Wednesday, May 8, 2024
- Advertisement -

ఏపీ మంత్రివర్గ విస్తరణ ముహూర్తం ఖరారు

- Advertisement -

ఓ వైపు తెలంగాణ అసెంబ్లీ రద్దుకు సీఎం కేసీఆర్ ముహూర్తం ఫిక్స్ చేస్తే, మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం దాదాపు పెట్టేసినట్టే. ఈ సారి మంత్రివర్గ విస్తరణలో ఇద్దరికి అవకాశం దక్కనుంది. బీజేపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన పైడికొండల మాణిక్యాలరావు, కామినేని శ్రినివాస్ మంత్రిపదవులకు రాజీనామా చేయడంతో అప్పటి నుంచి ఆ రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ రెండు స్థానాల్లో ఇప్పుడు ఇద్దరిని తీసుకుని ఖాళీలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. ముస్లిం మైనార్టీలకు మంత్రివర్గంలో స్థానం ఎందుకు కల్పించలేదని ప్రతిపక్షం తీవ్రంగా విమర్శిస్తున్న నేపథ్యంలో వాళ్ల విమర్శలకు సమాధానం చెప్పడంతో పాటు, టీడీపీ ముస్లిం మైనార్టీల పక్షపాతి అని చెప్పుకోవడానికి ఇదే అదనుగా చంద్రబాబు పావులు కదిపారు. ముస్లిం మైనార్టీ వర్గం వారికి ఓ మంత్రిపదవి కేటాయిస్తామని ఇటీవల ఆయన ప్రకటించారు కూడా. ఈ నేపథ్యంలో టీడీపీకి చెందిన ముస్లిం మైనారిటీ నేతల్లో మంత్రి పదవి దక్కించుకునే అదృష్టవంతులు ఎవరనే చర్చ జరుగుతోంది. పోటీలో ప్రధానంగా ఇద్దరు సీనియర్లు ఉన్నారు. ఒకరు ఏపీ శాసనమండలి చైర్మన్‌ ఎన్‌ఎండీ ఫరూక్‌. రెండోవారు మండలిలో ప్రభుత్వ విప్‌ ఎంఏ షరీఫ్‌. వీళ్లిద్దరిలో ఎవరో ఒకరికి కచ్చితంగా మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయని తెలుస్తోంది. వైఎస్ఆర్ సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలో చేరి, మంత్రిపదవులపై ఆశలు పెట్టుకున్న అదే వర్గానికి చెందిన జలీల్‌ ఖాన్‌, చాంద్‌బాషాకు అవకాశం లేనట్టే.

ఇక ఎస్టీ సామాజిక వర్గం నుంచి కూడా మంత్రివర్గంలో ఎవరూ లేరు. దీనిపైనా తరచూ ప్రతిపక్షం విమర్శలు చేస్తూ, ఎస్టీలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తోంది. ఆ అవకాశాన్ని ప్రతిపక్షానికి ఇవ్వకూడదనే చంద్రబాబు ఎస్టీ వర్గానికి చెందిన వారిని కూడా మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ సీనియర్లు కూడా గిరిజనులకు మంత్రిపదవి ఇవ్వాలని చంద్రబాబుకు సూచించారు. దీంతో ఆ సామాజికవర్గంకు చెందిన వారిపైనా కసరత్తు చేశారు. టీడీపీ నుంచి ఎస్టీ సామాజికవర్గం తరఫున చాలామంది పోటీ చేసినా, పోలవరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా గత ఎన్నికల్లో ముడియం శ్రీనివాసరావు ఒక్కరే గెలిచారు. అదే వర్గానికి చెందిన కిడారి సర్వేశ్వరరావు, గిడ్డి ఈశ్వరి, వంతల రాజేశ్వరి వైఎస్ఆర్ సీపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి టీడీపీలో చేరిపోయారు. వీరు కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. కానీ టీడీపీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి కూడా మంత్రి పదవి రేసులో ముందంజలో ఉన్నారు. ఎస్టీల నుంచి మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే మాత్రం కచ్చితంగా ముడియం శ్రీనివాస్ లేదా గుమ్మడి సంధ్యారాణికే ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు సమాచారం. విద్యావంతురాలు, మహిళ కనుక సంధ్యారాణికే అవకాశం కాస్తా ఎక్కువుందని తెలుస్తోంది. అయితే సెప్టెంబర్ 6 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయి 15 లేదా 16 వరకు జరుగుతాయి. ఆ తర్వాతే మంత్రి వర్గ విస్తరణ ముహూర్తాన్ని ఖరారు చేస్తారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -