Saturday, May 11, 2024
- Advertisement -

జ‌య‌ల‌లిత జీవితంలో ఎప్పుడూ గ‌ర్భం దాల్చ‌లేదు

- Advertisement -

జ‌య‌ల‌లిత జీవితంలో ఎప్పూడ గ‌ర్భం దాల్చ‌లేదు.. ఈ మాట విన‌గానే ఎందుకో మ‌న‌సంతా చాలా బాధ‌గా అనిపించింది. ఒక వ్య‌క్తి బ‌తికి ఉన్న‌ప్పుడు ఎంత గొప్ప‌గా బ‌తికినా.. చ‌నిపోయాక గ‌డ్డిపోచ కంటే హీనంగా చూసే ప‌రిస్థితి ఉండ‌డం చాలా బాధాక‌రం. జ‌య‌ల‌లిత‌.. సినిమాల‌లో తిరుగులేని క‌థానాయిక‌. రాజ‌కీయాల‌లో వెన్నుచూప‌ని.. మ‌డ‌మ తిప్ప‌ని పోరాట యోధురాలు. ఎన్నిసార్లు కింద‌ప‌డినా.. మ‌ళ్లీ మ‌ళ్లీ ప‌డిలేచిన కెర‌టంలా ఉవ్వెత్తున ఎగిసి.. ఉప్పెన‌లా మారి తిరుగులేని ఆధిప‌త్యాన్ని సాధించిన రాజ‌కీయ వ‌నిత‌. త‌న‌ను ఎదిరించిన వారంద‌రినీ పాదాక్రాంతం చేసుకున్న గొప్ప రాజ‌నీతిజ్ఞురాలు. జ‌య‌ల‌లిత బ‌తికి ఉన్నంత కాలం ఆమె ఎదురుగా నిల‌బ‌డి ఓ మాట మాట్లాడే ధైర్యం కూడా చేసే ప‌రిస్థితి ఎవ‌రికీ ఉండేది కాదు. ఆమె ఓ నియంత‌లా పాల‌న‌పై ప‌ట్టు ఉంచుకునేవారు.

ఆమె ఔనంటే.. ఔను.. కాదంటే కాదు. అంతే అంత‌కుమించి మాట‌లుండేవి కావు. కానీ.. ఆమె చ‌నిపోయిన రోజు నుంచి రాజ‌కీయాలు కొత్త మ‌లుపు తిరిగాయి. ఆమె వ్య‌క్తిగ‌త జీవితాన్ని కెలికి తీసి.. త‌మ స్వార్థం కోసం వాడుకోవాల‌ని పావులు క‌దిపే కుతంత్ర రాజ‌కీయ‌వాదులు తెర‌పైకి వ‌చ్చారు. ఆమె ఉన్న‌ప్పుడు పాదాల‌కు న‌మ‌స్క‌రించి అమ్మా అన్న నోటితోనే.. ఒక‌రిపై ఒక‌రు బూతులు తిట్టుకుంటూ.. అధికార పీఠం కోసం చొక్కాలు చింపుకున్నారు. చివ‌రికి ఆమె చావునూ రాజ‌కీయం చేసి.. చ‌నిపోయిన ఆత్మ‌కు మ‌న‌శ్శాంతిని క‌ర‌వ‌య్యేలా చేశారు.

జ‌య‌ల‌లిత గ‌తంలో ఉండేది అనే విష‌యం సైతం కేవ‌లం రెండేళ్ల‌లోనే మ‌ర‌చిపోయేలా.. ఆమె అనుయాయులే చేశారు. వారికి ఉన్న‌దంతా.. ఆమె అందించే అధికారంపై వ్యామోహ‌మే త‌ప్ప‌.. ఆమెపై ఎలాంటి ప్రేమా లేదు. ఆమె సొంత బిడ్డ‌లా చూసుకున్న పార్టీని ముక్క ముక్క‌లు చేసేశారు. కుక్క‌లు చింపిని విస్త‌రిగా మార్చి.. ఎంగిలి మెతుకులు ఏరుకున్నారు. అంతే ఆమె గురించి ఇప్పుడు ఎవ్వ‌రికీ అక్క‌ర్లేదు. ఇప్పుడు జ‌య‌ల‌లిత వ్య‌క్తి గ‌త జీవితంపైనా ఓ న‌ల్ల మ‌చ్చ‌ను వేసేందుకు మ‌రికొంద‌రు త‌యార‌య్యారు. జ‌య‌ల‌లితే నా త‌ల్లి.. ఆమె న‌న్ను క‌న్న‌దంటూ బెంగ‌ళూరుకు చెందిన అమృత అనే మ‌హిళ కోర్టుకెక్కింది. తాను ఆమె కూతురినేనని.. త‌న‌ను క‌న్న‌దంటూ ఓ తేదీని సైతం వెంట తెచ్చుకుని న్యాయ‌స్థానానికి స‌మ‌ర్పించింది.

ఆ కేసు కొన‌సాగుతుండ‌గా.. తాజాగా మ‌ద్రాసు హైకోర్టుకు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ఓ విష‌యాన్ని తెలియ‌జేసింది. అదేంటంటే.. జ‌య‌ల‌లిత త‌న జీవిత కాలంలో ఎప్పుడూ గ‌ర్భం దాల్చ‌లేదు. అస‌లు వివాహ‌మే చేసుకోకుండా.. ఉండిపోయిన జ‌య‌ల‌లిత‌పై ఆమె చ‌నిపోయిన త‌ర్వాత కూడా ఇలాంటి వార్త వినాల్సి వ‌స్తుంద‌ని ఆమెను అభిమానించే వారి గుండెలు మండిపోతున్నాయి. జ‌య‌ల‌లిత ఆస్తుల కోస‌మే స‌ద‌రు మ‌హిళ ఇలా చేస్తోంద‌ని ప్ర‌భుత్వ త‌ర‌ఫు న్యాయ‌వాది వాదించాడు. పైగా.. ఆమె తాను 1980 ఆగ‌స్టులో జ‌య‌ల‌లిత‌కు పుట్టాన‌ని అంటోంద‌ని, అయితే.. స‌రిగ్గా ఆమె చెప్పిన తేదీకి నెల రోజుల ముందు జ‌య‌ల‌లిత ఓ సినీ వేడుక‌లో పాల్గొన్నార‌ని, అప్పుడు ఆమె గ‌ర్భంతో లేర‌ని తేల్చారు.

ఆ వీడియోను సైతం సేక‌రించి.. కోర్టు ముందుంచారు. అయితే.. ఇప్పుడు అమృత మ‌రో అడుగు ముందుకేసి.. త‌నతో పాటూ జ‌య‌ల‌లిత బంధువుల‌కు డీఎన్ఏ ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని, అప్పుడే త‌న‌కు న్యాయం జ‌రుగుతుందంటూ కోర్టును మ‌ళ్లీ కోరారు. అంత‌కుముందు అస‌లు జ‌య‌ల‌లిత మృత‌దేహాన్ని వెలికితీసి డీఎన్ఏ ప‌రీక్ష‌లు నిర్వ‌హించాలంటూ.. అమృత కోరింది. కానీ.. కోర్టు దీనికి అంగీక‌రించ‌లేదు. అస‌లు జ‌య‌ల‌లిత బ‌తికి ఉన్నంత కాలం సినీ అవ‌కాశాలు, రాజ‌కీయ ఆరంగేట్రం, రాజ‌కీయ స్థిర‌త్వం, ప్ర‌తిప‌క్షాల‌తో.. పోరాటం చేస్తూనే ఉన్నారు. క‌నీసం చ‌నిపోయి ప్ర‌శాంతంగా స‌మాధిలో ఉన్నా.. ఇలా ఆమెపై నింద‌లు వేస్తూ.. మృత‌దేహంతోనూ రాజ‌కీయం చేయాల‌నుకోవ‌డం అంద‌రినీ క‌లచివేస్తోంది. ఇలాంటి వివాదాల‌ను ఇక‌నైనా జ‌య‌ల‌లిత చుట్టూ తిర‌గ‌కుండా.. ఆప‌గ‌లిగితే అంతేచాలు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -