ఏంటి సార్ జనం మరీ పిచ్చివాళ్లులాగా కనిపిస్తున్నారా ? మీరు కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉంటూ… మీ సతీమణి పద్మినీరెడ్డిని బీజేపీలో చేర్చడం ఏంటి ? అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు కదా ! అంటూ ప్రశ్నించిన మీడియా ప్రతినిధులపై తెలంగాణ కాంగ్రెస్ నేత, ఉమ్మడి రాష్ట్ర డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అసహనం వ్యక్తం చేశారు. అది తమ కుటుంబ విషయమని చెప్పుకొచ్చారు. మీకు పని లేదా అంటూ మీడియాపై చిర్రుబుర్రులాడారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిని ఓడించడానికే టీఆర్ఎస్, బీజేపీతో లోపాయికారి ఒప్పందంతో ఇలా చేశారా ? అని ప్రశ్నించినందుకు ఆయనకు ఎక్కడలేని కోపం వచ్చేసింది. మీరు ఇలా చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో నమ్మకం కోల్పోతుంది కదా ? మీరు రూపొందిస్తున్న మ్యానిఫెస్టోపై మీ భార్యకే నమ్మకం లేదా ? అందుకే ఆమె ఇతర పార్టీలోకి వెళ్లిపోయారా ? మరి మీరు ఎప్పుడు పార్టీ మారతారు ? అంటూ నెటిజన్లు ఇప్పటికే దామోదరను ఓ ఆట ఆడుకుంటున్నారు. కాంగ్రెస్ మొదటి విడత విడుదల చేసిన 34మంది అభ్యర్ధుల జాబితాలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అభ్యర్ధులకు టికెట్లు కేటాయించారు. సబితా ఇంద్రారెడ్డి ఆమె కుమారుడు, ఉత్తమ్ కుమార్ ఆయన భార్యకు, కోమటిరెడ్డి బ్రదర్స్ కు టికెట్లు కేటాయించారు. కానీ దామోదర రాజనర్సింహకు అలాంటి అవకాశం దక్కలేదు. దీంతో ఆయన కేసీఆర్, బీజేపీతో ఒప్పందం కుదుర్చుకునే తన భార్యను బీజేపీలో చేర్చారని చర్చ జోరుగా సాగుతోంది.
పద్మినీరెడ్డికి కాంగ్రెస్ తరఫున సంగారెడ్డి టికెట్ అడిగినా పార్టీ నిరాకరించినందునే రాజనర్సింహ ఆమెను బీజేపీ గూటికి చేర్చారనే చర్చ నడుస్తోంది. దీని ద్వారా ఆ స్థానంలో పోటీ చేయనున్న జగ్గారెడ్డిని ఓడించే అవకాశముంది. తద్వారా కేసీఆర్ పార్టీకి మేలు జరుగుతుంది. బీజేపీతో కలసి కేసీఆర్ ఈ సారి మళ్లీ అధికారంలోకి వస్తే, రాజనర్శింహ భార్య గెలిస్తే మంత్రి పదవి ఇస్తారని, లేకపోతే నామినేెటెడ్ పదవి అయినా ఇస్తారని, ఆ మేరకు టీఆర్ఎస్, బీజేపీ, రాజనర్సింహ మధ్య జరిగిన రహస్య ఒప్పందం ప్రకారమే పద్మినీరెడ్డిని బీజేపీలో చేర్చారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే నాడు కాంగ్రెస్ తరఫున గెలిచి డిప్యూటీ సీఎం స్థాయిలో పని చేసిన వ్యక్తి, ఇప్పుడు ఆ పార్టీ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉంటున్న వ్యక్తి ఇలా అవకాశవాద రాజకీయాలు చేస్తే, ప్రజల్లో కాంగ్రెస్ పలుచన అవుతుందని, భర్త ఓ పార్టీలో, భార్య మరో పార్టీలో ఉంటూ పోటీ చేస్తే ఏం సమాధానం చెప్పాలని కాంగ్రెస్ సీనియర్లు కలవరపడుతున్నారు. అలా చేసి పార్టీ పరువు తీసే బదులు పార్టీకి గుడ్ బై చెప్పి తమ దారి తాము చూసుకోవచ్చు కదా ? అని మండిపడుతున్నారు. రాజనర్శింహ రాజకీయాల వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆయన కుటుంబ వ్యవహారం కాదని పార్టీ అంశమని గుర్తు చేస్తున్నారు. ఇక నేడో రేపో ఆయనపై పార్టీ అధిష్ఠాం వేటు వేయవచ్చని అభిప్రాయపడుతున్నారు.
