రాష్ట్రంలో పోలీసుల అరాచకాలు హద్దులు దాటుతున్నాయనడానికి బాపట్ల జిల్లాలో జరిగిన ఘటనే నిదర్శనమని వైసీపీ ఆరోపిస్తోంది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న నెపంతో వైసీపీ కార్యకర్త కృష్ణార్జున రెడ్డిని పోలీసులు నిర్బంధించి, చిత్రహింసలకు గురిచేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది.
బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రాంబొట్లవారిపాలేనికి చెందిన వైసీపీ కార్యకర్త కృష్ణార్జున రెడ్డిపై పోలీసులు విచక్షణారహితంగా ప్రవర్తించారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం..ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే పోలీసులు ఆయనను స్టేషన్‌కు పిలిపించారు.సోషల్ మీడియా పోస్టుల గురించి ప్రశ్నిస్తూ చెరుకుపల్లి ఎస్ఐ అనిల్ ఆయనపై లాఠీలతో దాడి చేశారు.మోకాళ్లపై నిలబెట్టి దుర్భాషలాడటమే కాకుండా, శరీరంపై వాతలు తేలేలా థర్డ్ డిగ్రీ ప్రయోగించారు.
తీవ్ర గాయాలపాలైన కృష్ణార్జున రెడ్డి ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ విషయం తెలుసుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, బాధితుడు కృష్ణార్జున రెడ్డిని పరామర్శించారు. ఈ సందర్భంగా కృష్ణార్జున రెడ్డి తన శరీరంపై ఉన్న గాయాలను జగన్‌కు చూపిస్తూ, పోలీసుల వేధింపులను వివరించి ఆవేదన వ్యక్తం చేశారు.కార్యకర్తకు అండగా ఉంటామని భరోసా ఇచ్చిన జగన్, చట్టాన్ని అతిక్రమించి వ్యవహరిస్తున్న పోలీసు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
“చట్టాన్ని చుట్టంలా మార్చుకుని, అధికార పార్టీ కళ్లల్లో ఆనందం కోసం అమాయక కార్యకర్తలపై దాడులు చేస్తారా? ఇలాంటి అధికారులపై ప్రైవేట్ కేసులు వేద్దాం. పార్టీ తరపున మీకు పూర్తిస్థాయి న్యాయ సహాయం అందిస్తాం.” అని జగన్ స్పష్టం చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన ఎస్ఐ అనిల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నేతలు డీజీపీకి మరియు బాపట్ల ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే విచారించడానికి ప్రత్యేక పద్ధతులు ఉంటాయని, కానీ ఇలా భౌతిక దాడులకు దిగడం రాజ్యాంగ విరుద్ధమని వారు మండిపడుతున్నారు.
