Saturday, April 20, 2024
- Advertisement -

అంతుబ‌ట్టని హ‌రీష్‌ రావు అంత‌రంగం…!

- Advertisement -

ప్రాంతీయ పార్టీల్లో వార‌స‌త్వ పోరు స‌ర్వ సాధార‌ణం. క‌శ్మీర్ నుంచి క‌న్యాకుమారి దాకా ప్రాంతీయ పార్టీల్లో ఈ పోరును చూశాం.. చూస్తునే ఉన్నాం. దీనికి తెలంగాణ అతీతం కాద‌న్న‌ది కూడా వాస్త‌వం. ఉద్య‌మ పార్టీగా ఆవిర్భ‌వించి.. తెలంగాణ రాజ‌కీయాల్లో తిరుగులేని శ‌క్తిగా దూసుకుపోతున్న టీఆర్ ఎస్ ఇప్పుడు అదే స‌మ‌స్య ఎదురైన‌ట్టు క‌నిపిస్తోంది. తెలంగాణ ఉద్య‌మంలో కేసీఆర్ వెన్నంటే ఉండి తిరుగులేని నేత‌గా.. ప్ర‌త్య‌ర్థుల విమ‌ర్శ‌ల‌ను సైతం అందుకున్న హ‌రీష్‌రావు.. మొన్న‌టి ఎన్నిక‌ల్లో పార్టీ గెలుపుకు తీవ్రంగా కృషి చేశారు. టీఆర్ఎస్‌లో కేసీఆర్ త‌రువాతి స్థానం హ‌రీష్‌రావుదే అని అంద‌రూ అనుకునేవారు. కానీ కేటీఆర్ ఎంట్రీతో ప‌రిస్థితులు మారాయి. దీనిని త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు విప‌క్షాలు విశ్వ‌ప్ర‌య‌త్నం చేసినా వ‌ర్క‌వుట్ కాలేదు. హ‌రీష్ సొంత కుంప‌టి పెట్టుకోబోతున్నార‌ని టీఆర్ ఎస్‌లో చిచ్చుపెట్టే ప్రయ‌త్నం చేసిన‌.. ఆ పాచిక‌లు పార‌లేదు. మేము మేము ఒక్క‌టే.. మా ఏజెండా టీఆర్ ఎస్ గెలుపే అన్న విధంగా ముందుకు పోయారు.. గెలిచారు కూడా. తెలంగాణ‌లో ల‌క్ష ఓట్ల మెజార్టీతో గెలిచిన నేత కూడా ఆయ‌న ఒక్క‌రే.

కానీ ప్ర‌భుత్వం ఏర్పాటు కాగానే త‌న తరువాతి స్థానం కేటీఆర్‌దే అన్న‌ట్టుగా కేసీఆర్ చ‌ర్య‌లు ప్రారంభించారు. కేటీఆర్‌కు పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్య‌త‌లు అప్ప‌జెప్పారు. అయితే ఇవ‌న్ని హ‌రీష్‌ను పోటీలో లేకుండా చేయ‌డంలో భాగ‌మే అని హ‌రీష్ అభిమానుల మాట‌. దీనికి త‌గ్గ‌ట్టుగానే హ‌రీష్ కొన్ని రోజులుగా మౌనం వ‌హించారు. కానీ గ‌త కొన్ని రోజులుగా హ‌రీష్‌రావు తీసుకుంటున్న నిర్ణ‌యాలు పార్టీలో అంత‌ర్గ‌తంగా ఏదో జ‌రుగుతుంద‌న్న విష‌యాన్ని క‌న్‌ఫామ్ చేస్తున్నాయి.

మ‌రికొన్ని రోజుల్లో తెలంగాణ మంత్రివ‌ర్గం విస్త‌రణ ఉంటుంద‌నే ఊహాగానాలు వినిపిస్తున్న సంద‌ర్భంలో హారీష్‌రావు సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ టీఎంయూ గౌర‌వ అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేసిన హ‌రీష్‌.. ఇప్పుడు ఏకంగా మినిస్ట‌ర్ బంగ‌ళా ఖాళీ చేసి త‌న సొంతింటికి వెళ్లిపోయారు.

హ‌రీష్ తీసుకుంటున్న‌ నిర్ణయాలు అందర్నీ ఆలోచనలో పడేస్తున్నాయి. మంత్రివర్గంలో ఈసారి హరీష్ కు చోటుదక్కకపోవచ్చనే ముందస్తుగా హ‌రీష్ బంగ్లా ఖాళీ చేశార‌ని స‌మాచారం. దీనికి ఒంటేరు ప్రతాపరెడ్డి టీఆర్ ఎస్ చేరిక కూడా హరీష్ కోపానికి కారణంగా తెలుస్తోంది. పర‌స్ప‌ర ఆరోప‌ణ‌ల‌తో హీట్ పెంచిన హ‌రీష్‌- ఒంటేరు… నెల రోజులు కూడా గడవకముందే ఒంటేరును పార్టీలోకి ఆహ్వానించారు కేసీఆర్. ఆ చేరిక కార్యక్రమంలో కూడా హరీష్ పాల్గొనలేదు. ఇలాంటి పలు కారణాలన్నీ కలిసి హరీష్ ను హర్ట్ చేశాయని అంటున్నారు ఆయన సన్నిహితులు.

ఏదేమైనా ప్ర‌జానేత‌గా పేరున్న హ‌రీష్‌ను ప‌క్క‌న పెట్టే సాహ‌సం టీఆర్ ఎస్ చేస్తుందా? వేచి చూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -