Monday, April 29, 2024
- Advertisement -

మళ్లీ మళ్లీ జన్మించాలి.. ఆ జన్మల్లో కూడా నవ్వించే వరం కోరుకుంటా: బ్రహ్మానందం

- Advertisement -

2023 నూతన తెలుగు సంవత్సరం ఉగాది (శోభకృత్‌నామ సంవత్సరం)ని పురస్కరించుకుని ఫిలిం నగర్‌లోని ఫిలిం నగర్‌ కల్చరల్‌ క్లబ్‌(FNCC) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణంతో పాటు, పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఎఫ్‌.ఎన్‌.సి.సి స్థాపించి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హాస్యబ్రహ్మ డా. బ్రహ్మానందం గారిని ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ విచ్చేశారు. తొలుత ఎఫ్‌.ఎన్‌.సి.సి ప్రెసిడెంట్ ఘట్టమనేని ఆదిశేషగిరిరావు సెక్రటరీ ముళ్ళపూడి మోహన్ మరియు కమిటీ సభ్యులు జ్యోతి ప్రజ్వలన గావించారు. అనంతరం నటరాజ్‌ మాస్టర్‌ నేతృత్వంలో నిర్వహించిన నృత్యాలు, వివిధ తెలుగు పండుగలను తెలియజేస్తూ చేసిన ప్రత్యేక నృత్యం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. వినోద్‌బాబు ఆధ్వర్యంలో సంగీత విభావరి నిర్వహించారు.

అలాగే బ్రహ్మానందం గారి జీవితానికి సంబంధించి పలు వివరాలతో కూడిన ఏవీని ప్రదర్శించారు. పద్మశ్రీ, గిన్సీస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ గ్రహీత, డాక్టర్‌ బ్రహ్మానందం గారిని శాలువా, గజమాలతో సత్కరించి, ఆయనకు కలియుగదైవం వేంకటేశ్వరుని ప్రతిమ, సన్మానపత్రం అందజేశారు. నటుడు ఉత్తేజ్‌ బ్రహ్మానందం గారి సన్మానం కోసం తాను రాసిన అద్భుతమైన సన్మాన పత్రం చదివి వినిపించారు.

ఈరోజు నాకు జరిగిన సన్మానం చూస్తుంటే ‘‘హృదయం మొత్తం సంతోషంతో నిండిపోతే.. నోరు మూగబోతుంది’’ అనే సామెత గుర్తుకు వస్తోంది. ఒక కళాకారుడు రంగస్థలంపై ఎప్పుడూ అబద్ధాలు చెప్పకూడదు. అంతకు మించిన దుర్మార్గం ఇంకోటి ఉండదు. నాకు జరిగిన ఈ సన్మానం నా జీవితంలో మర్చిపోలేనిది అని ఈ వేదికపై నుంచి మనస్ఫూర్తిగా చెబుతున్నా. ఇంత భారీగా ఈ కార్యక్రమం ఉంటుందని నేను ఊహించలేదు. మన పండగల పూర్వాపరాలు, హిందువుల సంస్కృతుల గొప్పతనాన్ని తెలియజేస్తూ కళారుకారులు చేసిన నృత్యాలు అద్భుతం. ఇన్ని కోట్ల మందిని నవ్వించడం నేను పూర్వజన్మలో చేసుకున్న సుకృతం. అందరూ మోక్షం కోరుకుంటారు. అంటే జన్మరాహిత్యం.. మరో జన్మ ఉండ కూడదు అని. కానీ నేను దేవుణ్ణి మోక్షం వద్దు… మళ్లీ మళ్లీ జన్మించాలని.. ఆ జన్మల్లో నేను ఏ జీవిగా పుట్టినా సరే నా తోటి జీవులను నవ్వించే వరం ప్రసాదించమని కోరుకుంటాను. ఉత్తేజ్‌ రాసిన సన్మానపత్రం చాలా గంభీరంగా ఉంది. నా హృదయాన్ని తాకింది. ఇంతమంది మహామహుల మధ్య గడిపిన ఈ క్షణాలు నాకు ఎప్పటికీ మర్చిపోలేని తీపి గుర్తు. నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని బ్రహ్మానందం అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -