Wednesday, May 8, 2024
- Advertisement -

ఆప‌రేష‌న్ గ‌రుడ దెబ్బ‌.. బీజేపీకే త‌గిలింది

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆప‌రేష‌న్ గ‌రుడ అమ‌లు చేయాల‌ని భార‌తీయ జ‌న‌తా పార్టీ ప‌క్కాగా వ్యూహం ర‌చించిందంటూ ఆధారాల‌తో స‌హా సినీన‌టుడు శివాజీ కొంత‌కాలం కింద‌ట బ‌య‌ట‌పెట్టారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌స్తుతం ఉన్న రాజ‌కీయ పార్టీల‌ను అడ్ర‌స్ లేకుండా చేసి.. రాష్ట్రంలో బీజేపీ పాగా వేసేందుకు ఈ స్కెచ్ వేసింద‌ని శివాజీ.. ఓ గంట వీడియోలో మొత్తం వివ‌రించారు. తాను గ‌తంలో బీజేపీలో ఉన్న‌ప్పుడు ఢిల్లీలో ఉన్న ప‌రిచ‌యాల ద్వారా త‌న‌కు ఈ విష‌యం తెలిసిందంటూ ఆయ‌న వెళ్ల‌డించారు. శివాజీ చెప్పిన ఆప‌రేష‌న్ గ‌రుడ‌లో ఉన్న విష‌యాలు వాస్త‌వంగా కూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో క‌నిపించాయి. ఈ స్కెచ్ అమ‌లు కోసం బీజేపీ భారీగా ధ‌న‌, అధికార ప‌వ‌ర్‌ను ఉప‌యోగించ‌బోతోంద‌నే విష‌యం సైతం బ‌య‌ట‌కొచ్చింది. అయితే.. అనుకోని రీతిలో గ‌రుడ బ‌ట్ట‌బ‌య‌ల‌వ్వ‌డంతో.. బీజేపీ వెన‌క్కు త‌గ్గిపోయింది. కానీ.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కేంద్రంగానే ఈ కుట్రకు ప్ర‌ణాళిక రూపొందిచడంతో ఆయ‌న చాలా సీరియ‌స్‌గా తీసుకున్నారు. రాష్ట్రంలో ఆప‌రేష‌న్ గ‌రుడు అమ‌లు చేసేంత ధైర్యం బీజేపీకి లేక‌పోగా.. చంద్ర‌బాబునాయుడి నుంచి ఎదురుదాడి ఎక్కువైంది. తాను, త‌న కుమారుడు లోకేష్ కేంద్రంగా బీజేపీ చేసిన కుట్ర‌ల‌ను చంద్ర‌బాబు అంత తేలిక‌గా తీసుకోలేదు. అందుకే.. ఎన్నిక‌ల‌కు స‌మీపిస్తున్న త‌రుణంలో ఇన్నాళ్లూ కొంత సంయమ‌నంతో విమ‌ర్శ‌లు చేస్తూ వ‌చ్చిన బాబు.. ఇప్పుడు మోడీని ల‌క్ష్యంగా చేసుకునే దాడి చేస్తున్నారు. తాజాగా పెట్రోల్ ధ‌ర‌ల‌ను పెంచుకుంటూ వెళ్తుండ‌డంపై చంద్ర‌బాబు మోడీ స‌ర్కారుపై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. దేశంలోనే మోడీని నేరుగా ఈ స్థాయిలో విమ‌ర్శించే నాయ‌కుడు చంద్ర‌బాబు త‌ప్ప మ‌రొక‌రు లేరు.

ఆప‌రేష‌న్ గ‌రుడ‌లో కీల‌క పావుగా జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉండ‌బోతున్నార‌నే విష‌యం శివాజీ ప‌రోక్షంగా బ‌య‌ట‌పెట్టారు. ఓ సినీ నాయ‌కుడు పెట్టిన కొత్త‌పార్టీ అంటూ చెప్ప‌క‌నే అస‌లు విష‌యం చెప్పాడు. ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా బీజేపీకి పూర్తిగా దూర‌మైపోయాడు. ఇప్ప‌టికే రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీతో ప‌వ‌న్ జ‌ట్టుక‌ట్టాడంటూ.. అవ‌కాశం దొరికిన ప్ర‌తిసారీ తెలుగుదేశం పార్టీ విమ‌ర్శ‌లు గుప్పించింది. దీంతో ప‌వన్ సైతం డిఫెన్స్‌లో ప‌డి.. బీజేపీతో తెగ‌తెంపులు చేసుకున్న‌ట్టే క‌నిపిస్తోంది. క‌ష్ట‌ప‌డి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను దువ్వి.. బీజేపీకి ద‌గ్గ‌ర చేసిన రెండు రాష్ట్రాల ఉమ్మ‌డి పెద్దాయ‌న సైతం ఇప్పుడు నివేదిక‌లిచ్చుకోవ‌డం త‌ప్ప మ‌రే రాయ‌భారం చేయ‌లేని ప‌రిస్థితి. మొన్నామ‌ధ్య ఈ పెద్దాయ‌న ఆంధ్ర‌కు వ‌చ్చిన‌ప్పుడు గంట‌సేపు హోటల్ గ‌దిలో స‌మావేశ‌మైన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కాస్త ఘాటుగానే చెప్పాల్సింది చెప్పిన‌ట్టు స‌మాచారం. ఇంక అప్ప‌టినుంచి ఆయ‌న కూడా సైలెంట‌యి పోయారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను నిధులిచ్చి ఆదుకోక‌పోగా, గ‌రుడ పేరుతో మ‌రో స్కెచ్ వేయ‌డం బీజేపీ ప‌రిస్థితిని పూర్తిగా దిగ‌జార్చేసింది. ఇప్పుడు ఆ పార్టీతో క‌నీసం జ‌ట్టుక‌ట్టే సాహ‌సం కూడా ఏ పార్టీ చేయ‌లేని ప‌రిస్థితి ఉంది. పైగా ఈ ప్ర‌భావం దేశ‌స్థాయిలో ఉండేలా చంద్ర‌బాబు మ‌రోసారి చ‌క్రం తిప్పుతున్నారు. వాజ్‌పేయి ప్ర‌ధానిగా ఉన్న స‌మ‌యంలో మోడీపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో చంద్ర‌బాబు వ్య‌తిరేకించారు. ఆ విష‌యం ఇప్పుడు ప్ర‌ధానిగా అయ్యాక‌.. ద‌శాబ్దంన్న‌ర త‌ర్వాత క‌క్ష సాధించాల‌నే ధోర‌నిలో మ‌రోసారి కెలుక్కుని మ‌రీ మోడీ.. ఇప్పుడు భంగ‌ప‌డ్డారు. అదికూడా చంద్ర‌బాబు లాంటి రాజ‌కీయ చాణుక్యుడితో పెట్టుకునేట‌ప్పుడు ఒక‌టికి వంద‌సార్లు ఆలోచించాల్సి ఉంటుంది. ఇప్పుడు.. మ‌ళ్లీ చంద్ర‌బాబు అప్ప‌టికంటే మ‌రింత ఘాటుగా మోడీపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాడు. వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ఎన్‌డీఏ కూట‌మి ప‌రిస్థితి ఎలా ఉంటుందో తెలియ‌దు. చంద్ర‌బాబు లాంటి మిత్రులంతా బీజేపీకి దూర‌మ‌య్యారు. చంద్ర‌బాబు ఇప్పుడు కేవలం విమ‌ర్శ‌తోనే స‌రిపెడుతున్నారు. అదే మోడీకి త‌న అవ‌స‌రం వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత వ‌స్తే మాత్రం.. చంద్ర‌బాబు చుక్క‌లు చూపించ‌డం ఖాయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -