Monday, April 29, 2024
- Advertisement -

రాజుగారి కోటలో జగన్ కు బ్రహ్మరథం

- Advertisement -

విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రపై మొన్నటి వరకూ కాస్తాకూస్తో అనుమానాలు ఉండేవి. ఎందుకంటే జగన్ వస్తున్నాడని తెలియగానే టీడీపీ నేతలు వినూత్న ప్రచారానికి తెర లేపారు. గతంలో ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ జగన్ మీద చేసిన ఆరోపణలు, పత్రికల్లో వచ్చిన కథనాలను ప్రముఖంగా ఫ్లెక్సీలు, కటౌట్లు, బ్యానర్లుగా ఏర్పాటు చేశారు. దారి పొడవునా వాటిని విజయనగరం జిల్లాలోని ఎల్ కోట, ఎస్ కోట నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయడంతో జనం వాటిని ఆసక్తిగా గమనించారు. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో విజయనగరంలో బీభత్సమైన వ్యతిరేకత బొత్స మీద వెళ్లువెత్తింది. కాంగ్రెస్ మంత్రిగా నాడు విభజనను అడ్డుకోవడంలో బొత్స విఫలమయ్యాడని జనం నిప్పులు చెరిగారు. ఆయన కాలేజ్ లు, ఇతర వ్యాపార సంస్థలపై దాడి చేశారు. ఆస్తులు దగ్ధం చేసి తీవ్ర హెచ్చరికలు చేశారు. దీంతో బొత్స దంపతులు అజ్ఞాతంలోకి వెళ్లిపోవాల్సిన పరిస్థితి కొన్నాళ్లు తలెత్తింది. తర్వాత కొన్నాళ్లకు ఆయన వైఎస్ఆర్ సీపీ తీర్ధం పుచ్చుకున్నారు. కానీ పాత ఘటనలపై పత్రికల్లో వచ్చిన కథనాలతో ఫ్లెక్సీలు, కటౌట్లు, బ్యానర్లు పెట్టడంతో బొత్స భయపడ్డారు. జగన్ వస్తున్నవేళ సొంత జిల్లాలో తనపై వ్యతిరేకత వస్తే తనకు పార్టీలో మనుగడ కష్టమేనని ఆందోళన చెందారు. విజయనగరం జిల్లాలో జగన్ పర్యటనను చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ప్రజల్లో తన పట్ల వ్యతిరేకత లేదని నిరూపించుకునేందుకు, జన సమీకరణ కోసం పెద్ద కసరత్తే చేశారు. దీంతో విజయనగరంలో పాదయాత్రకు జనం భారీగా తరలివచ్చారు. నగరం నడిబొడ్డున పెట్టిన బహిరంగ సభ సక్సెస్ కావడంతో బొత్స ఊపిరి పీల్చుకున్నారు.

అదే సమయంలో విజయనగరం జిల్లా టీడీపీ నేతల్లో కలవరం మొదలైంది. టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ఇలాకాలో మొదట్నించీ తమ పార్టీకి కంచుకోట అయిన జిల్లాలో జగన్ కు ఘనస్వాగతం లభించడంతో వారిలో టెన్షన్ పెరిగిపోయింది. సమైక్యాంధ్ర సమయంలో బొత్స మీద కనీవినీ విరిగిన వ్యతిరేకత ప్రజల్లో నుంచి వచ్చింది. అతడి ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు ప్రజలు పెద్దఎత్తున రోడ్లు మీదకు రావడంతో టీడీపీ నేతలు ఇక జిల్లాలో బొత్స రాజకీయ జీవితం ముగిసినట్టేనని హ్యాపీగా ఫీలయ్యారు. కానీ తర్వాత పరిణామాలతో బొత్స వైఎస్ఆర్ సీపీలో చేరిపోవడం, ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ఆయన జనసమీకరణలో సక్సెస్ కావడం, జగన్ పాదయాత్రకు జనం పోటెత్తడంతో టీడీపీ నేతలు టెన్షన్ పడుతున్నారు. మళ్లీ బొత్స వర్గం పుంజుకుంటే తమకు గట్టి పోటీ ఇస్తారని మదన పడుతున్నారు. జనం జగన్ కోసం వచ్చినా, స్థానిక నేత బొత్స ప్రభావం దానిపై పడుతోందని, ఫలితంగా వచ్చే ఎన్నికల్లో గట్టి ప్రభావమే చూపుతారని అంచనా వేస్తున్నారు. బొత్స బలపడకుండా మళ్లీ ఎలాగైనా వ్యూహరచన చేయాలని తలలు పట్టుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -