Friday, April 26, 2024
- Advertisement -

వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త లేఖ హల్ చల్..!

- Advertisement -

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై మాజీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు సీబీఐ డైరెక్టర్​కు రాసిన లేఖ సంచలనం రేపుతోంది. ఈ హత్య దర్యాప్తులో తనకు తెలిసిన సమాచారాన్ని సీబీఐకి అందిస్తానని రెండుసార్లు కోరినా.. వారి నుంచి స్పందన రాలేదని లేఖలో పేర్కొన్న ఏబీ వెంకటేశ్వరరావు.. నిఘా విభాగం సిబ్బంది ఘటనా స్థలానికి వెళితే వారిని లోనికి రానీయకుండా ఎంపీ అవినాష్ రెడ్డి అడ్డుకున్నారని లేఖలో తెలిపారు. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆసక్తికర విషయాన్ని బయటపెడుతూ మాజీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు సీబీఐకి లేఖను సంధించారు.

2019 మార్చి 15 న పులివెందులలో వివేకానందరెడ్డి ఆయన స్వగృహంలో మరణించారన్న వెంకటేశ్వరరావు.. గుండెపోటుతో ప్రమాదవశాత్తూ బాత్ రూంలో జారిపడి చనిపోయారని మధ్యాహ్నం వరకు మీడియాలో ప్రచారమైందని లేఖలో తెలిపారు. ఆయన మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లిన తర్వాత హత్య కేసుగా తేలిందని ఆయన గుర్తుచేశారు. ఆసుపత్రికి చేరేవరకు మృతదేహం వారి బంధువుల ఆధీనంలోనే ఉందని వివరించారు .

సీబీఐ జాయింట్ డైరెక్టర్ ఎన్​.ఎమ్. సింగ్ నేతృత్వంలో బృందం వైఎస్ వివేకా కేసు దర్యాప్తు చేస్తుందన్న వెంకటేశ్వరరావు.. రెండుసార్లు ఆయన్ని ఫోన్లో సంప్రదించినట్లు తెలిపారు. వివేకా హత్య కేసుకు సంబంధించి తన వద్ద ఉన్న వివరాలను అందజేస్తానని చెప్పినట్లు పేర్కొన్నారు. ఎన్ ఎమ్ సింగ్ సానుకూలంగా స్పందించినా.. ఇప్పటివరకు వివరాలు తీసుకోలేదని ఏబీ వెంకటేశ్వరరావు లేఖలో తెలిపారు. ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేసిన తాను కేసు దర్యాప్తునకు సహకరిస్తానని స్వచ్ఛందంగా ముందుకు వచ్చినా.. ఏ అధికారి పట్టించుకోకపోవటం ఆశ్చర్యానికి గురిచేస్తుందన్నారు.

వైఎస్ వివేకా మరణ వార్త తెలిసిన వెంటనే నిఘా విభాగం సిబ్బంది ఘటనా స్థలానికి వెళితే వారిని లోనికి రానీయకుండా ఎంపీ అవినాష్ రెడ్డి అడ్డుకున్నారని లేఖలో ప్రస్తావించారు. ఏపీ నిఘా విభాగం వద్ద ఉన్న అప్పటి సమాచారాన్ని తీసుకునేలా దర్యాప్తు అధికారిని ఆదేశించాలని.. అధికారులను వివరాలను అడిగి తెలుసుకోవాలని లేఖలో కోరారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -