Wednesday, May 8, 2024
- Advertisement -

రాజ్ త‌రుణ్ ‘లవర్’ రివ్యూ

- Advertisement -

‘ఉయ్యాలా జంపాలా’ చిత్రంతో కెరీర్ మొదలుపెట్టిన హీరో రాజ్ తరుణ్ కి వరుసగా విజయాలు దక్కాయి. కానీ గత రెండేళ్లుగా ఆయన ఎలాంటి సినిమా చేస్తున్నా తనకు సక్సెస్ మాత్రం రావడం లేదు. వరుస పరాజయాలతో డీలా పడ్డాడు.  రాజ్ తరుణ్ సినిమాల పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి సన్నగిల్లుతోంది. ఇటువంటి సమయంలో ‘అలా ఎలా’ వంటి హిట్ సినిమాను రూపొందించిన దర్శకుడు అనీష్ కృష్ణతో రాజ్ తరుణ్ ‘లవర్’ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా  శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందొ సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ: రాజ్(రాజ్ తరుణ్) తన స్నేహితులతో కలిసి గ్యారేజీ నడుపుతుంటాడు. ట్రిప్ కోసం బ్యాంకాక్ వెళ్లాలనుకుంటాడు. అదే సమయంలో తను అన్నయ్య(రాజీవ్ కనకాల)గా భావించే వ్యక్తి సమస్యలో ఉన్నాడని అతడికి సహాయంలో చేసే సమయంలో రాజ్ చేతికి బుల్లెట్  తగులుతుంది. దీంతో అతడిని హాస్పిటల్ లో జాయిన్ చేస్తారు. అక్కడ చరిత(రిద్ధి కుమార్) అనే నర్స్ తో ప్రేమలో పడతాడు. మొదట్లో అతడి ప్రేమను కాదన్నా.. మెల్లగా చరిత కూడా రాజ్ ను ప్రేమించడం మొదలుపెడుతుంది. చరిత పని చేసే ప్రభుత్వ ఆసుపత్రిలో ఇల్లీగల్ గా ఏదో  జరుగుతుందని తెలుసుకుంటుంది. అధికారులను అదే విషయంపై ప్రశ్నిస్తే ఆమె మాటలను వారు లెక్క చేయరు. మరోపక్క కోయింబత్తూర్ లో పెద్ద మనిషిగా పేరుగాంచిన వరదరాజులు(సచిన్ ఖేడ్కర్) అనే వ్యక్తికి లివర్ సమస్య వస్తుంది. అతడిది అరుదైన బ్లడ్ గ్రూప్ కావడంతో లివర్ డోనర్ ఎవరూ దొరకరు. చివరకు చరిత పని చేసే హాస్పిటల్ లోనే లక్ష్మి అనే బ్లడ్ గ్రూప్ వరదరాజులు సరిపోతుంది. దీంతో ఆమె బ్రెయిన్ పనిచేయకుండా చేసి ఆమె లివర్ ను వరదరాజులకు పెట్టాలని చూస్తారు. ఈ విషయం తెలుసుకున్న చరిత.. లక్ష్మిని ఎవరికీ తెలియకుండా తన సొంతూరు కేరళలో దాచేస్తుంది. మరి ఈ విషయం వరదరాజులు మనుషులకు తెలిస్తే.. ఎలా రియాక్ట్ అవుతారు..? లక్ష్మి కోసం చరిత ఇబ్బందుల్లో పడిందా..? తన లవర్ ను కాపాడడం కోసం రాజ్ ఎలాంటి సాహసం చేశాడు..? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

విశ్లేషణ: ‘అలా ఎలా’ సినిమా వచ్చి సరిగ్గా నాలుగేళ్లు అయింది. అప్పటినుండి ఈ ‘లవర్’ సినిమా కోసం స్క్రిప్ట్ రాసుకున్నాడు దర్శకుడు అనీష్ కృష్ణ. తీరా సినిమా చూసిన తరువాత నాలుగేళ్ల పాటు రాసిన కథ ఇదేనా అనిపించకమానదు. హీరో, హీరోయిన్ ప్రేమించుకోవడం.. హీరోయిన్ ఓ సమస్యలో ఇరుక్కోవడం.. హీరో ఆ సమస్య నుండి ఆమెను బయటపడేయడం.. చివరికి హ్యాపీ ఎండింగ్. టాలీవుడ్ లో చాలా ఏళ్లుగా ఈ తరహా కథలతో సినిమాలు వస్తూనే ఉన్నాయి. మరి ఇక్కడ డైరెక్టర్ కొత్తగా ఆలోచించి ఏం తీశానని అనుకుంటున్నాడో.. అతడికే తెలియాలి.

ఫస్ట్ హాఫ్ మొత్తం హీరోయిన్ ను పడేయడానికి తన ఫ్రెండ్స్ గ్యాంగ్ తో కలిసి హీరో వేసే స్కెచ్ లు.. అన్ని సినిమాల్లో మాదిరి హీరో చేసిన మంచి పని చూసి హీరోయిన్ ప్రేమలో పడిపోవడం వంటి సన్నివేశాలతో సినిమా నడిచింది. సరైన ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా రాసుకోలేకపోయారు. కథలో సత్తా లేనప్పుడు సన్నివేశాలు మాత్రం బలంగా ఎలా ఉంటాయి. ఇక సెకండ్ హాఫ్ మొదలైన తరువాత స్టోరీ అనంతపురం నుండి కేరళకు షిఫ్ట్ అవుతుంది. హీరోయిన్ ఇంట్లో హీరో చేసే అల్లరి, వారి ప్రేమను ఇంట్లో వాళ్లు  అంగీకరించడం నిశ్చితార్ధం వంటి సన్నివేశాల తరువాత ప్రీక్లైమాక్స్ లో విలన్ హీరోయిన్ ను కిడ్నాప్ చేస్తాడు. విలన్ నుండి హీరోయిన్ ను కాపాడుకోవడం కోసం హీరో వేసే స్కెచ్ లు మాములుగా ఉండవు. తెలుగు వాళ్లకు పరిచయం లేని కార్ హ్యాకింగ్ ను ఈ సినిమా ద్వారా పరిచయం చేశారు. మొత్తానికి హీరో.. విలన్ నుండి హీరోయిన్ ను కాపాడుకుంటాడు. అక్కడితో సినిమా ముగిసిపోతుంది. ఈ మొత్తం ప్రాసెస్ లో ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా ఒక్క సీన్ కూడా లేకపోవడం బాధాకరం.

సాంకేతిక వ‌ర్గం ప‌నితీరు: నిర్మాత దిల్ రాజు ఎనిమిది కోట్లు ఈ సినిమాపై పెట్టామని చెబుతున్నప్పటికీ తెరపై మాత్రం ఆ ఖర్చు కనిపించదు. ఫారెన్ లొకేషన్స్ కూడా లేవు. అనంతపురం, కేరళ ఈ రెండు ప్రాంతాల్లో చిత్రీకరించేశారు. మరి ఏ రకంగా ఎనిమిది కోట్లు ఖర్చయిందని చెబుతున్నాడో ఆయనకే తెలియాలి. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. నేపధ్య సంగీతం మెప్పిస్తుంది. ఒక పాట వినడానికి చాలా బాగుంది. ఎడిటింగ్ వర్క్ పర్వాలేదనిపిస్తుంది. ఈ సినిమా కథ చాలా మంది హీరోలు రిజెక్ట్ చేసిన తరువాత రాజ్ తరుణ్ దగ్గరకి వెళ్లింది. అందరూ ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారని కనీసం ఆలోచించినా.. ఈ ఫ్లాప్ నుండి రాజ్ తరుణ్ తప్పించుకునేవాడు. కానీ ఇప్పుడు వరుస ఫ్లాప్ లతో ఉన్న ఆయన లిస్ట్ లో మరో ఫ్లాప్ వచ్చి చేసింది. ఇకనైనా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలను నమ్ముకుంటే కెరీర్ లో ముందుకువెళ్లొచ్చు. లేదంటే మాత్రం టాలీవుడ్ లో హీరోగా కొనసాగించడం కష్టమే.

బోట‌మ్ లైన్ :ఇలా అయితే కొన్నాళ్లుకు ఇండ‌స్ట్రీలో క‌నిపించ‌వు హీరోగారు.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -