Tuesday, May 7, 2024
- Advertisement -

జగన్ ఛాలెంజ్‌కి స్పందించే దమ్ములేదు…. బురద మాత్రం చల్లుతూ ఉంటారా బాబుగారూ?

- Advertisement -

ప్రస్తుత రాజకీయాల్లో చంద్రబాబుకు ఉన్న ఒకే ఒక్క శతృవు జగన్. మామూలుగా అయితే రాజకీయ ప్రత్యర్థిగా, ప్రతిపక్ష నాయకుడిగా జగన్‌ని చూడాలి. కానీ సీనియర్ మోస్ట్‌ని, ప్రపంచానికే పాఠాలు చెప్పిన వాడిని అని చెప్పుకునే చంద్రబాబుకు అంత పరిణతి ఎక్కడుంది. అందుకే జగన్‌ని ఒక రాక్షసుడిగా, శతృవుగా చూస్తూ ఉంటారు. ఆయన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కూడా అదే విషం నూరిపోయడంలో బాబు భజన మీడియా ఎలాగూ అహర్నిశలూ పనిచేస్తూ ఉంటుంది. జగన్‌ని మినహాయిస్తే మిగతా అందరు నాయకులూ చంద్రబాబుకు బంధువులే. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబుని అడ్డంగా బుక్ చేసి తెలంగాణాలో టిడిపిని నామరూపాల్లేకుండా చేసిన కెసీఆర్‌తో స్నేహం కోసం బాబుతో సహా టిడిపి నాయకులు, ఆ పార్టీ భజన మీడియా సంస్థలన్నీ కూడా వెంపర్లాడుతూ ఉన్న విషయం కనిపిస్తూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధికారికంగా రావాల్సిన వాటిని కూడా కెసీఆర్ ఇవ్వకుండా ఎగనామం పెడుతున్నా మాట్లాడే ధైర్యం చంద్రబాబుకు లేదు. ఇక నరేంద్రమోడీతో కూడా అదే స్థాయిలో సాగిలపడ్డాడు చంద్రబాబు. హోదా, ప్యాకేజ్, రైల్వే జోన్……ఇలా అధికారికంగా ఇవ్వాల్సిన వాటిని కూడా మోడీ సర్కార్ ఇవ్వడం లేదు. అయితేనేం బాబుకు నరేంద్రమోడీ ఆత్మబంధువే. నిజానికి మోడీ, కెసీఆర్‌లు బాబుకి రాజకీయంగా కూడా చుక్కలు చూపిస్తున్నారు. అయినప్పటికీ వాళ్ళతో స్నేహంగా ఉండాల్సిన గత్యంతరం లేని పరిస్థితి చంద్రబాబుది. అలాగే ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నప్పుడే తనతో గేమ్స్ ఆడుకుంటున్న కెసీఆర్, మోడీలు ఇంకా రెచ్చిపోయి పూర్తిగా బుక్ చేయకుండా ఉండాలంటే అధికారం అవశ్యం. తెలంగాణాలో ఎలాగూ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. సీమాంధ్రలో బాబు అధికారానికి అడ్డొచ్చే ఒకే ఒక్కడు, బాబును అధికారంలో నుంచి దించే సత్తా ఉన్న ఒకే ఒక్కడు జగన్. అందుకే ఎట్టిపరిస్థితుల్లోనూ జగన్‌ని అణచడం కోసం, ప్రజల్లో జగన్‌పై ద్వేషం పుట్టించడం కోసం ఎన్నో వ్యూహాలు పన్నుతున్నాడు చంద్రబాబు.

అలాంటి చంద్రబాబుకు స్వయంగా జగనే ఓ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. పనామా పేపర్స్‌లో తన పేరు ఉంది అని నిరూపించండి…… పదిహేను రోజుల్లో నిరూపిస్తే పూర్తిగా రాజకీయాల్లో నుంచి తప్పుకుంటానన్నాడు. అలాంటి అవకాశాన్ని ఏ నాయకుడైనా వదులుకుంటాడా? వైఎస్‌లు రాజకీయంగా పూర్తిగా అంతమవ్వాలనుకునే చంద్రబాబు అండ్ టీం అస్సలు వదులుకునే అవకాశమే లేదు. కానీ చంద్రబాబు కానీ ఆయన భజన మీడియా కానీ కనీసం స్పందించిన పాపాన పోలేదు. పనామా పేపర్స్‌లో జగన్ ఫేరు ఉందా? లేదా? అంటే సమాధానం లేదు. చంద్రబాబుతో పాటు ఆ బ్యాచ్ అంతా కూడా జగన్‌ని రాజకీయాల్లో లేకుండా చేసే ఈ సువర్ణావకాశాన్ని ఎందుకు వదులుకున్నట్టు? సమాధానం చాలా సింపుల్. పనామా పేపర్స్‌లో జగన్ పేరు లేదు కాబట్టి. జగన్ అవినీతి గురించి పనామా పేపర్స్‌లో కనీస స్థాయిలో కూడా ప్రస్తావించింది లేదు కాబట్టి. ఈ విషయం తెలుసుకోవడానికి నెట్‌లో ఉన్న పనామా పేపర్స్ చూస్తే చాలు….ఎవ్వరికైనా ఇట్టే అర్థమయిపోతుంది. కానీ టెక్నాలజీ కింగ్‌ని అని చెప్పుకునే చంద్రబాబు మాత్రం ఆ విషయం తెలియనట్టే నటిస్తూ ఉంటాడు. తాజాగా కూడా మరోసారి పనామా పేపర్స్‌లో జగన్ పేరు ఉంది అని చెప్పుకొచ్చాడు చంద్రబాబు. ఇక జగన్ అవినీతి వ్యవహారాలపై ఈడీ రిపోర్ట్ మరోసారి రెచ్చిపోయింది ఎల్లో మీడియా.

నంబర్ ఒన్ పత్రిక ప్రచురించిన న్యూస్‌లో ఒక ఇంగ్లీష్ పత్రికలో వచ్చిన వార్త ఆధారంగా అని అయినా చెప్పుకొచ్చారు. కానీ తోక పత్రికలో మాత్రం ఆ ప్రస్తావన కూడా లేదు. డైరెక్ట్‌గా ఈడీనే విషయం చెప్పేసినట్టుగా రాసుకొచ్చారు. ఇక చంద్రబాబుతో సహా టిడిపి నాయకుల వ్యాఖ్యానాలు ఎలానూ ఉండనే ఉన్నాయి. ప్రధాన పత్రిక చెప్పినట్టుగా ఒక ఇంగ్లీషు పత్రికలో వస్తే అది అధికారికం అయిపోతుందా? అయినా ఇంగ్లీషు పత్రికల్లో కూడా తెలుగు మీడియాలో ఉన్నట్టుగా అమ్ముడుపోయిన పత్రికలు ఎన్ని లేవు? ఈ తాపత్రయమంతా కూడా పాదయాత్రతో జగన్‌కి వస్తున్న మైలేజ్‌ని తగ్గించడం కోసమే అన్న విషయం ఎవరికి తెలియనిది? అయినా ఇన్ని వ్యూహాలు, రాద్ధాంతాలు చేసే బదులు ‘నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా’ అన్న జగన్ సవాల్‌ని స్వీకరించొచ్చుగా? పనామా పేపర్స్‌లో జగన్ పేరు ఉందని చెప్పి……..జగన్ పేరు ఉన్న పనామా పేపర్స్ చూపించి ఉంటే ఈ పాటికి రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి జగన్‌కి ఉండేదిగా? అది మాత్రం చంద్రబాబు అండ్ కో కు సాధ్యం కాదు. 2014 ఎన్నికల ప్రచారం సందర్భంగా లోటు బడ్జెట్‌లో రాష్ట్రం ఉంటే రుణమాఫీలు ఎలా చేస్తారు అని అడిగితే చంద్రబాబు ఒకటికి వంద సార్లు చెప్పిన సమాధానం….జగన్ ఆస్తులు స్వాధీనం చేసుకుని రుణమాఫీలు చేస్తామని…..జగన్ తిన్న లక్ష కోట్లను కక్కించి ప్రజలకు పంచిపెడతామని…….అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళు కావస్తోంది…..మరి జగన్ అవినీతి సొమ్ము అని టిడిపి నేతలు చెప్తున్నదానిలో ఒక్క రూపాయి అయినా స్వాధీనం చేసుకోగలిగారా? ప్రజలకు పంచిపెట్టారా? ఈడీ జాబితాలో టాప్ టెన్‌లో జగన్ అని హెడ్‌లైన్స్ పెట్టారు. తీరా ఈడీ తేల్చిన జగన్ అవినీతి అని ఎల్లో మీడియాలో చెప్పిన సంఖ్య ఎంత అంటే 368 కోట్లు. ఈ సంఖ్యను చూడగానే ఆశ్ఛర్యం వేసింది. వైఎస్ బ్రతికున్నప్పటి నుంచి టిడిపి భజన మీడియాతో చంద్రబాబు బ్యాచ్ అంతా కూడా లక్ష కోట్ల అవినీతి అన్నారు. ఆ తర్వాత 2014 ఎన్నికలకు ముందు 16లక్షల కోట్లు అన్నారు. మరి ఆ లక్షల కోట్లు అన్నీ ఏమైపోయాయి………కేవలం 368కోట్లకు ఎందుకు పరిమితమైంది?

చివరగా చంద్రబాబు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే. ఇంకా ఎంత కాలం జగన్ అవినీతి అంటూ ఎల్లో మీడియాలో ప్రచారం చేయిస్తూ పబ్బం గడుపుకుంటూ ఉంటారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. కేంద్రంలో కూడా టిడిపి పార్టీ భాగస్వామిగా ఉంది. జగన్ అవినీతిని నిరూపించి ఆయన ఆస్తులను స్వాధీనం చేసుకోండి. ప్రజలకు పంచిపెట్టండి. జనాలకు కూడా మంచి చేసిన వాళ్ళు అవుతారు. అలాగే చంద్రబాబుకు కూడా రాజకీయ ప్రత్యర్థి అన్నవాడే లేకుండా పోతాడు. కానీ ఇలా కేవలం అబద్ధపు ప్రచారంతో నిందలు వేస్తూ పోతే మాత్రం ఎల్లకాలం మీరు చెప్పే అబద్ధాలను జనాలు నమ్ముతారు అనుకుంటే మాత్రం అది కేవలం చంద్రబాబు భ్రమే అవుతుందనడంలో సందేహం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -