Sunday, April 28, 2024
- Advertisement -

విశాఖ జనసేనలో చీలిక

- Advertisement -

విశాఖ దక్షిణ నియోజవర్గంలో జనసేన పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. పార్టీ నేత, జీవీఎంసీ 39వ వార్డు కార్పొరేటర్‌ సాధిక్‌, బీజేపీటీడీపీజనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్‌ మధ్య బుధవారం విభేదాలు బయటపడ్డాయి. తనను ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన నాయకత్వం ప్రకటించిందంటూ వంశీకృష్ణ తన ప్రచారాన్ని ముమ్మురం చేసుకుంటున్నారు. దక్షిణంలో పార్టీ కార్యాలయం కూడా తెరిచారు. అయితే వంశీకృష్ణ అభ్యర్థిత్వం పూర్తిస్థాయిలో ఖరారు కాలేదని, తనకే ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తారని, స్థానికులకే జనసేన దక్షిణం టిక్కెట్‌ ఇవ్వాలంటూ కార్పొరేటర్‌ సాధిక్‌ చెబుతూ వస్తున్నారు. రెండ్రోజుల క్రితం మీడియా సమావేశం కూడా నిర్వహించి సాధిక్‌ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం జ్ఞానాపురంలోని సాధిక్‌ వర్గం, వంశీకృష్ణ వర్గం వాదోపవాదాలు చేసుకున్నాయి. కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి ఒకర్నొకరు దూషించుకున్నారు. కొందరు చేయి చేసుకున్నారు.

కార్పొరేటర్‌ సాధిక్‌ వర్గీయులు, వంశీకృష్ణ వర్గీయులు, జనసేన నేత శివప్రసాద్‌ మధ్య వాగిద్వాదంతో ప్రారంభమై తోపులాట వరకు చేరింది. విశాఖ దక్షిణ నియోజకవర్గం సీటును జనసేన పార్టీ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించ లేదని సాధిక్‌ వర్గీయులు ఆరోపించారు. ఈ సీటును సాధిక్‌కే కేటాయించాలంటూ కొన్ని రోజులుగా ఆయన వర్గీయులు నిరసన కొనసాగించారు. పార్టీ నిర్ణయాన్ని గౌరవించి, పార్టీ అధిష్టానంతో మాట్లాడాలని, రోడ్లమీద ఆందోళన చేయడం సరైంది కాదంటూ సాధిక్‌ వర్గంతో వంశీ వర్గీయులు కూడా వాగ్వాదాదనికి దిగారు.

దక్షిణ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా వంశీకృష్ణ తిరగుతుండడాన్ని సాధిక్‌ వర్గం తొలి నుంచీ ఆక్షేపిస్తోంది. లక్ష్మీటాకీస్‌ వద్ద ఇటీవల జనసేన నేత నాగేంద్రబాబు ప్రారంభించిన పార్టీ కార్యాలయంలో సాధిక్‌ వర్గీయులు నిరసన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే దక్షిణ నియోజకవర్గ పరిధిలో రెండ్రోజుల క్రితం వంశీకృష్ణ కూడా తన కార్యాలయాన్ని ప్రారంభించారు. స్థానికులకే పార్టీ టిక్కెట్‌ ఇవ్వాలంటూ వాగ్వాదానికి దిగిన కొందరిపై వంశీకృష్ణ ఒత్తిడితో ఆయన మనుషులు బెదిరింపులు, కొట్లాటకు దిగారంటూ పోలీసులకు సమాచారం కూడా అందింది. ఈ క్రమంలో దుర్గాలమ్మ గుడి సమీపంలో కొంతమంది వంశీకృష్ణ ఫొటోల్ని దగ్ధం చేశారని కూడా తేలింది. జ్ఞానాపురంలో మరోచోట గొర్రెకు వంశీ ఫొటో వేలాడి దీసి ఊరేగించారని, వంశీని టీడీపీ, జనసేన బలిపశువును చేశాయంటూ నినాదాలు మిన్నంటాయి. దీంతో బుధవారం మళ్లీ సాధిక్‌, వంశీ వర్గాల మధ్య వాదులాట ప్రారంభం కావడం చర్చనీయాంశమైంది. కొంతమంది ముస్లింలు సాధిక్‌కు అండగా నిలబడి వంశీ వర్గీయుల్ని నిలదీశారు. అదే సమయంలో తన పార్టీ కార్యాలయం వద్ద అనుయాయులతో నిరసనకు దిగేందుకు సాధిక్‌ సిద్ధమయ్యారని తెలుసుకున్న వంశీకృష్ణ కూడా తన మనుషుల్ని పంపించి హడావుడి చేశారంటూ ఇరు వర్గాలూ వాగ్వాదానికి దిగాయి. ఇదంతా పార్టీ అధిష్టానానికి తెలియజేస్తామని ఇరు వర్గాలూ చెబుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -