Monday, April 29, 2024
- Advertisement -

16 నిమిషాల్లోనే వ్యోమ‌గాముల‌ను అంత‌రిక్షంలోకి…ఇస్రో

- Advertisement -

త్వ‌ర‌లో ఇస్రో అంత‌రిక్ష మాన‌వ స‌హిత ప్ర‌యోగానికి సిద్ధ‌మ‌వుతోంది. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్లుగా 2022 నాటికి అంత‌రిక్షంలోకి వ్యోమ‌గాముల‌ను ఇస్రో పంపుతుంద‌ని తెలిపారు. ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది ఇస్రో.

ఇప్ప‌టికే ఇప్పటికే చంద్రుడు, అంగారకుడిపైకి విజయవంతంగా స్పేస్‌క్రాఫ్ట్‌లను పంపించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. ఇక అంతరిక్షంలోకి తొలిసారి ఓ భారతీయుడిని పంపించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాని మోదీ చెప్పినట్లుగా 2022లోగా కచ్చితంగా అంతరిక్షంలోకి మనిషిని పంపించి తీరుతామని ఇస్రో చైర్మన్ శివన్ స్పష్టంచేశారు.

మాన‌వ స‌హిత అంత‌రిక్ష యాత్ర‌లో భాగంగా ముగ్గురు భార‌త వ్యోమ‌గాముల‌ను అంత‌ర‌క్షంలోకి పంపుతామ‌ని శివ‌న్ తెలిపారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ స్టేషన్ నుంచి లాంచ్ చేయగానే కేవలం 16 నిమిషాల్లో వీళ్లు అంతరిక్షంలోకి వెళ్తారని ఆయ‌న తెలిపారు. అక్కడ ఐదు నుంచి ఏడు రోజుల పాటు గడిపిన తర్వాత క్రూ మాడ్యూల్ గుజరాత్ తీరానికి సమీపంలో అరేబియా సముద్రంలో దిగుతుందని ఆయన వెల్లడించారు.

దీనికి గగన్‌యాన్ అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఈ మిష‌న్‌గురించి శివ‌న్ తెలిపారు. ఈ ప్రయోగం కోసం జీఎస్ఎల్వీ ఎ‌మ్‌కే 3 అడ్వాన్స్‌డ్ వర్షన్ రాకెట్‌ను వినియోగించనున్నట్టు చెప్పారు. ముగ్గురు భారత వ్యోమగాములతో కూడిన క్రూ మాడ్యూల్‌ను సర్వీస్ మాడ్యూల్‌కు జతచేసి ఈ రాకెట్ ద్వారా కక్ష్యలోకి పంపుతామని వెల్లడించారు. శ్రీహరికోట నుంచి ప్రయోగించే ఈ రాకెట్ వ్యోమగాములను భూమికి 300 నుంచి 400 కి.మీ. దూరంలో ఉండే కక్ష్యలోకి 16 నిమిషాల లోపలే తీసుకెళ్తుందని వివరించారు. మాడ్యూల్‌లో ఉండే ముగ్గురు వ్యోమగాములు ఐదు నుంచి ఏడు రోజుల పాటు అంతరిక్షంలో గడుపుతారని, ఈ సమయంలో వారు అక్కడ పలు సూక్ష్మ గురుత్వాకర్షణ, శాస్త్రీయ పరిశోధనలు చేస్తారని శివన్ చెప్పారు.

భూమికి 120 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకునేలోపు క్రూ మాడ్యూల్, సర్వీస్ మాడ్యూల్ వేరవుతాయి. క్రూ మాడ్యూల్ తన వేగాన్ని తగ్గించుకోవడానికి ఏరోబ్రేక్ వేస్తుంది. అరేబియా సముద్రంలో దిగే ముందు పారాషూట్లు ఓపెన్ అవుతాయి. తిరుగు ప్రయాణానికి 36 నిమిషాలు పడుతుంది అని ఇస్రో చీఫ్ శివన్ చెప్పారు. ఒకవేళ ఏదైనా సాంకేతిక సమస్య ఎదురైతే.. అందులోని ఆస్ట్రోనాట్లను బంగాళాఖాతంలో దిగేలా కూడా ప్లాన్ చేసినట్లు తెలిపారు.

సముద్రంలో దిగిన తర్వాత కేవలం 20 నిమిషాల్లోనే వాళ్లను మాడ్యూల్ నుంచి బయటకు తీసుకొస్తామని శివన్ స్పష్టంచేశారు. క్రూ మాడ్యూల్ బరువు 7 టన్నుల వరకు ఉంటుందని చెప్పారు. మొదట 30 నెలల్లోగా మానవరహిత స్పేస్‌క్రాఫ్ట్ పరీక్షను నిర్వహిస్తాం.. తర్వాత 36 నెలల్లోపు మరోసారి ఇదే పరీక్ష జరుగుతుంది. చివరిగా 40 నెలల్లోపు మానవసహిత స్పేస్‌క్రాఫ్ట్‌ను లాంచ్ చేస్తాం అని శివన్ వెల్లడించారు.

అంతరిక్షంలోకి వెళ్లే వాళ్లకి స్పేష్‌సూట్ సిద్ధంగా ఉంది. శిక్షణ నిమిత్తం వారిని బెంగళూరు పంపుతాం. అనంతరం విదేశాలకు తీసుకెళ్తాం. ఇప్పటికే రాకేష్ శర్మ (అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడు – 1984)తో సంప్రదింపులు జరుపుతున్నాం. ఈ అంతరిక్ష ప్రయోగం కోసం రాకేష్ శర్మ సలహాలు కూడా తీసుకుంటున్నాం’ అని వెల్లడించారు.

అంతరిక్షంలోకి పంపే భారతీయుల్లో ఒక మహిళ కూడా ఉంటుందని మంత్రి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. శిక్షణలో భాగంగా వ్యోమగాములను విదేశాలకు పంపుతామన్నారు. 2022 నాటికి అంతరిక్షంలోకి మానవులను పంపిన నాలుగో దేశంగా రష్యా, యూఎస్, చైనా సరసన భారత్ నిలుస్తుందని జితేంద్ర చెప్పారు. మానసహిత అంతరిక్ష ప్రయోగాలకు ఇతర దేశాలు కేటాయించిన బడ్జెట్‌ కన్నా ఇది చాలా తక్కువ అని అన్నారు. ఇస్రో వార్షిక బడ్జెట్ రూ.6వేల కోట్లకు ఇది అదనమని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -