Wednesday, May 8, 2024
- Advertisement -

టీజర్‌తో మెప్పించి ట్రైలర్‌తో ఉసూరనిపించిన సునీల్…… టూ కంట్రీస్ సినిమా కూడా ఆ లిస్టులోనేనా

- Advertisement -

ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తేజ్‌లాంటి స్టార్ హీరోలలో ఈ మధ్య వచ్చిన ఘనమైన మార్పు ఏంటో తెలుసా? కథల ఎంపికలో ఈ స్టార్ హీరోలు తీసుకుంటున్న ప్రత్యేక జాగ్రత్తలు ఏంటో తెలుసా? ప్రేక్షకుల్లో చాలా మందికి తెలుస్తూనే ఉంది కానీ పాపం సునీల్‌కే ఇంకా తెలియడం లేదు. అందుకే ఎనభై, తొంభైల నాటి మూసలో పడి తను ఫ్లాపుల బారిన పడడంతో పాటు తనను నమ్మి థియేటర్‌కి వచ్చిన ప్రేక్షకులకు కూడా చుక్కలు చూపిస్తున్నాడు. రంగు రంగుల బ్రాండెడ్ డ్రెస్సులు, స్కిన్ షో కోసం హీరోయిన్స్, ఫారెన్ లొకేషన్‌లు, ఐదు పాటలు, నాలుగు ఫైట్స్, సినిమా అంతా హీరోయిజం బిల్డప్పుల కాలం పోయిందన్న విషయం ఎన్టీఆర్, పవన్, చరణ్‌లకు ఎప్పుడో అర్థమైంది. టెంపర్ నుంచి ఎన్టీఆర్ తనలోని నటనా ప్రతిభను మెరుగుపెట్టుకుంటూ కథాబలమున్న సినిమాలు ఇస్తున్నాడు. ఇక రామ్ చరణ్ కూడా బ్రూస్‌లీ వరకూ పడ్డ వరుస ఫ్లాప్‌ల దెబ్బకు ధృవ లాంటి కొత్త కథలో మెరిశాడు. ఇక ఇప్పుడు రంగస్థలంలో ఎనభైల నాటి రెగ్యులర్ కుర్రాడిగా కనిపించబోతున్నాడు. కాటమరాయుడు, సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాలతో దారుణంగా దెబ్బలు తిన్న పవన్ కూడా ఇప్పుడు కొత్తగా కనిపించడానికి ట్రై చేస్తున్నాడు. అయితే సునీల్ మాత్రం ఎన్ని ఫ్లాపులు వచ్చినా ఎప్పటికీ మారనని తన తాజా చిత్రం టూ కంట్రీస్ ట్రైలర్‌తో నిరూపించుకున్నాడు.

ఈ సినిమా టీజర్ చాలా మందిని ఆకట్టుకుంది. సునీల్ హీరోయిజం కాస్త తగ్గి మిగతా ఆర్టిస్ట్‌లు, కాస్త ఎమోషన్స్ కూడా కనపడేసరికి ఏదో బాగానే ఉంది అనుకున్నారు. అయితే తాజాగా రిలీజైన ట్రైలర్ దెబ్బతో ఆ ఆశలన్నీ పోయాయి. సినిమాలో ఏమీ లేదు అని ట్రైలర్‌లోనే మేకర్సే చెప్పుకున్నట్టుగా ఉంది. గత కొన్ని సినిమాల్లో ఉన్నట్టుగానే అందంగా కనపడాలన్న సునీల్ తాపత్రయం, బ్రాండెడ్ డ్రెస్సుల మెరుపులే ఈ సినిమా అంతా ఉన్నాయి. ఇక హీరోయిన్స్ స్కిన్ షో కోసం పాటలు అన్న విషయం తెలుస్తూనే ఉంది. ట్రైలర్‌లో కూడా కామెడీ కోసమని చెప్పి బోలెడన్ని పంచ్ డైలాగులు వినిపించారు కానీ ఒక్కటి కూడా కనీసం జబర్ధస్త్ ప్రోగ్రాం స్థాయిలో కూడా లేదు. అయినా జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణలు కూడా చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి హీరోలు చేతుల్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి సాముగారడీలు చేయలేదు. అయినా హీరో అందం, హీరోయిన్స్ స్కిన్ షో, హీరో డ్యాన్సులు చూడడానికి ఇప్పుడు ఎవరూ థియేటర్స్‌కి వెళ్ళడం లేదన్న విషయం సునీల్‌కి ఎప్పటికి అర్థమవుతుందో? ఇక ఈ సినిమా ట్రైలర్‌లో ఉన్న పంచ్ డైలాగులను చూస్తుంటే ఈ సినిమాకు థియేటర్‌కి వెళ్ళడం కంటే యూట్యూబ్‌లో పాత జబర్ధస్త్ వీడియోలు చూసుకుంటే ఇంకా ఎక్కువ నవ్వుకోవచ్చు అనిపిస్తుంది……..అది కూడా పైసా ఖర్చులేకుండా. ప్రారంభంలో తన కష్టంతో తన కెరీర్‌ని అద్భుతంగా మలుచుకున్న సునీల్ ….ఇప్పుడు మాత్రం హీరో అన్న భ్రమల్లో తనేం చేస్తున్నాడో? ఎందుకు చేస్తున్నాడో? ప్రేక్షకులు తన సినిమాలు చూడడానికి ఎందుకు రావాలో? అన్న కనీస విషయాల్లో కూడా అవగాహన లేకుండా వరుసగా దెబ్బలు తింటున్నాడు. ఇప్పుడు టూ కంట్రీస్ ట్రైలర్ చూస్తుంటే ఇది కూడా ఆ బాపతు బొమ్మే అని మాత్రం తెలుస్తూనే ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -