Tuesday, May 7, 2024
- Advertisement -

ఇప్పటికైనా జనసేనాని మారతాడా?

- Advertisement -

ఏడాదిన్నర క్రితం టాలీవుడ్ స్టార్.. పవన్ కల్యాణ్ పెట్టిన జనసేన పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు దక్కింది. అధికారం కోసం కాదు.. పాలకులను ప్రశ్నించేందుకే రాజకీయాల్లోకి వస్తున్నా అంటూ.. గత ఏడాది (2014) మార్చి 14న పాలిటిక్స్ లో పవన్ కల్యాణ్ ప్రవేశించారు. కాంగ్రెస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న అన్నయ్య చిరంజీవిని కాదనుకుని మరీ.. కాంగ్రెస్ రాజకీయాలకు స్పష్టమైన వ్యతిరేకిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు.

హైదరాబాద్ మాదాపూర్ లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో మొదటి సభతో.. అందరినీ పవన్ బాగానే ఆకట్టుకున్నారు. తెలుగు ప్రజల సమస్యలే ముఖ్యమని ప్రిపేర్డ్ స్పీచ్ కూడా బాగానే ఇచ్చారు. కానీ.. పక్కా పొలిటికల్ పార్టీగా జనసేనను మలచడంపై దృష్టి పెట్టలేకపోయారు.

జనసేన నాయకుడిగా పవన్ తీరుపై రాజకీయంగా విమర్శలు రావడంతో… మధ్యమధ్యలో ట్విటర్ వేదికగా కామెంట్లతో తాను పొలిటికల్ లైన్ లో ఉన్నానని పవన్ గుర్తు చేస్తూనే ఉన్నాడు. మధ్యలో ఏపీ కొత్త రాజధాని అమరావతికి భూముల సేకరణ విషయంలో.. ఏపీ మంత్రులతో మాటల యుద్ధానికి దిగారు. ఓ దశలో.. రాజధానికి భూములు ఇచ్చిన రైతులతో ప్రత్యేకంగా సమావేశం కూడా అయ్యారు. అదే టైమ్ లో.. బాబు ప్రభుత్వం.. పవన్ డిమాండ్ కు తలొగ్గినట్టు వ్యవహరించడంతో.. మళ్లీ సైలెంటైపోయారు. మధ్యమధ్యలో ఏపీకి ప్రత్యేక హోదాపై కూడా ట్వీట్లతో వార్తల్లో నిలిచిన పవన్.. చివరికి కొన్నాళ్లు వేచి చూద్దామంటూ మరో ట్వీట్ తో ఆగిపోయారు. ఈ యాక్టివిటీస్ తప్ప.. రాజకీయాల్లో పెద్దగా జనసేన తరఫున పవన్ కల్యాణ్ పోరాడింది లేదని పొలిటికల్ నిపుణులు కామెంట్ చేస్తున్నారు.

ఇలాంటి టైమ్ లో.. జనసేనను రాజకీయ పార్టీగా రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తించడంతో.. పవన్ ఇప్పటికైనా పూర్తి స్థాయిలో రాజకీయలకు టైమ్ కేటాయిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న పవన్… అమరావతి శంకుస్థాపనకు కూడా హాజరు కాలేదు. స్వయంగా ఏపీ మంత్రులు వెళ్లి ఆహ్వాన పత్రిక అందించినా.. రాలేనని ఇన్ డైరెక్ట్ గా పవన్ చెప్పడం అందరికీ తెలిసిందే. ఇలాంటి కన్ ఫ్యూజన్ రాజకీయాలతో.. ఇప్పటివరకు సాధించింది ఏంటో ఎవరికీ అంతుబట్టడం లేదు. కనీసం.. పార్టీగా గుర్తింపు వచ్చిన ఇప్పుడైనా… పవన్ జనసేనానిగా మారతాడో లేదో.. వేచి చూడాల్సిందే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -