Friday, March 29, 2024
- Advertisement -

లక్ష్మీనారాయణ ఇప్పటికీ టీడీపీ నేస్తమే?

- Advertisement -

మహారాష్ట్రలో సీబీఐ అధికార పదవినుంచి స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఆసంస్థ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి. లక్ష్మీ నారాయణ జనసేన పార్టీలో చేరారు. మార్పు కోసమే తాను పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనలో చేరానని లక్ష్మీనారాయణ చెప్పారు. తాను టీడీపీలోకి వెళ్తున్నట్లు వచ్చిన వార్తలు మీడియా సృష్టేనని, వామపక్షాలు, బీఎస్పీతో పొత్తుల కారణంగా జనసేన మరింతగా పటిష్టపడుతుందని చెప్పారు. కాగా, లక్ష్మీనారాయణ జనసేన పార్టీలో చేరినా, పరోక్షంగా ఆయన్ను టీడీపీ మిత్రుడిగానే పరిగణించాల్సి వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. గత కొన్ని నెలలుగా అధికార పక్షాన్ని వదిలేసి, ప్రతిపక్షాన్ని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మాత్రమే అదేపనిగా విమర్శిస్తూ, టీడీపీని ఒక మాట కూడా అనని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను అధికార తెలుగుదేశం పార్టీకి పరోక్ష మద్దతు దారుగానే కొనసాగుతున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో జనసేన పార్టీకి టీడీపీతో లోపాయికారీ అవగాహన ఉందని చెబుతున్నారు. అంటే ఈ లెక్క ప్రకారం లక్ష్మీ నారాయణ కూడా అధికార టీడీపీకి మద్దతు ఇస్తున్నట్టుగా పరిగణించాల్సి ఉంటుంది. తాను ఈ ఎన్నికల్లో దిగబోనని చెప్పిన లక్ష్మీ నారాయణ ఇపుడు జనసేన తరఫున పోటీకి కూడా సిద్ధపడ్డారు.

నిజానికి పదవీ విరమణ తర్వాత ఆయన అధికార తలుగుదేశం పార్టీలోనే చేరతారంటూ మొదట్లో వార్తలు వెల్లువెత్తాయి. మరోవైపు ఆయన కొత్త పార్టీ పెడతారన్న వార్తలు కూడా హల్ చల్ చేశాయి. టీడీపీలో చేరే విషయమై ఒక దశలో మంత్రి గంటా శ్రీనివాస రావు కూడా లక్ష్మీ నారాయణతో చర్చలు జరిపారు. తన చర్చల విషయం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు గంటా వివరించారని, విశాఖపట్నం జిల్లా, బీమిలినుంచి అసెంబ్లీకి పోటీ కూడా చేస్తారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. గతంలో సీబీఐ జాయింట్ డైరెక్టర్ హోదాలో ఉండగా, జగన్ పై ఆస్తుల కేసుకు సీబీఐ తరఫు విచారణాధికారిగా ఆయన నిష్పాక్షికంగా వ్యవహరించలేదని, తెలుగుదేశం పార్టీ మద్దతుదారుగా వ్యవహరించారని, టీడీపీ డైరెక్షన్ లోనే ఆయన పనిచేశారని ఆయనపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. జగన్ ఆస్తుల కేసుపై లక్ష్మీ నారాయణ గతంలో అత్యుత్సాహం ప్రదర్శించిన సందర్భాలు ఉన్నాయి. గోప్యంగా ఉంచాల్సిన సీబీఐ విచారణ అంశాలను తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికలకు లీకులిచ్చారన్న విమర్శలను కూడా ఆయన ఎదుర్కొన్నారు. కేసు విచారణాంశాలను అసాధారణ రీతిలో విడగొడ్డి మితిమీరిన సంఖ్యలో చార్జిషీట్లు తయారు చేసి, రిమాండ్ ఖైదీగానే జగన్ 16నెలలుపైగా జైలులో గడపడానికి ఆయన కారణమయ్యారు. ఆయన ఎంతో నిజాయతీతో కూడిన నిఖార్సయిన అధికారిగా టీడీపీ అనుకూల పత్రికలు అప్పట్లో ఇబ్బడి ముబ్బడిగా వ్యాసాలను వండి వార్చాయి. ఆయనతో వ్యక్తిత్వ వికాస తరగతలను ఏర్పాటు చేసి వాటిని విశేష ప్రాధాన్యతతో ప్రచురించాయి. ఆతర్వాత జరిగిన పరిణామాల్లో జగన్ ఆస్తుల వ్యవహారంలో తగిన సాక్ష్యాధారాలు లేవంటూ వివిధ ప్రభుత్వాధికారులపై దాఖలైన 11 కేసుల్లో 9 కేసులను ప్రత్యేక కోర్టు ఇప్పటికే కొట్టివేసింది. చాలావవరకు అధికారులకు కేసులనుంచి విముక్తి లభించింది. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో లక్ష్మి నారాయణ ప్లేటు మార్చారు. తన పదవికి స్వచ్ఛందంగా పదవీ విమరణ చేసి రాజకీయాల్లో చేరేందుకు ఆసక్తి చూపారు.

కేసుల విచారణలో తనశైలిపై వైఎస్సార్సీపీ నేతలు ఆరోపణలు రెండు వందల శాతం అబద్ధమని, వృత్తి పరంగా తాను ఎంత నిజాయితీగా వ్యవహరించానో తన అంతరాత్మకే తెలుసని మాజీ ఐపీఎస్ లక్ష్మీనారాయణ తాజాగా వ్యాఖ్యానించినప్పటికీ, ఆయన వ్యవహారశైలిలో నిజాయితీ పాళ్లెంత? అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. తన నిజాయతీతో వృత్తిపరంగా మరింత మంచిపేరు తెచ్చుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నా, ఆయన ఎందుకు ఏడేళ్ల విలువైన సర్వీసును వదులుకొని స్వచ్ఛంద పదవీ విరమణ చేయాల్సి వచ్చింది? అది కూడా కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వంతో టీడీపీ చంద్రబాబు నాయుడుకు పొసగని పరిస్థితుల్లోనే ఇలా ఎందుకు చేయవలసి వచ్చింది? అన్న ప్రశ్నలకు లక్ష్మీ నారాయణ జవాబు చెప్పాల్సి ఉంది. .

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -