Thursday, April 25, 2024
- Advertisement -

‘మా’ లో కుంభకోణం: పూటకో వివాదం రోజుకో అభియోగం

- Advertisement -

ఏం సినీ పరిశ్రమరా బాబూ…. వీళ్లేం హీరోలు, హీరోయిన్స్ రా నాయనా… పూటకో వివాదం… రోజుకో అభియోగం…

తాజాగా ‘మా’లో దొంగలు పడ్డారు. విదేశాల్లో నిర్వహించిన ఈవెంట్లలో అవకతవకలు, నిధులు దారి మళ్లించారు. అని ఆరోపణలు వచ్చాయి. నిధుల గోల్ మాల్ పై సాక్షాత్తూ ‘మా’ జనరల్ సెక్రటరీ అడిగినా మా అధ్యక్షుడు సమాధానం చెప్పకుండా తప్పించుకు తిరగడం. ఆధారాలతో సహా ఆరోపణలు చేసినప్పుడు, అదే రీతిలో ఆధారాలతో సహా కాదని అవి కేవలం ఆరోపణలే అని, నిందలన్నీ నిజాలు కావని నిరూపించుకోవాలి. పదవులకు రాజీనామా చేసి, నిజనిర్ధారణ కమిటీ వేయించి, నిజానిజాలు తేల్చాలి. ఆరోపణలన్నీ అబద్ధాలే అని తేల్చితే, అప్పుడు కడిగిన ముత్యంలా మళ్లీ బాధ్యతలు చేపట్టాలి. అంతే కానీ బాధ్యతలేని వ్యక్తిలా ఫోన్లు కట్ చేస్తూ, నంబర్ బ్లాక్ చేస్తూ, సీసీ ఫుటేజ్ డిలీట్ చేస్తూ, మినిట్స్ బుక్ సహా, ఇతర రికార్డులుమాయం చేసేస్తే ఏమనుకోవాలి ? బాధ్యత గల మీడియాకు సమాధానం చెప్పక్కర్లేదు సరే, ‘మా’సభ్యులకైనా సమాధానం చెప్పాలి కదా. ప్రమాణాలు చేసేస్తే ఆరోపణలకు సమాధానం చెప్పినట్టా ? ఇలా తప్పించుకు తిరగడం వల్ల పరిశ్రమ పరువు నిలబెట్టినట్టా ?

అసలు ఎప్పటికప్పుడు వచ్చే ఇలాంటి ఆరోపణలతోనే  పరిశ్రమ పరువుప్రతిష్ఠలు రోజురోజుకూ పాతాళంలో కూరుకుపోతున్నాయా…?
అని బాధతో ప్రశ్నిస్తే……. ఊహించలేని సమాధానం వినిపిస్తోంది.
అసలు పరువు ప్రతిష్ఠలు ఉంటే కదా… అని…..అదేంటి ? ఎంతో ఘనచరిత్ర ఉన్న తెలుగు సినీ పరిశ్రమకు పరువు ప్రతిష్ఠలు లేవా ? అంటే…. ఒకప్పుడు ఉండేవి.

పరువు ప్రతిష్టలే కాదు హిట్స్, సూపర్ హిట్స్, ఇండస్ట్రీ ఆల్ టైమ్ రికార్డ్స్, శతదినోత్సవ వేడుకలు, ఏడాది ఆడిన సినిమాలు, ఏడాదిపైనే ఆడించిన చిత్రాలు, చెరగని రికార్డులు, చెదరని అభిమానులు, సినిమా నటులంటే ప్రాణాలర్పించేంత అభిమానం, ఆరాధన, పిచ్చి, ఆఖరికి ఏ తెలుగువాడు తిరుమలేశుని దర్శనానికి తిరుపతి వెళ్లినా, ఈ సినిమా వాళ్లను చూడటానికి అట్నుంచి అటు మద్రాసు వెళ్లి, వీళ్ల ఇంటి ముందు తిండీ తిప్పలు మాని రోజంతా పడిగాపులు కాసి, వారి దర్శనభాగ్యం దక్కితే జన్మధన్యమన్నంత ఆనందంతో వెనుతిరిగేవారు. సొంతూరు వెళ్లి దేవదేవుడి దర్శనం గురించి కంటే ఫలానా హీరోని చూశాను. ఫలానా హీరోయిన్ ఇల్లు చూశాను. అంత పెద్ద హాస్యనటుడు ఎంత సింపుల్ గా జీవిస్తున్నాడో…ఒరేయ్ వాడు సినిమాల్లో అంత పెద్ద విలన్ కదా…ఆడవాళ్లు కనపడితే రేప్ చేసి పారేస్తాడు కదా…కానీ ఆయన్ని చూడటానికి వెళ్తే ఎంత మర్యాదగా పలకరించాడో….భయపడాల్సిన పనిలేదు. నేనూ మీలాంటి మామూలు వ్యక్తినే. సినిమాల్లో అలా నటిస్తామంతే… నిజజీవితంలో అలా చేయం కదా…అని ప్రేమతో దగ్గరకు తీసుకుని మా అందరితో ఫొటోలు దిగి, ఆటోగ్రాఫులు కూడా ఇచ్చాడ్రా…. అని రోజుల తరబడి చెప్పుకునే వారు. ఆ కథలు విని, ఆ నటీనటుల జీవితాల నుంచి స్ఫూర్తి పొందినవారెందరో. సినీ పరిశ్రమపై గౌరవాన్ని, అభిమానాన్ని పెంచుకుని, కళ్ల నిండా ఆశలతో, కట్టుబట్టలతో మద్రాసు ట్రైనెక్కేసిన వాళ్లకు కొదవేలేదు. అలా వెళ్లినవారు పరిశ్రమలోని 24 క్రాఫ్టుల్లో వివిధ రకాలుగా స్థిరపడ్డారు. అభిమానులతో గుళ్లు, గోపురాలు కట్టించుకున్నారు. ఆస్తిపాస్తులు కూడగట్టుకున్నారు. తమ గౌరవమర్యాదలు, పరువుప్రతిష్ఠలు పెంచుకోవడంతో పాటు తెలుగు సినిమా పరువుప్రతిష్ఠలు పెంచారు. తెలుగువారి సత్తాను ప్రపంచానికి చాటారు. దేశవిదేశాలకు చెందిన అనేకమందిని ఆ రంగంవైపు ఆకర్షించారు.

ఇదంతా గతవైభవం. ఇప్పుడు రోజులు మారాయ్. పరిశ్రమలో రోగాలు పెరిగాయ్. గత కొన్నాళ్లుగా సినీపరిశ్రమ వివాదాల కేంద్రంగా మారింది.

డ్రగ్స్ కేసులో టాలీవుడ్ ప్రముఖులు..,
ఇతర భాషల కథలు ఎత్తుకొచ్చి, కాపీ పేస్టుల సినిమాలతో వివాదాలు…
స్టార్ హోటళ్లో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ప్రముఖ నటి,
వ్యభిచారం ముఠా నిర్వహిస్తున్న సీనియర్ నటి
అవకాశాల్లేక అంగడిసరుకైన మాజీ హీరోయిన్
కాస్టింగ్ కౌచ్ ఆరోపణల్లో అగ్రనటులు
పడుకుంటేనే పనవుతుందనే దర్శకనిర్మాతలు
అవకాశాల కోసం దేనికైనా సిద్ధపడే నటీనటులు
సినిమా చాన్స్ అడిగితే వాడేసి, వదిలేస్తున్న సినీపెద్దల వారసులు
పోలీసుల్ రైడింగ్, రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ప్రముఖ యాంకర్…

ఇవీ గత కొన్నాళ్లుగా తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి వస్తున్న వార్తలు. ఇటీవల దేశం కాని దేశంలోనూ తెలుగువారి పరువును కొందరు మంటగలిపేశారనే ఆరోపణలు. అమెరికాలో ఈవెంట్ల పేరుతో, వివిధ సభల్లో పాల్గొనడానికి వెళ్లే కొందరు హీరోయిన్లు, యాంకర్లు, అక్కడ వెలగబెడుతున్న వ్యభిచారం గుట్టురట్టయింది. కిషన్ మోదుగమూడి, అతడి భార్య చంద్రకళ కలిసి ఈ సెక్స్ రాకెట్ నడుపుతున్నారని అమెరికాలోని షికాగో పోలీసులు కేసు పెట్టారు. అందులో తెలుగు, కన్నడ పరిశ్రమకు చెందిన పలువురు హీరోయిన్లు, వర్ధమాన నటీమనులు, ప్రముఖ యాంకర్లు ఉన్నారని కొద్దిరోజుల క్రితం వార్తలు వస్తున్నాయి. మూడక్షరాల పేరున్న నటి, ఐదక్షరాల పేరున్న హీరోయిన్, ప్రముఖ యాంకర్, సీనియర్ యాంకర్, ప్రముఖ సింగర్, మంచి ఫాలోయింగ్ ఉన్న సింగర్…ఇటీవలే రాజకీయాల్లో చేరిన తార…. ఇలా రకరకలా పేర్లు వినిపిస్తున్నాయి. 42పేజీల ఎఫ్ఐఆర్ నమోదు చేసిన షికాగో పోలీసులు ఆ ఎఫ్ఐఆర్ లో అన్ని వివరాలు పొందుపరిచారు. వాటి ఆధారంగా కోర్టు తీర్పు ఇవ్వనుంది.

మొత్తానికి ఎప్పటిలాగే మరోసారి తెలుగు సినీపరిశ్రమకు చెందిన పలువురు తెలుగువారి పరువు తీసిపారేశారు. ఇప్పుడీ సెక్స్ రాకెట్ ఆయా తారాల గుండెల్లోకే దూసుకుపోతోంది. ఎప్పుడు ఎవరి పేరు బయటపడుతుందో….అనే టెన్షన్ తో తలలు పట్టుకుంటున్నారు. కొందరు హీరోయిన్లు, యాంకర్లు అప్రూవర్లుగా మారి, మేము కావాలని వ్యభిచారం చేయలేదు, మా చేత బలవంతంగా చేయించారు అని చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా ఆ విషయాన్ని వీరు ముందుగా చెప్పి ఉంటే వీరి మాటలను పోలీసులు ఏంటి ఎవరైనా నమ్మేవారే. బలవంతంగా చేయిస్తే ఇన్నాళ్లూ ఫిర్యాదు ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. పోలీసులకు దొరికిపోవడంతోనే….తామే పాపం ఎరుగమని, కిషన్ మోదుగమూడి, ఆయన భార్య చంద్రకళ బెదిరించడం వల్లే తాము ఈ రొంపిలోకి దిగామని సినిమాకథలు చెప్పుకొస్తున్నారు. సరే ఇలాంటి వ్యవహారాలు బయటపడిన ప్రతిసారీ సినీప్రముఖులు చెప్పే మాట ఒకటి ఉంటుంది. మేం సినిమా వాళ్లమయినంత మాత్రాన వ్యక్తిగత జీవితాలు ఉండవా ? వ్యభిచారం కేసులో మా వాళ్లు దోషులు కారు. కేవలం బాధితులు. వారికి తెలియకుండా, ప్రలోభాలతో, బెదిరింపులతో ఆ రొంపిలోకి దించారు. అని కవరింగ్ ఇస్తుంటారు. సరే అమెరికా వెళ్లగలిగేంత తెలివితేటలున్న వారికి వ్యభిచార కూపంలోకి దిగుతున్నామన్న తెలివితేటలు లేవని వాళ్లు చెప్పడం మనం వినడం కామెడీ కాకపోతే మరేమిటి ? ఇంకో మాట కూడా వీరు చెబుతుంటారు. ఈ మీడియావాళ్లకు, సోషల్ మీడియావాళ్లకు, యూ ట్యూబ్ చానెల్సు వాళ్లకు మరేం పని లేదు. ఎవరో ఒకరు చేస్తే అందరూ చేసినట్లు మాపై బురద జల్లేస్తుంటారు. వ్యూస్ కోసం, రేటింగుల కోసం మమ్మల్ని వాడేసుకుంటున్నారు. అని మండిపడిపోతుంటారు. కానీ నిప్పు లేనిదే పొగరాదని గ్రహించలేని ఆమాయకులు ఈ సినిమావాళ్లు. మొన్నామధ్య పోసాని కృష్ణమురళీ ఓ టీవీ డిబేటులో కూర్చుని ప్రత్యేకహోదాపై మేమెందుకు పోరాడాలి. రాజకీయాల్లో ఉన్నవాళ్లు ఎప్పుడు ఏం చెబితే అది మేం వినాలా ? అని అసభ్యకరమైన భాష వాడాడు. దానికి ఆ యాంకరు కూడా ఏం మీ పరిశ్రమలో లేరా అలాంటి వాళ్లు అని ఫ్లోలోనో…ఆవేశంలోనో….నోరు జారాడు. దానిపై సదరు పరిశ్రమలోని కొందరు అగ్గిమీద గుగ్గిలం అయిపోయారు. ఆ యాంకర్ మీద కేసు కూడా పెట్టారు. అప్పుడు ఆ యాంకర్ అన్న మాటే ఇప్పుడు అమెరికా పోలీసులు అంటున్నారు. వ్యభిచారం కేసులో పలువురు టాలీవుడ్ ప్రముఖులున్నారని కేసు పెట్టారు కూడా. మరి యాంకర్ పై కేసు పెట్టిన నటీమనులు అప్పుడు అమెరికా పోలీసులపై ఎందుకు కేసు పెట్టలేదు ?

మా సినిమా వాళ్లం ఏం చేసినా బూతద్దంలో చూపిస్తున్నారు.
కాదు కాదు బూతుద్దంలో చూపిస్తున్నారు.
డ్రగ్సు కేసులో సినీ పరిశ్రమకు చెందిన వారందరమూ లేము.
ఎవరో కొందరు ఉన్నారని, అందరినీ అనుమానంగా చూస్తే ఎలా ?
కాస్టింగ్ కౌచా….? ఇక్కడా….? అబ్బే అదేం లేదు…….
పడుకుంటేనే అవకాశాలా…? నోనో నెవ్వర్…
అవకాశాల పేరుతో వాడుకుంటే ఉండొచ్చు…కానీ అందర్నీ కాదు.
కొందరికి అలాంటి పరిస్థితి ఎదురుకావచ్చు…
కేవలం అందం అభినయం చూసే అవకాశాలొస్తున్నాయి.
పడుకుంటేనే చాన్సులనేది అబద్ధం…. అమెరికా సెక్స్ రాకెటులో ఉన్న కిషన్ మోదుగమూడి ఇప్పుడు అసలు నిర్మాతే కాదు. అప్పుడెప్పుడో ఒకటి రెండు సినిమాలకు పని చేసి ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిశ్రమతో ఆయనకు సంబంధాలు లేవు….అని కొందరు చెప్పుకొచ్చారు.

ఇలా వివాదాలు, ఆరోపణలు వచ్చిన ప్రతిసారి ఖండించడాలు, వివరణలు ఇవ్వడాలు, మీడియా, సోషల్ మీడియా మీద దండెత్తడాలు… ఇవి తప్ప ఈ మధ్య తెలుగు సినీపరిశ్రమ గురించి నాలుగు మంచి వార్తలు ఎక్కడ బయటకు వచ్చాయి. ఆ మధ్య బాహుబలితో అంతర్జాతీయ స్థాయిలో పేరుప్రఖ్యాతలు వచ్చాయి. ఆ తర్వాత క్యాస్టింగ్ కౌచ్, సెక్స్ రాకెట్ ఆరోపణలతో అదే అంతర్జాతీయ స్థాయిలో పరువుప్రతిష్టలు మంటగలిసిపోయాయి. ఎప్పుడూ మీరు చెప్పుకునేటట్టు మీ అద్దాల మేడలపై ఎవరికీ రాళ్లు వేయాలని లేదు. ఆ అద్దాలలో మీ ప్రతిబింబాలను చూసుకునేటప్పుడు ఒక్కసారి మీకు మీరు సమాధానం చెప్పుకోగలిగితే చాలు. మీపై వచ్చే ఆరోపణలపై మీడియాను, సోషల్ మీడియాను ఆడిపోసుకునేముందు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుంటే చాలు. మీ పరువుప్రతిష్టలు, గౌరవమర్యాదలతో పాటు తెలుగు సినిమా, తెలుగు జాతి గౌరవమర్యాదలను, పరువుప్రతిష్టలను పెంచడంలో మనమెంత కృషి చేస్తున్నామని ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే చాలు. తెలుగు సినిమా స్థాయిని, తెలుగుజాతి గౌరవాన్ని పెంచే ప్రతి ఒక్కరికీ కోట్లాది అభిమానులు ఎన్ని అద్దాలమేడలైనా కట్టిస్తారు. గుళ్లు గోపురాలు కట్టి ఆరాధిస్తారు. అదే జాతిగౌరవాన్ని, పరిశ్రమ పరువుని మంటగలిపితే ఆ అద్దాలమేడల మీద అభిమానులే రాళ్లు వేయక్కర్లేదు. అమెరికా పోలీసులైనా, గల్ఫ్ పోలీసులైనా, హైదరాబాద్ పోలీసులైనా, ఆఖరికి మీ అన్యాయాలు, అవినీతి , అక్రమాలను చూస్తూ సహించలేక, మీ తోటి నటీనుటలైనా, ‘మా’ సభ్యులైనా ఎవరైనా రాళ్లు వేయవచ్చు. తర్వాత పగిలేది మీ అద్దాల మేడలే కాదు. మీ అభిమానుల మనసులు కూడా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -