దుర్గమ్మ ఉత్సవాల విశిష్టతకు భంగం కలిగించేలా టీడీపీ నేతల చర్యలు ఉంటున్నాయని మండిపడ్డారు వైసీపీ నేతలు. దుర్గమ్మ ఉత్సవాలకు ఆహ్లాదం పేరుతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని మండిపడ్డారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన వైసీపీ నాయకులు, మాజీ మంత్రులు పేర్ని వెంకట్రామయ్య (నాని), వెల్లంపల్లి శ్రీనివాస్, ఎన్టీఆర్జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు టీడీపీ నేతల తీరును తప్పుబట్టారు.
విజయవాడ ఉత్సవ్ పేరుతో భారీ దోపిడీకి స్కెచ్ వేశారని ఆరోపించారు. దీనికి టీడీపీ నేతలు కేశినేని చిన్ని, పట్టాభీలు నేతృత్వం వహిస్తున్నారని… ఉత్సవ్‌లో స్టాల్స్ నిర్వాహకుల నుంచి లక్షలు దండుకుంటున్నారు అని మండిపడ్డారు. దసరా పేరు చెబితే గుర్తుకు వచ్చే అమ్మవారి ఉత్సవాలకు పోటీగా అన్ని హంగులతో, వినోదం, అహ్లాదం అంటూ కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.
విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బియ్యం రవాణా మాఫియా నడిపేది ఎంపీ కేశినేని చిన్నినే అని ఆ పార్టీ ఎమ్మెల్యే చెబుతున్నారు. పెద్దిరెడ్డి అనే వ్యక్తిని మేనేజర్ గా పెట్టుకుని ఎంపీ కార్యాలయం నుంచే వ్యవహారాలన్నీ నడిపిస్తున్నాడు అని ఆరోపించారు. ఆ వ్యక్తి ప్రతినెలా రూ. కోటిన్నర తెచ్చి ఎంపీ చేతుల్లో పెడుతుంటే దాన్ని కేశినేని చిన్ని హైదరాబాద్‌కి తరలిస్తున్నాడు అని దుయ్యబట్టారు.
చందాల కోసం వ్యాపారులను బెదిరిస్తున్నారు అని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాశ్ ఆరోపించారు. కబ్జా చేయాలని ఆలోచన లేకపోతే ముందుగానే మట్టి తరలించి చదును చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పాలి. విజయవాడ ఉత్సవ్ కోసం మురళీ ఫార్చ్యూన్లో ఇప్పటి వరకు పది మీటింగ్‌లు పెట్టి సినీ తారల్ని పిలిపించి భారీగా కార్యక్రమంతో ప్రారంభోత్సవం చేసిన టీడీపీ నాయకులు, అమ్మవారి ఉత్సవాల నిర్వహణ గురించి పట్టించుకోలేదు అన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో కూటమి ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు అవినాశ్ భయపడి పారిపోయేరకం కాదని గుర్తుంచుకోవాలి. వైయస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక ఎంపీ కేశినేని చేసిన అక్రమాలన్నీ వెలికితీసి ఎక్కడున్నా తీసుకచ్చి కోర్టుల్లో శిక్షలు పడేదాకా పోరాడతాం అన్నారు.
విజయవాడ ఉత్సవ్ పేరుతో విజయవాడ సిటీకి దేశ స్థాయిలో గుర్తింపు తీసుకొస్తానని ఎంపీ కేశినేని చిన్ని చెప్పడం చూసి నగర ప్రజలంతా చీదరించుకుంటున్నారు అన్నారు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్. టీడీపీ అరాచకాలను వైసీపీ ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పుకోలేని స్థితిలో మాపై వ్యక్తిత్వహననం చేసేలా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతున్నాడు అని దుయ్యబట్టారు.
