Tuesday, May 7, 2024
- Advertisement -

సీమ ప్రజల ఆశాకిరణం రాయలసీమ ఎత్తి పోతల పథకం…

- Advertisement -

రాయలసీమ ప్రజలందరికీ తాగునీరు, సాగునీరు అందించే నిమిత్తం వైఎస్ జగన్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందడుగు వేస్తోంది.. అందులో భాగంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు వేగవంతంగా చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కరువుకు మారుపేరుగా వున్న రాయలసీమలోని నాలుగు జిల్లాలకు సంజీవనిలా ఈ ఎత్తిపోతల పథకం పనిచేసే అవకాశం ఉంది. సీమ నుంచి ఎందరు ముఖ్యమంత్రులుగా పనిచేసినప్పటికీ సీమ మాత్రం వెనుకబడిన ప్రాంతంగానే నిలిచిపోతోంది. అయితే వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక పోతరెడ్డిపాడు, హంద్రీనీవా, గాలేరు నగరి లాంటి పథకాలను చేపట్టి వెనుకబడిన రాయలసీమ అభివృద్ధికి కృషి చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెనుకబడిన రాయలసీమ అభివృద్ధి కోసం వరదనీటిని ఒడిసి పట్టి సీమనుంచి శాశ్వతంగా కరువు నుంచి పారదోలేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకం అనే బృహత్తర కర్తవ్యాన్ని చేపట్టేందుకు అన్ని సమస్యలను అధికమించి పనులు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

కాళేశ్వరం తరహాలో….
ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా గిన్నిస్ రికార్డులకెక్కిన కాళేశ్వరం ప్రాజెక్టు తరహాలో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కూడా అదే స్థాయిలో నిర్మించేందుకు వైఎస్ జగన్ కంకణం కట్టుకున్నారు. రాష్ట్రంలో ఇంతవరకు ఇంతపెద్ద ఎత్తున ప్రాజెక్టులు నిర్మించిన చరిత్ర లేదు. హంద్రీనీవా లాంటి ఎత్తిపోతల పథకం నిర్మించినా కూడా సంవత్సరం అంతా 40 టీఎంసీలు మాత్రమే పంపింగ్ చేస్తుంది. కానీ రాయలసీమ ఎత్తిపోతల పథకం రోజుకు 3 టీఎంసీలు ఎత్తివేసే విధంగా రూపుదిద్దుకొంటోంది. ఇది పూర్తయితే రాయలసీమ రూపురేఖలు మారిపోనున్నాయి. దశాబ్దాలుగా రాయలసీమ అవసరాలకు కృష్ణా నది నీటిని మల్లించాలని డిమాండ్ వున్నప్పటికీ ఆచరణలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా వుండిపోయింది.

కృష్ణలో నీళ్ళు- రాయలసీమలో కన్నీళ్లు…
ఎన్నో దశాబ్దాలుగా సీమ తాగు, సాగు నీటి అవసరాల కోసం కృష్ణా జలాలను రాయలసీమకు మళ్లించాలని డిమాండ్ ఉన్నప్పటికీ ఈ విధమైన స్పష్టతతో కూడిన కార్యాచరణను ఎవరు ప్రతిపాదించలేకపోయారు. ఏ ప్రభుత్వం కూడా ఆవైపుగా ఆలోచించలేకపోయింది. సువిశాలమైన రాయలసీమలో ఓ వైపున కృష్ణా నది మరోవైపున తుంగభద్రతో పాటు వాటికి ఆనుకొని వున్న కర్నాటక నుంచి నెల్లూరు వరకు సీమ మీదుగా పెన్నా నది ప్రవహిస్తున్నప్పటికీ ఈ ప్రాంతంలో ఎప్పుడూ తాగు, సాగు నీటికి కటకటలాడాల్సిందే. తుంగభద్ర ఎగువ, దిగువ కాలువల ద్వారా కేటాయించిన నీటిలో సగం వాటా కూడా అందని పరిస్థితుల్లో తుంగభద్ర పొంగి ప్రవహించినప్పటికీ ఆయకట్టుకు సరిగ్గా నీరు అందదు. శ్రీశైలం నుంచి 1990 దశకంలో ఎస్.ఆర్.బి.సి, తెలుగు గంగ లాంటి ప్రాజెక్ట్లు చేపట్టారు. ఆ తర్వాత హంద్రీ-నీవా, ముచ్చుమర్రి లతో పాటు శ్రీశైలం నీరు కెసి కాలువకు అందించడం లాంటి పథకాలు పూర్తయ్యాయి. తుంగభద్ర ఎగువ కాలువ కింద పిఎబిఆర్ తో పాటు చిత్రావతి లాంటి జలాశయాలు పూర్తయినప్పటికీ రాయలసీమ దశ-దిశలో ఏమాత్రం మార్పు రాలేదు. కరువు తాండవిస్తూనే ఉంది. శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటి వినియోగం పెంచేందుకు వైయస్ హయాంలో పోతిరెడ్డిపాడు సామర్థ్యం 44 వేల క్యూసెక్కులకు పెంచినప్పటికీ ప్రయోజనం అంతంత మాత్రంగానే ఉంది.

ఎన్ని వరదలు వచ్చినా సీమలో మాత్రం కరువే…
రాష్ట్రంలో ఎన్ని వరదలు వచ్చినా రాయలసీమలో కనీసం తాగునీరు కి కూడా నోచుకోవడం లేదు. గత16 ఏళ్ళ పాటు పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు నీటి వినియోగాన్ని పరిశీలిస్తే గడచిన రెండు సంవత్సరాలు మినహాయిస్తే మిగిలిన కాలమంతా లభించాల్సిన నీటి కన్నా తక్కువ నీరు అందింది. ఆఖరికి క్రిష్ణాకు భారీ వరదలు వచ్చి సముద్రంపాలు అయినప్పటికీ రాయలసీమ వాసులకు మాత్రం ప్రయోజనం లేకుండా పోతోంది. ఇందుకు ప్రధానం కారణం పోతిరెడ్డిపాడు సామర్థ్యం అవసరమైనంత స్థాయిలో లేకపోవడమే.

800 అడుగుల నుంచే ఎందుకు ఎత్తిపోయాలంటే..
శ్రీశైలం నుంచి 7000 క్యూసెక్కుల నీటిని జలాశయంలో నీటి మట్టం 854 అడుగుల దాటిన తరువాత వినియోగించాలి. అదే విధంగా నీటి మట్టం 881 అడుగులు మించిన తరువాత 44 వేల క్యూసెక్కుల ప్రవహాన్ని పోతిరెడ్డిపాడులోకి అనుమతించాలి. దీనివల్ల సరైన నీటిని సకాలంలో వినియోగించుకోవడం సాధ్యం కావడం లేదు. సంవత్సరం మొత్తానికి 15 నుంచి 20 రోజులు మాత్రమే వరద నీటిని వినియోగించుకోవడం వీలవుతోంది. ఫలితంగా వరద నీరు సైతం సీమ జిల్లాలకు అందుబాటులోకి రావడం లేదు. మరోవైపు జలాశయంలో పూడిక పెరిగిపోవడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం కూడా తగ్గిపోయింది. వాస్తవానికి 308 టిఎంసిల జలాలు ప్రాజెక్ట్ నిండినప్పుడు ఉండాలి. కానీ 215 టిఎంసిలు మాత్రమే ఉంటోంది. అంటే దాదాపు 93 టిఎంసిల నీరు నిల్వ లేకుండ నిరుపయోగం అవుతోంది. ఈ పరిస్థితుల్లో తక్కువ సమయంలో ఎక్కువ వరద నీటిని మళ్లించుకోవడమే ఏకైక శరణ్యమని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తలంచారు. దాంతో ఇంజనీరింగ్ నిపుణులు అధ్యయనం చేసి ఆచరణలో సాధ్యమని ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

భారీ ఎత్తిపోతల పథకం…
కేవలం వరదనీరు వృధాగా సముద్రంలో కలవకుండా సీమ దాహార్తిని తీర్చేందుకు ఈ పథకం లక్ష్యం.రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రోజు 3 టిఎంసిల నీటిని వరదల సమయంలో కృష్ణా నది నుంచి రాయలసీమకు మళ్లిస్తారు. ఉపనది తుంగభద్ర వచ్చి క్రిష్ణాలో కలిసే సంగమేశ్వరం ప్రాంతం వద్ద ఈ పథకాన్ని చేపడతారు. ఇక్కడ మూడు టిఎంసీల నీటిని ఎత్తిపోసే విధంగా పంపింగ్ కేంద్రాన్ని నిర్మిస్తారు. జలాశయంలో 800 నుంచి 850 అడుగుల వరకు నీరు ఉన్నప్పుడు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లా అవసరాలకు మళ్లించే విధంగా నీటిని పంప్ చేసి పోతిరెడ్డిపాడు సమీపంలోని 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎస్ఆర్ఎంసీలోకి విడుదల చేస్తారు. కృష్ణా నదికి గరిష్టంగా వరదలు ఉన్నపుడు రోజుకు 8 టిఎంసీల వరకు కూడా పంప్ చేసేందుకు ఉపయోగపడే విధంగా నిర్మించి సీమ అవసరాలు తీర్చాలనేది ప్రభుత్వ ఉద్దేశం.

పంప్ చేసిన నీటిని 125 మీటర్ల పొడవున ఏర్పాటు చేసే పైప్ లైన్ల ద్వారా సరఫరా చేస్తారు. ఆ తరువాత డెలివరీ సిస్ర్టన్ నుంచి నీరు విడుదలై 22 కిలోమీటర్ల మేర ప్రవహించి పోతిరెడ్డిపాడుకు సమీపంలో 4-5 కిలోమీటర్ల మద్య ఎస్ఆర్ఎంసిలో కలుస్తుంది. అక్కడి నుంచి నీరు తెలుగు గంగ, ఎస్.ఆర్.బి.సి, కెసి కాలువలకు సరఫరా అవుతుంది. ఈ ప్రాజెక్ట్ లో పంప్ హౌస్ తో పాటు సంగమేశ్వర నుంచి ముచ్చుమర్రి వరకు 4.5 కిలోమీటర్ల కాలువ శ్రీశైలం వెనుక జలాల భాగంలో తవ్వుతారు. పంప్ హౌస్ లో 12 మిషన్లు ఏర్పాటు అవుతాయి. ఒక్కొక్కటి 81.93 క్యూసెక్కుల సామర్థ్యంతో 39.60 మీటర్ల ఎత్తుకు నీటిని పంప్ చేసే విధంగా 33.04 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంప్ లు, మోటార్లు ఏర్పాటు అవుతాయి. వీటి నిర్వహించేందుకు 397మెగావాట్ల విధ్యుత్ అవసరం వుంటుంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన ఈ బృహత్తర కర్తవ్యం పట్ల రాయలసీమ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -