Sunday, April 28, 2024
- Advertisement -

తిత్లీ తుఫాన్ భయంతో అన్నీ చేశారు అసలుది తప్ప…

- Advertisement -

తిత్లీ తుఫాన్ హెచ్చరికలతో ఒడిషా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాయి. ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో తుఫాన్ తీవ్ర ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖాధికారులు హెచ్చరిస్తుండటంతో సర్కార్ అప్రమత్తమయింది. గురువారం తీరం దాటే సమయంలో 120 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించడంతో ఆయా జిల్లాల యంత్రాంగం అలర్ట్ అయ్యారు. మత్స్యకారులను వేటకు వెళ్లొద్దన్నారు. కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. స్పెషల్ హెల్ప్ డెస్కులు పెట్టారు. పలు రైళ్లను రద్దు చేశారు. ఇంకొన్నింటిని రూటు మళ్లించారు. మరోవైపు తీరప్రాంతాల గ్రామాల నుంచి ప్రజలను పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. జిల్లా కలెక్టరేట్‌లోని కంట్రోల్‌రూమ్‌కు సమాచారం అందించాలని ప్రజలకు సూచిస్తున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, రెవెన్యూ, మెడికల్ సిబ్బందిని సిద్ధం చేశారు. ఇంకోవైపు తిత్లీ తుఫాన్ తీరం దాటాక నష్ట నివారణ కోసం కూడా చర్యలు చేపట్టారు. ప్రజలకు నిత్యవసరాలు, మందులు, సెల్ ఫోన్లకు చార్జింగ్ సమస్యలు తలెత్తకుండా, సిగ్నల్స్ వ్యవస్థ స్తంభించకుండా అన్నీ అప్పటికప్పుడు రిపేర్లు చేసి సిద్ధం చేసేలా ముందు జాగ్రత్తగా ఏర్పాట్లు చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు ఆదేశాలతో ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లోనూ జిల్లా కలెక్టర్లు సహా అధికార యంత్రాంంగం అంతా తిత్లీ తుఫాన్ బీభత్సాన్ని ఎదుర్కోవడానికి గత మూడు నాలుగు రోజులుగా సర్వం సిద్ధం చేసుకుని శ్రమిస్తోంది. ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగకుండా కాపాడుకునేందుకు చేయాల్సినదంతా చేస్తున్నారు.

కానీ అత్యంత కీలకమైన అంశాన్ని మాత్రం విస్మరించారు. గతంలో హుద్ హుద్ తుఫాన్ వచ్చినప్పుడు నేర్చుకున్న పాఠాన్ని ఈ సారి తిత్లీ తుఫాన్ బీభత్సం నేపథ్యంలో మరిచిపోయారు. నాడు హుద్ హుద్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఒడిషా ప్రభుత్వం పూర్తి అప్రమత్తమయింది. ముందస్తు హెచ్చరికలతో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చెట్ల కొమ్మలను 90 శాతం నరికివేయించారు. వారం, పది రోజుల పాటు యుద్ధ ప్రాతిపదికన చెట్ల కొమ్మలను, ఆకులను 90 శాతానికి పైగా కొట్టేసి నేల కూల్చారు. దీంతో ఒడిషాలో హుద్ హుద్ తుఫాన్ ప్రభావం పెద్దగా చూపలేకపోయింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి కానీ, ఈదురుగాలులకు అవకాశం లేకుండా పోయింది. కొమ్మలు, ఆకులు నరికివేయడంతో ఈదురుగాలులు వీయకుండా అడ్డుకోగలిగారు. దీంతో చెట్లు సురక్షితంగా మిగిలాయి. అవి కూలిపోకపోవడంతో రవాణా, విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు ఎలాంటి అవాంతరాలు లేకుండా పని చేయగలిగాయి. కానీ ఏపీలో ముందు జాగ్రత్తగా చెట్ల కొమ్మలు నరికివేయకపోవడంతో హుద్ హుద్ ఉత్తరాంధ్రను, ప్రధానంగా విశాఖపట్నాన్ని అతలాకుతలం చేసేసింది. ఈదురుగాలులతో చెట్లు విరిగిపడి, రవాణా, విద్యుత్, కమ్యానికేషన్ వ్యవస్థలతో పాటు ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఊహకందని రీతిలో జిల్లాలో లక్షల చెట్లు నేలమట్టమయ్యాయి. దీంతో అప్పటి నుంచి ఉష్ణోగ్రతలు పెరిగిపోవటం కూడా ప్రారంభమయింది. అదే ఒడిషా మాదిరిగా ఏపీలో కూడా చెట్ల కొమ్మలు నరికివేసినట్లయితే 80 శాతం ముప్పు తప్పేదని నాడు నిపుణులు అంచనా వేశారు. అయితే హుద్ హుద్ తుపాను మిగిల్చిన నష్టంతో పాఠాలు నేర్చిన సర్కార్ ఇప్పుడు తిత్లీ తుఫాన్ బీభత్సంలో కూడా వాటిని అమలు చేయడంలో ఎందుకో విఫలమయింది. అదే ఈసారి కూడా ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో ముందుజాగ్రత్తగా చెట్లకొమ్మలను కొట్టివేసినట్లయితే 80 శాతం వరకూ ఈదురుగాలుల ద్వారా వచ్చే ముప్పును అడ్డుకోగలిగేవారు. అన్నీ చేసిన పాలకులు, అధికారులు ఆ అసలు విషయాన్ని మాత్రం మరిచిపోయారు. ప్చ్…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -