ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావద్దని పార్టీ నిర్ణయించినట్లు తెలిపారు. అయితే వైసీపీ ఎమ్మెల్సీలు మాత్రం శాసన మండలి సమావేశాలకు హాజరవుతారని స్పష్టం చేశారు.
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ అధ్యక్షతన వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరై ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ప్రతిపక్ష హోదా అంశంపై తమ వైఖరిని గట్టిగా వ్యక్తం చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించినట్లు సమాచారం.
ఇక సమావేశం అనంతరం జగన్‌ను పలువురు కార్యకర్తలు కలిశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గానికి చెందిన వైసీపీ కార్యకర్త లెనిన్ వివేక్ తన కుటుంబ సభ్యులతో కలిసి జగన్‌ను కలిసి తమ కుమారుడు భార్గవ్ ప్రకాష్‌కు అక్షరాభ్యాసం చేయాలని కోరారు. వారి అభ్యర్థనను స్వీకరించిన జగన్ బాలుడికి అక్షరాభ్యాసం చేసి ఆశీర్వాదాలు అందజేశారు.
తమ కుమారుడికి జగన్ చేతుల మీదుగా అక్షరాభ్యాసం జరగడం ఆనందంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. గతంలో తమ కుమార్తెకు కూడా జగన్ అన్నప్రాసన చేసిన విషయాన్ని వారు గుర్తుచేసుకున్నారు.
