బీజేపీ అనుకున్నదొక్కటి… అయినదొక్కటి..!

- Advertisement -

దక్షిణాదిలో బీజేపీ బలంగా ఉన్నది ఒక కర్ణాటకలో మాత్రమే. అక్కడ బీజేపీ గెలిచిన ప్రతిసారి పాలన ఎప్పుడూ సజావుగా సాగలేదు. రాజకీయంగా ఎప్పుడు అసంతృప్తుల బెడద ఉంటూనే ఉంది. కర్ణాటకలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. బీజేపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్నప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ మాత్రం దక్కలేదు. దీంతో జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే ఆ ప్రభుత్వం పాలన చేపట్టిన కొన్ని నెలలకే కూలిపోయింది.

ఆ సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన కొంత మంది ఎమ్మెల్యేలను బీజేపీ తమవైపు లాగేసు కోవడంతో అక్కడ ప్రభుత్వం కూలిపోయింది.ఆ తర్వాత అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. యడ్యూరప్ప ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన పాలన కొద్దిరోజులు సజావుగా సాగినా ఆ తర్వాత యడ్యూరప్ప కుమారుడి జోక్యం పాలనలో అధికం కావడంతో అక్కడి ముఖ్య నాయకుల్లో అసంతృప్తి పెల్లుబుకింది. ఎడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవి చేపట్టి రెండేళ్లు గడిచినా పాలనలో మాత్రం పట్టు సాధించలేకపోయారు.

- Advertisement -

ఆయన కుమారుడిపై నిత్యం పార్టీ నేతలు ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేస్తూ వచ్చారు. దీంతో యడ్యూరప్ప సీఎం గా కొనసాగితే వచ్చే ఎన్నికలను ఎదుర్కోవడం కష్టమే అని బీజేపీ అధిష్టానం నిర్ణయానికి వచ్చింది.మామూలుగా బీజేపీలో 75 ఏళ్ల వయసు దాటిన వారిని కీలక పదవుల్లో నియమించరు. కానీ కర్ణాటకలో మాత్రం అక్కడి సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోయడంలో ముఖ్య పాత్ర పోషించిన యడ్యూరప్ప వయసును పరిగణనలోకి తీసుకోకుండా ముఖ్యమంత్రి పదవిని అప్పగించారు. ఆ తరువాత మారిన పరిస్థితుల నేపథ్యంలో 77 ఏళ్ల వయసులో ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి దింపి యడ్యూరప్ప సామాజిక వర్గానికే చెందిన బసవరాజ్ బొమ్మై ని సీఎంగా నియమించారు.

ఆయన ప్రభుత్వం ఏర్పడి రెండు వారాలు కూడా కాకముందే అప్పుడే పార్టీలో అసమ్మతుల బెడద ప్రారంభమైంది. మంత్రి పదవులు రాని వారితో పాటు వచ్చిన వారు కూడా తమకు కేటాయించిన శాఖలు నచ్చలేదని పేచీ పెట్టుకుంటున్నారు. దీంతో కొత్త ముఖ్యమంత్రి పాలన వైపు దృష్టి పెట్టడానికి అవకాశం లేకుండా పోతోంది. అసంతృప్తులను బుజ్జగించడానికే సమయం సరిపోతోంది.

మరో రెండేళ్లలో కర్ణాటకలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ లోపుగా పార్టీని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో బీజేపీ అధిష్టానం కొత్త ముఖ్యమంత్రిని నియమించగా.. అక్కడ మాత్రం సీన్ రివర్స్ కనిపిస్తోంది. పర్యాటక శాఖ మంత్రి ఆనంద్ సింగ్ తన శాఖను మార్చకపోతే మంత్రి పదవికి కూడా రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతోంది.బీజేపీ సీనియర్ నేత బి.శ్రీరాములు, ఎంబీసీ నాగరాజు కూడా తమకు కేటాయించిన శాఖలపై అసంతృప్తితో ఉన్నారు.

ఇంధన శాఖ పై ఆనంద్ సింగ్ ఆశలు పెట్టుకోగా పర్యాటక శాఖ ఇచ్చారు. హోం మంత్రి పదవిని ఆశించిన నాగరాజుకు పరిపాలన శాఖ ఇచ్చారు. ప్రజా పనుల శాఖ కేటాయిస్తారని భావించిన శ్రీరాములుకు రవాణా శాఖ ఇవ్వడంతో ఆయన కూడా అలిగారు. వీరితో పాటు పలువురు మంత్రులు కూడా తమకు కేటాయించిన శాఖల పట్ల అసంతృప్తిగా ఉన్నారు. దీంతో అసంతృప్తులను బుజ్జగించడానికి కొత్త ముఖ్యమంత్రికి తలప్రాణం తోకకు వస్తోంది.ప్రస్తుతం కర్ణాటకలో బీజేపీ అధిష్టానం ఒకటి తలిస్తే.. మరొకటి జరుగుతోంది. ఈ అసమ్మతి ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలలో తెలియక బీజేపీ అధిష్టానం పెద్దలు తలలు పట్టుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -