అమెరికాలో భారత రాయబార కార్యాలయం ఎదుటనున్న మహాత్మాగాంధీ విగ్రహ అపవిత్రం అంశాన్ని.. అత్యంత దారుమైన ఘటనగా అభివర్ణించారు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కైలీ మెక్ఎనానే. ఆయన ప్రతిష్ఠను గౌరవించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ లాంటి ప్రాంతాల్లో ఇది చాలా అవసరమన్నారు.
భారత్లో కొత్తగా తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా సిక్కు-అమెరికన్లు చేపట్టిన నిరసనల సందర్భంగా ఖలిస్థానీ వేర్పాటువాదులు వాషింగ్టన్ డీసీలోని మహాత్మాగాంధీ విగ్రహాన్ని అపవిత్రం చేశారు.
ఈ ఘటనపై తమకు సమాచారం అందినట్లు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. అమెరికాలో విదేశీ మిషన్లు, కార్యకలాపాలకు భద్రత కల్పించే విషయానికి కట్టుబడి ఉన్నట్లు వివరించారు. ఇటీవలి పలు ఘటనల నేపథ్యంలో ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించినట్లు పేర్కొన్నారు.
