Monday, May 6, 2024
- Advertisement -

బుగ్గన ప్రైవసీ పై ఎల్లో మీడియా పైరసీ..

- Advertisement -

నాలుగేళ్ల పాటు బీజేపీతో టీడీపీ కలిసి కాపురం చేసినన్ని రోజులు ”కాపురమంటే ఇలా ఉండాలి.. మోడీ- చంద్రబాబును చూస్తుంటే చిలుక గోరింకల్లా లేరూ” అన్నంతగా తన్మయత్వం పొందుతూ కథనాలు రాసింది టీడీపీ అనుకూల మీడియా. ఎన్నికలు సమీపిస్తుండడంతో నాలుగేళ్ల కాపురానికి చంద్రబాబు విడాకులు ఇవ్వగానే ఆ వర్గం మీడియా గొంతును బహిరంగంగానే సవరించింది. పాతపార్టనర్‌తో ఇతర పార్టీలకు అక్రమసంబంధాలను అంటగట్టేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది.

టీడీపీ కంటే దూకుడుగా ఆయన మీడియా రంకెలేస్తోంది. ఏ చిన్న అవకాశం దొరికినా వైసీపీ, బీజేపీ మధ్య బంధం ఉందంటూ ప్రచారం చేస్తోంది. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డికి టీడీపీ మీడియా నుంచి కొత్త అనుభవం ఎదురైంది. ఏ పార్టీ నేతలైనా ఎదురుపడితే పలకరించుకోవడం సహజం. అందులోనూ ఇతర ప్రాంతాల్లో తెలుగువారు కనిపిస్తే పలకరించుకోవడం మరింత సహజం. ఇదే తరహాలో ఇటీవల ఢిల్లీ వెళ్లిన బుగ్గన.. ఏపీ భవన్‌లో పలువురు నేతలను పలకరించారు.

ఏపీ భవన్‌కు వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణను పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. టీడీపీ విప్‌ కూన రవికుమార్‌తోనూ బుగ్గన ముచ్చటించారు. బుగ్గనను చూడగానే కూన రవికుమార్‌ ఆలింగనం కూడా చేసుకున్నారు. ఈ దృశ్యాలన్నింటిని మీడియా కెమెరాలు రికార్డు చేశాయి. మర్యాదపూర్వకంగా పలకరించుకున్నారని కొన్ని టీవీ చానళ్లు లైట్ తీసుకోగా.. టీడీపీ అనుకూల చానళ్లు మాత్రం రెచ్చిపోయాయి.

ఆకుల సత్యనారాయణతో బుగ్గన మాట్లాడుతున్న దృశ్యాలను ప్రసారం చేసి.. ఇదిగో బీజేపీ-వైసీపీ మధ్య సంబంధం అంటూ కూతపెట్టాయి. టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఇదే బుగ్గనను ఆలింగనం చేసుకున్న దృశ్యాలను మాత్రం ప్రసారం చేయకుండా దాచిపెట్టాయి. తనను ఇలా మీడియా టార్గెట్‌ చేయడంపై బుగ్గన ఫైర్ అయ్యారు. ఎల్లో టీవీల జర్నలిజం కారణంగా తెలుగుజాతి పరువు కూడా పోతోందని మండిపడ్డారు. తాను ఏపీ భవన్‌లో అన్ని పార్టీల నేతలతోనూ మాట్లాడానని.. కానీ ఒక్క బీజేపీ ఎమ్మెల్యేలతో ఉన్న దృశ్యాలను ప్రసారం చేయడం ఏమిటనిప్రశ్నించారు.

కూన రవికుమార్ ఆలింగనం చేసుకున్న దృశ్యాలను ఎందుకు ప్రసారం చేయలేదని ప్రశ్నించారు. ఏపీ భవన్‌లో ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో మర్యాదపూర్వకంగా మాట్లాడినందుకే ఇంత రచ్చ చేస్తున్నారంటే టీడీపీ ఎంత అభద్రతాభావంతో బతుకుతోందో అర్థం చేసుకోవచ్చని బుగ్గన వ్యాఖ్యానించారు. సో.. టీడీపీ అనుకూల మీడియా తీరు చూస్తుంటే బీజేపీతో ప్రత్యర్థులకు సంబంధాలు అట్టగట్టేందుకు.. ప్రైవసీని దెబ్బతీసి పైరసీ సృష్టించేందుకు సిద్ధంగానే ఉన్నట్టుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -