Thursday, May 9, 2024
- Advertisement -

స‌వాల్ లేక‌పోతే… స‌చ్ఛీలత‌ నిరూపించుకోరా?

- Advertisement -
Agrigold issue in AP Assembly

ప్ర‌జా ప్ర‌తినిధులు… త‌మ వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్ట‌మంటే కుద‌ర‌దు. ఎందుకంటే వంద‌లు, వేలు, ల‌క్ష‌ల మందికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ప్ర‌జా ప్ర‌తినిధులు… త‌మ‌ను తాము రోల్ మోడ‌ల్స్‌గా నిరూపించుకోవాల్సిన బాధ్య‌త ఉంద‌న్న విష‌యాన్ని మ‌రిచిపోవ‌డమంటే… విన‌డానికే విడ్డూరంగా ఉంటుంద‌న్న వాద‌న వినిపిస్తోంది.

ప్ర‌జా జీవితంలోకి వ‌చ్చిన త‌ర్వాత వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హారాల‌ను ఇంకా కొన‌సాగిస్తామంటూ కూడా కుద‌ర‌దు. ఎందుకంటే… మీడియా మ‌రింత క్రియాశీలంగా మారిన ప్ర‌స్తుత త‌రుణంలో ప్ర‌తి విష‌యం వెలుగులోకి వ‌స్తున్న నేప‌థ్యంలో ప్ర‌జల‌కు ప్ర‌తినిధులుగా ఉంటున్న ప్ర‌జా ప్ర‌తినిధుల విష‌యంలో మీడియా హ‌ద్దులు గీసుకోవాల‌న్న నిబంధ‌నేమీ లేదు. అయితే ఈ విష‌యంలో మీడియా కూడా కాస్త సంయ‌మ‌నం పాటించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న విషయాన్ని ఎవ‌రూ కాద‌న‌లేకున్నా… నేటి ఏపీ శాస‌న స‌భా స‌మావేశాల్లో భాగంగా విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, చంద్ర‌బాబు కేబినెట్‌లోని కీల‌క శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మ‌ధ్య చోటుచేసుకున్న ఈ విష‌యాన్ని మ‌రోమారు గుర్తుకు తెస్తోంది. 

ఒక్క రాష్ట్రం కాదు… రెండు రాష్ట్రాలు కాదు… ఏకంగా ఆరు రాష్ట్రాల‌కు చెందిన ల‌క్ష‌లాది మంది మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌ను న‌ట్టేట ముంచిన అగ్రిగోల్డ్ వ్య‌వ‌హారంపై తాము చాలా సీరియ‌స్‌గా ఉన్నామ‌ని టీడీపీ స‌ర్కారు చెప్పుకుంది. ఈ క్ర‌మంలో సంస్థ ఆస్తుల‌ను జ‌ప్తు చేయ‌డ‌మే కాకుండా… కంపెనీ ప్ర‌తినిధుల‌ను అరెస్ట్ చేసి, వారు అక్ర‌మంగా కూడ‌గ‌ట్టిన ఆస్తుల‌ను విక్ర‌యించి అయినా… జ‌నాల డ‌బ్బును క‌క్కిస్తామ‌ని కూడా టీడీపీ స‌ర్కారు చెప్పింది. ఈ మాట‌ల‌న్నీ ప్ర‌క‌ట‌న‌ల వ‌ర‌కేన‌ని, చేత‌ల విష‌యంలో ఒక్క అడుగు కూడా ముందుకు ప‌డ‌లేద‌ని వాస్త‌వాలు చెబుతున్నాయ‌ని బాధితులు ఆరోపిస్తున్నారు. విజ‌య‌వాడ‌లోనే కాకుండా ఎక్క‌డ ప‌డితే అక్క‌డ త‌మ ఆవేద‌న‌ను వెళ్ల‌గ‌క్కుతూ నిర‌స‌నలు చేస్తున్నారు. 

ఈ క్ర‌మంలో నేటి అసెంబ్లీ స‌మావేశాల్లో ఈ అంశం ప్ర‌స్తావ‌న‌కు రాగా… అగ్రిగోల్డ్ వ్య‌వ‌హారాన్ని టీడీపీ స‌ర్కారు అట‌కెక్కించేందుకు కంకణం క‌ట్టుకుంద‌ని జ‌గ‌న్ ఆరోపించారు. బాబు కేబినెట్‌లోని మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు అగ్రిగోల్డ్ భూములు కొనుగోలు చేయ‌డ‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని కూడా జ‌గ‌న్ ప‌క్కా ఆధారాల‌తోనే బాధితుల త‌ర‌ఫున ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ క్ర‌మంలో స‌భా క‌మిటీ విచార‌ణ‌కు సిద్ధ‌మ‌ని ప్ర‌త్తిపాటి చెప్ప‌గా, స‌భా క‌మిటీలో ఎవ‌రెవ‌రు ఉంటారో త‌మ‌కు తెలుస‌ని, రోజాపై చ‌ర్య‌ల కోసం ప్రివిలేజెస్ క‌మిటీలానే ఇక్క‌డ కూడా త‌ప్పుడు నివేదిక‌లే ఉంటాయ‌ని జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జ్యుడీషియ‌ల్ విచార‌ణ వేస్తే తప్పించి వాస్త‌వాలు వెలుగుచూడ‌వ‌ని కూడా జ‌గ‌న్ త‌న వాద‌న‌ను కాస్తంత బ‌లంగానే వినిపించారు. 

ఈ వాద‌న‌తో భుజాలు త‌డుముకున్న ప్ర‌త్తిపాటి… స‌రికొత్త వాద‌న‌ను వినిపించారు. జ్యుడీషియ‌ల్ విచార‌ణ‌కు తాను సిద్ధ‌మేన‌ని, విచార‌ణ‌లో త‌న త‌ప్పుంద‌ని తేలితే… తాను రాజ‌కీయాల‌కు శాశ్వ‌తంగా స్వ‌స్తి చెబుతాన‌ని, అదే త‌ప్పు లేద‌ని తేలితే… జ‌గ‌న్ రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటారా? అంటూ స‌వాల్ విసిరారు. ఈ సవాల్‌కు జ‌గ‌న్ స‌రేనంటేనే తాను జ్యుడీషియ‌ల్ విచార‌ణ‌కు సిద్ధ‌మ‌ని ప్ర‌త్తిపాటి త‌న‌దైన శైలిలో వాద‌న వినిపించారు. ఇదే వాద‌న‌ను చంద్ర‌బాబు కూడా వినిపించినా… ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మంత్రిగా ప్ర‌త్తిపాటి నోట ఈ వాద‌న వినిపించ‌డ‌మే ఇక్కడ గ‌మ‌నార్హం. అంటే… స‌వాళ్లు లేకుంటే స‌చ్ఛీల‌త నిరూపించుకోవాల్సిన అవ‌స‌రం లేదా? అన్న ప్ర‌శ్న జ‌నాల నుంచి వినిపిస్తోంది. మ‌రి ఈ ప్ర‌శ్న‌కు ప్ర‌త్తిపాటి ఏం స‌మాధానం చెబుతారో చూడాలి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -