Sunday, May 26, 2024
- Advertisement -

మాల్దీవుల సాయానికి భారత సైన్యం సిద్ధంగా ఉంది…ఆర్మీ

- Advertisement -

మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం ముదిరింది. పార్లమెంటును సస్పెండ్ చేసి సోమవారం 15 రోజులపాటు అత్యవసర పరిస్థితిని ప్రకటించిన ప్రభుత్వం, కొన్ని గంటల వ్యవధిలోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అరెస్టు చేయించింది. మాజీ అధ్యక్షుడు మౌమూన్ అబ్దుల్ గయూమ్‌ కూడా నిర్బంధంలో ఉన్నారు. మాల్దీవులకు సైన్యాన్ని, దూతలను పంపించి పరిస్థితి సద్దుమణిగేలా చూడాలని ఆ దేశ విపక్ష నేత ఇప్ప‌టికే భార‌త్ స‌హాయాన్ని కోరారు.

మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం ముదిరిన నేప‌థ్యంలో అక్కడ ఏదైనా అనుకోని పరిస్థితులు తలెత్తితే సాయం చేయడానికి సిద్థంగా ఉన్నామని భారత సైనిక వర్గాలు తెలిపాయి. అక్కడ భారత పర్యాటకులను సురక్షితంగా తరలించడం మొదలుకుని సైనిక జోక్యం వరకు సాయమందించనున్నట్లు పేర్కొన్నాయి. కానీ ఈ విషయంలో ఇప్పటివరకు తమకు ప్రభుత్వం పరంగా ఎలాంటి ఆదేశమూ అందలేదని తెలిపాయి. మాల్దీవుల్లో నెలకొన్న పరిస్థితులను సాయుధ దళాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయని, ఏదైనా అనుకోని పరిణామాలు చోటుచేసుకుంటే స్వల్ప వ్యవధిలోనే అక్కడి మోహరిస్తాయని ఆ వర్గాలు తెలిపాయి.

భారత నావికాదళానికి సంబంధించిన రెండు యుద్ధ నౌకలు ఎల్లప్పుడూ పశ్చిమ సముద్రతీరంలో గస్తీ కార్యకలాపాలు నిర్వహిస్తుంటాయి. అవసరమైతే వాటిని మాల్దీవులకు పంపుతామని నావీ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు రక్షణ సహకారం కోసం మాల్దీవుల్లో భారత్‌కు రక్షణ దళం కూడా ఉంది. యుద్ధనౌకలు, విమానాలు, హెలికాప్టర్లు తరచూ పహారా కాస్తుంటాయని ఆయన చెప్పారు.

మాల్దీవులకు గతంలోనూ భారత్ సాయమందించింది. ఉదాహరణకు, ‘ఆపరేషన్ కాక్టస్’ కింద 1988లో మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్ గయూమ్ ప్రభుత్వంపై అబ్దుల్లా లుతుఫీ నేతృత్వంలో కొందరు పన్నిన కుట్రను అణచివేసేందుకు అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం పారాట్రూపర్లు, నావికాదళ యుద్ధనౌకలను మాల్దీవులకు హుటాహుటిన తరలించిన సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -