Monday, April 29, 2024
- Advertisement -

మా ఫోన్లు ట్యాప్ చేసేస్తున్నారు ‘బాబో’య్

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తన ఫోన్లను ట్యాప్ చేయిస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో రాజ్ నాథ్ తో భేటీ అయిన కన్నా ఏపీలో శాంతి భద్రతలు లేవని చెప్పారు. టీడీపీ అవినీతి, అక్రమాలపై ఎవరైనా ప్రశ్నిస్తే ఏకంగా దాడులకే దిగుతున్నారని ఆరోపించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు తమపై దాడులకు పాల్పడ్డ సమయంలో ఆత్మరక్షణ కోసం ప్రయత్నిస్తే, తిరిగి బీజేపీ నేతలు కార్యకర్తలపైనే అక్రమ కేసులు బనాయించి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి పర్యటనకు వచ్చినప్పుడు అమిత్ షాపైన, ఇటీవల తనపై అనంతపురంలో, ఎమ్మెల్సీ సోము వీర్రాజు మీదా ఇలాగే దాడులు చేయించారని కన్నా ఫిర్యాదు చేశారు. ఓటుకు నోటు కేసులో తెలంగాణ సర్కార్ ఏ టెక్నాలజీ అయితే ఉపయోగించిందో, అదే టెక్నాలజీతో తన ఫోన్ ట్యాప్ చేయిస్తున్నారని మండిపడ్డారు. పోలీసుల ద్వారా ఫోన్లు ట్యాప్ చేయించడమే కాకుండా, పోలీస్ కేసులు పెట్టి రాజకీయ ప్రత్యర్ధులను వేధిస్తున్నారని రాజ్ నాథ్ వద్ద చెప్పుకున్నారు. అనంతరం రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తోనూ కన్నా భేటీ అయి ఇదే అంశాన్ని చెప్పి, మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న వారిపై కఠినచర్యలు తీసుకోవాలని కోరారు.

వచ్చే ఎన్నికల్లో ఏపీలోని అన్ని పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు బీజేపీ పోటీ చేస్తుందని కేంద్రమంత్రులతో భేటీ తర్వాత కన్నా లక్ష్మీనారాయణ మీడియాకి తెలిపారు. ఏపీలో బీజేపీ ఎవరితో పొత్తు పెట్టుకోవాలనేది అధిష్ఠానం నిర్ణయిస్తుందని, కానీ 175 అసెంబ్లీ స్థానాల్లోనూ సింగిల్ గానే బరిలోకి దిగాలని తనకు చెప్పిందని కన్నా తెలిపారు. కేంద్రం ఇచ్చిన నిధులను దుర్వినియోగం చేసి, టీడీపీ నేతలు పక్కదారి పట్టించారని ఆరోపించారు. వాటి లెక్కలు అడుగుతున్నందుకే ప్రత్యర్ధులపై దాడులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశామన్నారు. వీటన్నంటిపైనా విచారణ జరిపిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని కన్నా తెలిపారు.

అయితే కన్నా లక్ష్మీనారాయణ ఫిర్యాదు ఎపిసోడ్, బిజేపీ ముందే రాసుకున్న పక్కా స్క్రిప్ట్ అని టీడీపీ అంటోంది. ఏపీలో శాంతిభద్రతల ముసుగులో, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల విచారణతో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికే ఆ పార్టీ ఆడిస్తున్న డ్రామాలో భాగమే కన్నా ఫిర్యాదని టీడీపీ నేతలంటున్నారు. ఇక నేడో రేపో ఆ ఫిర్యాదుపై విచారణ పేరుతో హడావుడి చేసి, తమపై అబాంఢాలు మోపి, ఇరికించే కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇదంతా ఆపరేషన్ గరుడలో భాగమేనని, ఏపీలో ఎలాగైనా అల్లకల్లోలం సృష్టించి, విధ్వంసానికి పాల్పడి, శాంతిభద్రతల పరిరక్షణలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందనే భావన ప్రజల్లో కల్పించాలనే నీచ రాజకీయాలకు బీజేపీ పాల్పడుతోందని టీడీపీ సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాలను త్వరలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి, మోడీ, అమిత్ షా, కన్నా కుట్రలు, కుతంత్రాలను బయట పెడతామని హెచ్చరిస్తున్నారు. వారి స్వార్ధం కోసం, ఏపీలో అధికారం కోసం ఆపరేషన్ గరుడను విజయవంతం చేయడానికి బీజేపీ ఎంతకైనా తెగిస్తుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మొత్తానికి టీడీపీ బీజీపీ వార్ రోజురోజుకూ ముదిరి పాకానా పడుతోంది. మరి అంతిమ విజేత ఎవరో తేలాలంటే ఎన్నికల దాకా ఆగాల్సిందే. అంతవరకూ ఈ ఆరోపణలు, వాగ్భాణాలు, సవాళ్లు, ప్రతిసవాళ్లు మనకు ఇష్టం లేకున్నా తప్పవు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -