హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ ముఠాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. నగరంలో భారీగా మత్తు పదార్థాలు పట్టుబడటం కలకలం రేపింది. హెచ్ న్యూ, టోలిచౌకి పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో 150 గ్రాముల ఎండీఎంఏ (MDMA) డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో ఇద్దరు నైజీరియన్ డ్రగ్ సరఫరాదారులను పోలీసులు అరెస్ట్ చేశారు.
విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ముందస్తుగా నిఘా పెట్టి ఈ దాడులు నిర్వహించారు. నిందితులు నగరంలోని యువతను లక్ష్యంగా చేసుకొని డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న 150 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ విలువ సుమారు రూ.20 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
డ్రగ్ రాకెట్ వెనుక మరెవరైనా ఉన్నారా? ఈ మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయి? నగరంలో ఎవరెవరికి సరఫరా చేస్తున్నారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అరెస్ట్ అయిన నిందితులను కస్టడీలోకి తీసుకొని లోతైన విచారణ చేపట్టనున్నట్టు సమాచారం.
ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను మధ్యాహ్నం 4 గంటలకు మీడియా సమావేశంలో వెల్లడించనున్నట్లు డీసీపీ టాస్క్ ఫోర్స్ వైభవ్ గైక్వాడ్ తెలిపారు. నగరంలో డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు కొనసాగుతాయని, మత్తు పదార్థాల అక్రమ రవాణాను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని పోలీసులు స్పష్టం చేశారు.
