపి ప్రభుత్వం జస్టిస్ మంజునాథ కమిషన్ ను ఏర్పాటుచేసింది.
