వచ్చే సాధారణ ఎన్నికలలో టీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సెప్టెంబరులోనే ఎన్నిక అభ్యర్థులను ప్రకటిస్తామని, మూడు నియోజకవర్గాలకు ఒకటి చొప్పున స్క్రీనింగ్ కమిటీలు ఏర్పాటు చేస్తామని, అభ్యర్థుల ప్రకటనకు అవసరమైన వేదికలను కీలక నేతలు చూస్తారని చెప్పారు.
సెప్టెంబర్ 2న ఔటర్ రింగ్ రోడ్డు పరిసరాల్లో భారీ ఎత్తున ప్రగతి నిర్వహణ సభ నిర్వహిస్తామని,1500 ఎకరాల విస్తీర్ణం ఉండే చోటే ఈ సభ నిర్వహిస్తామని అన్నారు.టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగసింది. ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నామని, 9 నిర్ణయాలను ఏకగ్రీవంగా ఆమోదించామని చెప్పారు. తాము తీసుకున్న నిర్ణయాలను ఆమోదించాలని కేంద్రాన్ని కోరతామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇవ్వనప్పటికీ రూ.20 వేల కోట్లు ఇవ్వాలని, వరి, మొక్క ధాన్యాలకు మద్దతు ధర రూ.2 వేల చొప్పున ఉండాలని, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు పెంచాలని కోరతామని చెప్పారు.
రాహుల్ మాట్లాడటంలో పరిణితి చెందాలని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టడం లేదన్న ఆయన ఆరోపణల్లో నిజం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ 100కు పైగా సీట్లలో గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెసేతర, బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్ తమదని స్పష్టం చేశారు. ఏక కాలంలో రూ.2 లక్షల రుణమాఫీ సాధ్యం కాదని, దశలవారిగా చేయాల్సిందేనన్నారు. కుటుంబపాలన గురించి రాహుల్ మాట్లాడటం హాస్యాస్పదమని, ఢిల్లీ కుటుంబపాలన కంటే తమదే నయమని అన్నారు.
నిరుద్యోగ భృతిపై కాంగ్రెస్‌ను నిలదీస్తామన్నారు. ఎంతమంది నిరుద్యోగులకు, ఏ లెక్కన భృతి ఇస్తారో చెప్పాలని ప్రశ్నించారు. బోగస్ పథకాలను మేం అమలు చేయడం లేదన్నారు. ఎన్నికలకు ఆరునెలల ముందు ముందస్తు అనలేమని, ఈ ఆరు నెలల కాలంలో ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించవచ్చని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకం ఆయుష్మాన్ భారత్ కంటే గొప్ప పథకాన్ని తమ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఆయుష్మాన్ భారత్ కోసం తెలంగాణ సాఫ్ట్‌వేర్ తీసుకున్నారని చెప్పారు. రైతు బీమ మొత్తం తమ ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు.
